పఠాన్‌.. పాక్‌పై నీ హ్యాట్రిక్‌ ఇంకా గుర్తుంది - irfan pathan becomes the first cricketer to take hattrick on opening over in test cricket against pakistan
close
Updated : 29/01/2021 15:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పఠాన్‌.. పాక్‌పై నీ హ్యాట్రిక్‌ ఇంకా గుర్తుంది

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ టెస్టుల్లో తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై. ఈ ఘనత సాధించి నేటికి 15 ఏళ్లు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఐసీసీ నాటి ఫొటోను అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది. ఆ విశేషాలు మనం కూడా ఓసారి గుర్తు చేసుకుందాం.

అది 2006 టీమ్‌ఇండియా పాకిస్థాన్‌ పర్యటన. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా కరాచిలోని నేషనల్‌ స్టేడియంలో మూడో టెస్టు జరిగింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌కు పఠాన్‌ అదిరిపోయే శుభారంభం ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే ప్రమాదకర సల్మాన్‌ భట్‌‌, యూనిస్‌ఖాన్‌, మహ్మద్‌ యూసుఫ్‌ను పెవిలియన్‌ చేర్చాడు. తొలుత ఓపెనర్‌గా వచ్చిన భట్‌ స్లిప్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ చేతికి చిక్కగా, తర్వాతి బంతికే యూనిస్‌ ఎల్బీగా వెనుతిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన యూసుఫ్‌ బౌల్డవ్వడంతో పఠాన్‌ హ్యాట్రిక్‌ తీశాడు.

ఇక ఆరోజు లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అబ్దుల్‌ రజాక్‌(45), కమ్రన్‌ అక్మల్‌(113), షోయబ్‌ అక్తర్‌(45) రాణించడంతో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేసింది. అనంతరం టీమ్‌ఇండియా 238 పరుగులు చేయగా, పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో 599/7 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఆపై భారత్‌ 265 పరుగులకే ఆలౌటై 341 పరుగుల భారీ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా ఓటమిపాలైనా ఇర్ఫాన్‌ పఠాన్‌ హ్యాట్రిక్‌ చిరస్థాయిలో నిలిచిపోయింది. కాగా, పఠాన్‌ టీమ్‌ఇండియా తరఫున కొద్దికాలమే ఆడినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. గతేడాది జనవరి 4న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఇవీ చదవండి..
పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాలని ఉంది: పుజారా
నట్టూ.. చేయాల్సింది చాలా ఉంది: ఇర్ఫాన్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని