వీళ్లదీ... ‘రాధే’ దారే! - is this bollywood awaited movies release in ott
close
Published : 20/05/2021 11:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీళ్లదీ... ‘రాధే’ దారే!

సల్మాన్‌ స్ఫూర్తితో అగ్రహీరోలు ముందుకు వెళ్లనున్నారా?

కరోనా కొట్టిన దెబ్బ చిత్ర సీమకు గట్టిగానే తగిలింది. లాక్‌డౌన్‌తో సినిమాలు తీయడం ఆపేశారు. ఇప్పటికే పూర్తయిన సినిమాలు మాటేంటి? వాటికి కనిపించే ఒకే ఒక్క దారి ఓటీటీ. కొందరు దర్శకనిర్మాతలు ఎక్కువ ఆలోచించకుండా  ఓటీటీలో విడుదల చేస్తుంటే కొందరు ఆచితూచి అడుగులేస్తున్నారు. తప్పకపోతే చివరి మార్గంగా ఓటీటీని ఎంచుకుంటున్నారు. అగ్ర హీరోల సినిమాలు ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాయి.

కరోనా రెండోదశ ఉద్ధృతికి చాలా పెద్ద సినిమాల నిర్మాతలు కొన్ని రోజులు ఆగి థియేటర్‌లోనే విడుదల చేస్తామని  ప్రకటించారు. సల్మాన్‌ఖాన్‌ ‘రాధే:యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’ మాత్రం తెగించి ముందుకెళ్లాడు. ఈ చిత్రాన్ని అవకాశమున్న చోట థియేటర్‌లో విడుదల చేశారు. దీంతో పాటు   ‘పే పర్‌ వ్యూ’ పద్ధతిలోనూ  ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జయాపజయాల మాట ఎలా ఉన్నా సల్మాన్‌ సినిమా అనేసరికి అభిమానులు ఎగబడ్డారు. ఎంతలా అంటే ఈ  సినిమాను జీ ప్లెక్స్‌లో రూ.249 పెట్టి చూడటానికి చాలామంది వెనకాడలేదు. దీంతో తొలి రోజు జీ ప్లెక్స్‌ సర్వర్లు క్రాష్‌ అయ్యాయి. తొలి రోజు 4.2 మిలియన్‌ ప్రేక్షకులు ఈ సినిమా వీక్షించారు. మే 13న విడుదలైన ఈ సినిమాని వారాంతానికి 9.9 మిలియన్‌ ప్రేక్షకులు చూసినట్టు అంచనా. పే పర్‌ వ్యూ పద్ధతిలో ఇంత    భారీ స్పందనను నిర్వాహకులు ఊహించలేదు. డిజిటల్‌ బాటలో ‘రాధే..’ దుమ్ముదులిపే సరికి దర్శకనిర్మాతల్లో కొత్త ఉత్సాహం చేరింది. ముఖ్యంగా అగ్ర హీరోలతో   సినిమాలు చేసి విడుదల కోసం వేచి చూస్తున్న దర్శకనిర్మాతలకు ‘రాధే..’భరోసానిచ్చాడు. దీంతో మరిన్ని సినిమాలు ఇదే బాటలో వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. సినిమా అంతగా బాగోలేకపోయినా సల్మాన్‌ ఖాన్‌ క్రేజ్‌తో ‘రాధే’ ఈ స్థాయిలో డిజిటల్‌ హిట్‌ అయ్యిందంటే సినిమా మరింత బాగుండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

చర్చల్లో నిర్మాతలు

అక్షయ్‌కుమార్‌ ‘సూర్యవంశీ’, రణ్‌వీర్‌సింగ్‌ ‘83’, అజయ్‌దేవ్‌గణ్‌ ‘మైదాన్‌’, సల్మాన్‌ కీలక పాత్రలో నటించిన ‘అంతిమ్‌: ది ఫైనల్‌ ట్రూత్‌’ లాంటి క్రేజీ చిత్రాలన్నీ ‘పే పర్‌ వ్యూ’ దారిలో వెళ్లే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నట్టు సమాచారం. ఆ దిశగా ఓటీటీ నిర్వాహకులతో దర్శకనిర్మాతలు గట్టిగానే చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో రోహిత్‌శెట్టి తెరకెక్కించిన చిత్రం ‘సూర్యవంశీ’. పోలీస్‌ కథతో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇందులో రణ్‌వీర్‌సింగ్, అజయ్‌దేవ్‌గణ్‌ అతిథి పాత్రల్లో నటించారు. కత్రినాకైఫ్‌ నాయిక. ఈ సినిమా చిత్రీకరణ పూర్తై సంవత్సరంపైగానే అయ్యింది. కరోనా వల్ల విడుదలకు పరిస్థితులు అనుకూలించడం లేదు.

రణ్‌వీర్‌సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘83’. భారత్‌ క్రికెట్‌ జట్టు ప్రపంచ కప్‌ గెలుచుకున్న నేపథ్యంతో  తెరకెక్కింది. అప్పటి టీం ఇండియా కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ నటించాడు. దీపికా పదుకొణె కీలక పాత్రలో నటించింది. దీనికి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఈ రెండు చిత్రాల్ని ఏది ఏమైనా థియేటర్‌లోనే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తూ వస్తోంది. కానీ ‘రాధే..’ డిజిటల్‌ విజయంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారట.

సల్మాన్‌ బావమరిది అమిత్‌శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అంతిమ్‌’. ఈ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్‌ ఫిలిమ్స్‌ నిర్మించడంతో పాటు సల్మాన్‌ కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. ఇక అజయ్‌దేవ్‌గణ్‌ నటించిన ‘మైదాన్‌’ సినిమాకి జీ స్టూడియోస్‌ నిర్మాణ భాగస్వామి. దీంతో ఈ సినిమా కూడా ‘రాధే..’ని అనుసరించే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. ‘‘సూర్యవంశీ’, 83’ ఈ రెండు పెద్ద చిత్రాలు ‘పే పర్‌ వ్యూ’ పద్ధతిలో విడుదల చేయడానికి చర్చలు సాగుతున్నాయి. దాదాపు సంవత్సర కాలంగా ఈ సినిమాలు విడుదల కోసం ఎదురుచూస్తున్నాయి. ‘అంతిమ్‌’, ‘మైదాన్‌’... ‘పే పర్‌ వ్యూ’ పద్ధతిలో విడుదల చేయడానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. దీంతో పాటు దక్షిణాదికి చెందిన రెండు భారీ చిత్రాలు ఈ దారిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’’అని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

లాభసాటేనా?

థియేటర్లు ఇప్పట్లో తెరిచే పరిస్థితులు బాలీవుడ్‌లో కనిపించడం లేదు. ఒకవేళ తెరిచినా ప్రేక్షకులు భారీగా వస్తారనేది అనుమానమే. మరోవైపు ఓటీటీ నిర్వాహకులు భారీ ధరలు పెట్టి సినిమాలు కొనడానికి ముందుకొస్తున్నారు. దీంతో డిజిటల్‌ దారిలో వెళ్లి హిట్‌ కొడితే తప్పేముంది అనేది చాలామంది వాదన. ఎక్కువమంది  ప్రేక్షకులు డిజిటల్‌లో చూడటానికి సిద్ధంగా ఉన్నారని తెలిసినప్పుడు ‘పే పర్‌ వ్యూ’ పద్ధతిలో విడుదల చేస్తే నిర్మాతలు నష్టాల నుంచి గట్టెక్కొచ్చు కదా అని కొందరు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగి అగ్ర హీరోల చిత్రాలు ‘పే పర్‌ వ్యూ’ పద్ధతిలో విడుదల అయితే నిర్మాతలకు మంచి లాభసాటి మార్గం దొరికినట్టే. పైగా డిస్ట్రిబ్యూషన్‌ సమస్యలు, థియేటర్ల గొడవలు ఏమీ ఉండవు కదా? అని వారు ఆలోచిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని