దేవుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు! - k viswanath emotional heartfelt words about SPB
close
Published : 26/09/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేవుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు!

‘వాడు నా ఆరో ప్రాణం’

హైదరాబాద్‌: తన సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల కళాతపస్వి కె.విశ్వనాథ్ తీవ్ర‌ ఆవేదన వ్యక్తం చేశారు. తన నోట మాటలు రావడం లేదని.. ఇంత తొందరగా బాలు ఈ లోకాన్ని వదిలి వెళ్తాడనుకోలేదని అన్నారు. ‘భగవంతుడు ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు. బాలు (బాల సుబ్రహ్మణ్యం) నా సోదరుడే కాదు.. నా ఆరో ప్రాణం. అలాంటిది ఇంత తొందరగా జరుగుతుంది అనుకోలేదు. ఇలాంటప్పుడు ఎక్కువ మాట్లాడటానికి కూడా మాటలు రావు. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులంతా దీన్ని ఓర్చుకుని మామూలు విషయంగా తీసుకోవాలని కోరుతున్నా. ఇంత కంటే నేనేమి మాట్లాడలేను’ అని విశ్వనాథ్‌ చెప్పారు.

కొండంత ధైర్యం చెప్పేవాడు: అశ్వినీదత్‌

బాలు మరణం పట్ల ఆయన స్నేహితుడు, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ సంతాపం తెలిపారు. ‘బాలు నువ్వు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల గుండెల్లో ఎల్లప్పుడూ చిరంజీవిగా ఉంటావు.. నీ ప్రియ మిత్రుడు అశ్వినీదత్‌..’ అంటూ వైజయంతి మూవీస్‌ సంస్థ వీడియోను షేర్‌ చేసింది. అందులో అశ్వినీదత్‌ మాట్లాడుతూ.. ‘1974లో నేను, ఆయన కలిశాం. ఆ తర్వాత రెండు నెలలకే స్నేహితులయ్యాం. నేను తీసిన 50 సినిమాల్లో 200లకుపైగా పాటలు ఆయన పాడారు. మా అమ్మాయిల్ని ప్రోత్సహించి వారితో ప్రోగ్రామ్స్‌ చేయించారు. మా ఇద్దరి ఇళ్లు దగ్గరగా ఉండేవి. తరచూ కలిసి మాట్లాడుకునేవాళ్లం. నా సినిమాలు వైఫల్యం చెందితే వెంటనే నా దగ్గరికి వచ్చి, కొండంత ధైర్యం చెప్పేవారు. ‘ఇంద్ర’ సినిమా షూటింగ్‌ సమయంలో తాజ్‌లో ఆయన కోసం ప్రత్యేకంగా గది తీసిచ్చా. కానీ ఆయన అందులో ఉండటానికి ఒప్పుకోలేదు. యూనిట్‌ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానని నాతో గొడవ పడ్డారు. ఈ మధ్య ‘దేవదాస్‌’ సినిమాలో అతిథిగా కనిపించాలని అడిగితే.. పారితోషికం తీసుకోలేదు. ఆ మొత్తాన్ని ట్రస్టుకు పంపమని చెప్పారు. షూటింగ్‌ చేయడానికి ఫలానా రోజు హైదరాబాద్‌ వస్తాను.. ఆరోజు చిత్రీకరణ పెట్టుకో అన్నాడు. అంటే నాకు విమానం టికెట్టు ఖర్చు తగ్గిద్దామని ఆయన ఆలోచన. నాతోనే కాదు అందరితోనూ ఇలానే ఉండేవారు. వేల మంది గాయకుల్ని పరిశ్రమకి తీసుకొచ్చారు’ అని పేర్కొన్నారు.

కోలుకుంటారని ఆశించా: విజయశాంతి
‘గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకున్నా. కోట్ల మందికి గానామృతాన్ని పంచిన ఆయన త్వరగా కోలుకుని.. మళ్లీ తన గానంతో అలరిస్తారని ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో తుదిశ్వాస విడిచారన్న వార్త తీవ్రంగా కలచివేసింది’ అని విజయశాంతి ట్వీట్‌ చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని