ఆల్‌రౌండర్‌గా ఉండటం చాలా కష్టం: జడేజా - jadeja says its tough being an all-rounder have to do well in all departments
close
Updated : 29/04/2021 12:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆల్‌రౌండర్‌గా ఉండటం చాలా కష్టం: జడేజా

ఒకే ఒక్కడు మమ్మల్ని పూర్తిగా దెబ్బతీశాడు: కోహ్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆల్‌రౌండర్‌గా కొనసాగడం చాలా కష్టమని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కీలక ఆటగాడు రవీంద్ర జడేజా అన్నాడు. ఆదివారం రాత్రి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ ‘వన్‌ మ్యాన్‌ షో’ చేసిన సంగతి తెలిసిందే. బ్యాట్‌తో 62 పరుగులు, బంతితో మూడు వికెట్లు తీసి ఈ సీజన్‌లో బెంగళూరుకు తొలి షాక్‌ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ ఆల్‌రౌండర్‌గా ఉండటం అంత తేలిక కాదన్నాడు. జట్టు విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించడం బాగుంటుందని, దాన్ని ఆస్వాదించానని చెప్పాడు.

‘నా ఫిట్‌నెస్‌ మీద దృష్టిసారించి చాలా కసరత్తులు చేస్తున్నా. అదృష్టం కొద్దీ అది ఈ మ్యాచ్‌లో కలిసొచ్చింది. ఆల్‌రౌండర్‌గా ఉండటం చాలా కష్టం. అన్ని విభాగాల్లో రాణించాలి. అయితే, నేను సాధన చేసేటప్పుడు ఒకే రోజు మూడు విభాగాల్లో(బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌) కష్టపడను. ఒక రోజు నైపుణ్యాలపై, మరో రోజు ఫిట్‌నెస్‌పై.. ఇలా ఒక ప్రణాళిక పరంగా సాధన చేస్తా. ఇక ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో దంచి కొట్టాలని నిర్ణయించుకున్నా. మహీభాయ్‌ కూడా.. హర్షల్‌ బంతుల్ని ఆఫ్‌స్టంప్‌ అవతల విసురుతాడని చెప్పాడు. అందుకోసం సిద్ధంగా ఉన్నా. అదృష్టంకొద్దీ అన్నీ కలిసొచ్చి నేను దంచికొట్టాను. దాంతో జట్టు స్కోర్‌ 191 పరుగులకు చేరింది. నేను బ్యాటింగ్‌ ఆడే అవకాశం వస్తే ఎక్కువ పరుగులు చేయాలని ముందే అనుకున్నా’ అని జడేజా చెప్పుకొచ్చాడు.

బెంగళూరు తొలి ఓటమిపై కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ దీన్ని తాము సానుకూలంగా తీసుకుంటామని చెప్పాడు. ‘ఈ ఫలితాన్ని సరైన పద్ధతిలో చూడాలి. టోర్నీ ఆరంభంలోనే ఇలాంటి ప్రదర్శన చేయడం ఒకింత మంచిదే. మా ఆరంభం బాగానే సాగింది కానీ, ఒకే ఒక్కడు మమ్మల్ని పూర్తిగా దెబ్బతీశాడు. ఈరోజు అతడి ప్రదర్శన చూడదగినది. ఇక మా బౌలర్‌ హర్షల్‌ బాగా బంతులేశాడు. అతడు తీసిన రెండు కీలక వికెట్లు చెన్నైను దెబ్బతీశాయి. కానీ చివర్లో జడేజా మ్యాచ్‌ను తమ చేతుల్లోకి లాగేసుకున్నాడు. ఈ ఓటమిని సరైన పద్ధతిలో సమీక్షించుకోవాలి. అలాగే నేను దేవ్‌దత్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తున్నా. దాంతో మా బ్యాటింగ్ లైనప్‌ బలమెంతో పరీక్షిస్తున్నాం. అయితే, జడేజా ఇలా అన్ని విభాగాల్లో రాణించడం నాకు సంతోషం కలిగించింది. ఇంకో రెండు నెలల్లో అతడు టీమ్ఇండియా తరఫున ఆడతాడు. జట్టులో ఇలాంటి కీలక ఆల్‌రౌండర్‌ చెలరేగితే చూడటం ఆనందంగా ఉంటుంది. అతడిలాగే ఆత్మవిశ్వాసంతో బాగా ఆడుతుంటే మరిన్ని అవకాశాలు వస్తాయి’ అని కోహ్లీ ప్రశంసలు కురిపించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని