యూట్యూబ్‌.. థియేటర్‌లను ఓ ఊపు ఊపేశాయి - janapadalu in movies
close
Updated : 03/05/2021 09:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూట్యూబ్‌.. థియేటర్‌లను ఓ ఊపు ఊపేశాయి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు జానపద గేయాలు అంటే పల్లెటూళ్లలో.. పొలాల్లో.. జనాలు ఆలపిస్తుంటే వినిపించేది. కానీ.. ఈ ట్రెండ్‌ మారింది. దర్శకులు తమ సినిమాల్లో ఒక్కటైనా జానపదం ఉండేలా ఆసక్తి చూపిస్తున్నారు. లేదా జానపదంలోని పదాన్ని తమ పాటలో వచ్చేలా చూసుకుంటున్నారు అందుకే ‘మగధీర’లోని ‘ఏం పిల్లడూ’ నుంచి మొదలుకొని.. ‘లవ్‌స్టోరీ’లోని ‘సారంగదరియా’ వరకూ జానపద గేయాలు తెరపై కనిపించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలా వచ్చి ఈ మధ్యకాలంలో బాగా అలరించిన జానపదాల్లో కొన్ని..

* 150మిలియన్లు.. యూట్యూబ్‌లో ‘సారంగ దరియా’కు వచ్చిన వీక్షణలు. ప్రస్తుతం ఇదే ట్రెండింగ్‌లో ఉంది. వీక్షణల పరంపర కొనసాగుతోంది. ‘లవ్‌స్టోరీ’ చిత్రంలోని ఈ పాటను సుద్దాల అశోక్‌తేజ రచించారు. పవన్‌ సంగీతం అందించగా మంగ్లీ ఆలపించారు. 

* ‘శ్రీకారం’ చిత్రంలోని ‘వస్తానంటివో పోతానంటివో‘ పాట కుర్రకారును ఒక ఊపు ఊపింది. పెంచల్‌ దాస్‌ రచించి, ఆలపించారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించారు. 

* 2020లో వచ్చిన ‘పలాస’ చిత్రలోని ‘నక్కిలీసు గొలుసు’.. యూట్యూబ్‌లో రికార్డులు సృష్టింది. ఉత్తరాంధ్ర జానపదం నుంచి సేకరించిన ఈ పాటకు రఘు కుంచె సంగీతం అందించడంతో పాటు ఆలపించారు. ‘బావొచ్చాడు లక్కా బావొచ్చాడు’ పాట కూడా బాగా  ఆకట్టుకుంది. ఈ పాటను అదితి భావరాజు ఆలపించగా.. రఘు కుంచె సంగీతం సమకూర్చారు. ‘కళావతి.. కళావతి’ అనే జానపదం కూడా ‘పలాస’లోనిదే. రఘు కుంచె, రమ్య బెహ్రా కలిసి ఆలపించారు. సుద్దాల అశోక్‌తేజ రచించారు.  

* ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘సిత్తరాల సిరపడు’ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాట అందర్నీ మెప్పించింది. విజయ్‌కుమార్‌ భల్ల రచించగా.. తమన్‌ సంగీతం అందించారు. సూరన్న, సాకేత్‌ ఆలపించారు.

* దారి చూడు దమ్మూ చూడు మామ అంటూ వచ్చిన చిత్తూరు జిల్లా జానపద గేయం అప్పట్లో దుమ్ములేపింది. నాని హీరోగా వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలోనిదీ పాట. జానపద గాయకుడు, రచయిత పెంచల్‌ దాస్‌ రచించి.. ఆలపించారు. హిపాప్‌ తమిళ ఈ పాటకు సంగీతం అందించారు.

* మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాలోనూ ఒక జానపద గేయం ఉంది. ‘నాయుడోరింటికాడ’ అంటూ సాగే ఆ పాటను అంజన సౌమ్య, రమ్య బెహ్రా కలిసి ఆలపించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించారు. ఈ పాట కూడా బాగా అలరించింది.

* 2009లో వచ్చిన ‘మగధీర’లోని జానపదం ‘ఏం పిల్లడో ఎల్దామొస్తవా’ అంటూ సాగే జానపదం అప్పట్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ పాటకు కీరవాణి సంగీతం అందించగా.. గీతా మాధురి ఆలపించారు. థియేటర్లలో ప్రేక్షకుతో కేరింతలు పెట్టించిందీ పాట.

* ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలో కాసేపు జానపద గేయం ‘గున్నాగున్నా మామిడి’ అందరితో స్టెప్పులేయించింది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని