యుద్ధానికి వెళ్తున్న ఫీలింగ్‌ అది: గిల్‌ - it felt like going to war shubman gill on test debut in australia
close
Published : 11/03/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యుద్ధానికి వెళ్తున్న ఫీలింగ్‌ అది: గిల్‌

అహ్మదాబాద్‌: అరంగేట్రం మ్యాచులో బ్యాటింగ్‌కు వెళ్తున్నప్పుడు యుద్ధానికి వెళ్తున్న అనుభూతి కలిగిందని టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అన్నాడు. ఒకప్పుడు ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచుల్ని చూసేందుకు ఉదయం 4:30 గంటలకు నిద్రలేచేవాడినని చెప్పాడు. ఇప్పుడు అదే ఆసీస్‌పై తన ఆటను చూసేందుకు అభిమానులు నిద్రలేవడం వింతైన అనుభూతిగా వర్ణించాడు. ఆసీస్‌ సిరీసులో 259 పరుగులు చేసిన గిల్‌ టీమ్‌ఇండియా 2-1తో విజయం సాధించడంలో కీలకంగా నిలిచాడు.

‘ఆసీస్‌పై రెండో టెస్టులో ఫీల్డింగ్‌ చేసేంతవరకు సాధారణంగానే ఉన్నా. చివరికి మేం బ్యాటింగ్‌కు దిగినప్పుడు, డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి పిచ్‌ వద్దకు నడుస్తున్నప్పుడు, అభిమానులు అరుస్తున్నప్పుడు.. వింతగా అనిపించింది! నిజానికి యుద్ధానికి వెళ్తున్న అనుభూతి కలిగింది’ అని గిల్‌ అన్నాడు. రవిశాస్త్రి తనకు టెస్టు టోపీ అందజేసినప్పుడు ఎన్నో భావోద్వేగాలు కలిగాయని పేర్కొన్నాడు.

‘అదో అనిర్వచనీయ అనుభూతి. విపరీతమైన భావోద్వేగం కలిగినప్పుడు కొన్నిసార్లు మాటలు రావు. అప్పుడు నేనలా ఉన్నా. రవిశాస్త్రి జట్టుతో మాట్లాడాడు. ఆ తర్వాత నాకు టోపీ ఇచ్చాడు. వెంటనే టాస్‌ వేశారు. మేం ఫీల్డింగ్‌కు వెళ్లిపోయాం’ అని గిల్‌ అప్పటి సంగతులు గుర్తు చేసుకొన్నాడు.

ఆస్ట్రేలియాలో అరంగేట్రంపై ఏమనిపిస్తోందని ప్రశ్నించగా ‘నా బాల్యంలో ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచులు చూసేందుకు ఉదయం 4:30-5:00 గంటలకు నిద్రలేచేవాడిని. ఇప్పుడు అభిమానులు నా ఆట చూసేందుకు ఉదయం నిద్రలేస్తున్నారు. అదో గొప్ప అనుభూతి. ఆసీస్ సిరీసులు చూసేందుకు నా తండ్రి ఉదయాన్నే నన్ను నిద్రలేపడం ఇప్పటికీ గుర్తుంది. అప్పట్లో బ్రెట్‌లీ బౌలింగ్, సచిన్‌ బ్యాటింగ్‌ చూసేందుకు సరదాగా ఉండేది. ఇప్పుడదే ఆసీస్‌ బౌలర్లకు నాకు బంతులేస్తుండటం వింతగా అనిపించింది. ప్రపంచం నా ఆటను చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. టీమ్‌ఇండియా డ్రస్సింగ్‌ రూమ్‌ వాతావరణం చాలా బాగుంటుంది. ఏదేమైనా ఎవ్వరినీ కొట్టిపారేయకూడదు’ అని గిల్‌ పేర్కొన్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని