ప్రతి అమ్మాయి కోసం మేం ఆడుతున్నాం: జెమీమా - jemimah rodrigues heartfelt msg after receiving the team india test jersey
close
Published : 31/05/2021 18:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతి అమ్మాయి కోసం మేం ఆడుతున్నాం: జెమీమా

(Photo: Jemimah Rodrigues twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ మరికొద్ది రోజుల్లో కెరీర్‌లో తొలి టెస్టు ఆడనుంది. వచ్చేనెల ఇంగ్లాండ్‌లో ఓ టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న నేపథ్యంలో కెప్టెన్‌ మిథాలి రాజ్‌, సీనియర్‌ క్రికెటర్‌ జూలన్‌ గోస్వామి ఆమెకు కొత్త జెర్సీ అందించారు. ఆ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న జెమీమా భావోద్వేగం చెందింది. క్రికెట్‌ ఆడాలని కలలు కనే ప్రతి అమ్మాయి తరఫున తాము ఆడుతున్నామని పేర్కొంది.

‘ఈరోజు మా కోచ్‌ రమేశ్‌ పొవార్‌ మమ్మల్ని జట్టు సమావేశానికి ఆహ్వానించి టీమ్‌ఇండియా మహిళా క్రికెట్‌ చరిత్రను తెలియజేశారు. ఎలా మొదలైంది.. ఎలా సాగింది.. ఇప్పుడు ఎక్కడికి చేరిందనే విషయాలనూ పూర్తిగా చూపించారు. మా వెనుకటి తరాల క్రికెటర్లు.. ఈరోజు మేమున్న పరిస్థితులకు కారణమయ్యేలా ఎంతో కృషి చేశారు. వాళ్లకు దక్కాల్సిన గుర్తింపు దక్కకున్నప్పటికీ భారత్‌కు మహిళల క్రికెట్‌ను తీసుకొచ్చారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అని జెమీమా పాతతరం క్రికెటర్లను కొనియాడింది.

అనంతరం మిథాలి రాజ్, జూలన్‌ గోస్వామి లాంటి దిగ్గజాలు ఆ సమావేశంలో తమకు క్రికెట్‌ అంటే ఎంత ఇష్టమో జట్టుతో పంచుకున్నారని, ఈ ప్రయాణంలో భాగం కావడం ఎంత గొప్ప విశేషమో తెలియజేశారని జెమీమా పేర్కొంది. తాము కూడా భవిష్యత్‌ తరాలకు మంచి మార్గనిర్దేశకులుగా ఉంటామని చెప్పింది. తాము అందుకునే ఈ జెర్సీని అత్యున్నత స్థాయికి చేర్చి వెళ్లాలనే సందేశంతో సమావేశం ముగిసిందని తెలిపిందామె. అలాగే త్వరలో ఇంగ్లాండ్‌తో ఆడబోయే సిరీస్‌లో టీమ్‌ఇండియా తరఫున క్రికెట్‌ ఆడాలనుకునే ప్రతి అమ్మాయి కోసం తాము ఆడుతున్నామని జెమీమా పేర్కొంది. కాగా, జూన్‌ 16 నుంచి మిథాలి సేన ఇంగ్లిష్ మహిళలతో తొలి టెస్టు ఆడనుండగా తర్వాత మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం టీమ్‌ఇండియా క్రికెటర్లు ముంబయిలోని ఓ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. జూన్‌ 2 లేదా 3న ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళనున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని