close

తాజా వార్తలు

అలా స్టేటస్‌లు పెట్టుకోవడం చూసి బాధపడ్డా

‘ఆర్‌ఎక్స్‌ 100’ అనుకోకుండా దక్కిన వరం: కార్తికేయ

హైదరాబాద్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంలో ప్రియురాలి చేతిలో మోసపోయిన నిజమైన ప్రేమికుడిగా కనిపించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు యువ కథానాయకుడు కార్తికేయ. ఆ తర్వాత ఆయన పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తూనే నాని నటించిన ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాలో విలన్‌గా కనిపించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ‘ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేస్తూ పోతే కొన్నాళ్లకు మనపై తెలియని ఓ ముద్ర పడిపోతుంది. అందుకే నటుడిగా అన్ని రకాల పాత్రలు, అన్ని జోనర్లు చేయాలనుకుంటున్నా. నేను ఎలాంటి పాత్రకైనా సరిపోతాను అనే నమ్మకం రచయితల్లో కలిగించడమే నా లక్ష్యం’ అని అంటున్నారు కార్తికేయ. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘90 ఎం.ఎల్‌’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు శేఖర్‌ రెడ్డి ఎర్రా దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో కార్తికేయ విలేకర్లతో ముచ్చటించారు.

‘90.ఎం.ఎల్‌’ ఫలితం మీకెలాంటి కిక్‌ ఇచ్చింది?

కార్తికేయ: ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. థియేటర్లో చిత్రం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆద్యంతం వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా మాస్‌ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. 

ఈ చిత్రంతో మాస్‌ హీరోగా గుర్తింపు దక్కినట్లే అనుకుంటున్నారా? 

కార్తికేయ: నేను మాస్‌ కథానాయకుడు అనిపించుకోవాలని ఈ సినిమా చెయ్యలేదు. నటుడిగా అన్ని జోనర్లు చెయ్యాలనుకున్నా. వాటిలో భాగంగానే ఈ చిత్రాన్ని చేశా. చిన్నప్పుడు చిరంజీవి గారిని మాస్‌ చిత్రాల్లో చూస్తున్నప్పుడు ఎంతో ఆనందించే వాడిని. ఆయనలా నన్ను నేను ఎలాంటి పాత్రల్లో చూసుకోవాలి అనుకున్నానో అలాంటి పాత్రల్లో ఇది ఒకటి. తెరపై చూసుకుంటున్నప్పుడు నేను చాలా ఎంజాయ్‌ చేశా.

తొలిసారి ‘90 ఎం.ఎల్‌’ కథ విన్నప్పుడు మీకెలా అనిపించింది?

కార్తికేయ: ఓ చిన్న లోపం వల్ల కథానాయకుడు చిన్నప్పటి నుంచి మద్యం తీసుకోవడం అన్నది దర్శకుడు చెప్పినప్పుడు చాలా ఆసక్తికి గురి చేసింది. నిజంగా ఇలాంటి వారు కూడా ఉంటారా అనుకున్నా. దీని గురించి అంతర్జాలంలో వెతికా. కానీ, దొరకలేదు. కేవలం ఇదొక ఫిక్షనల్‌ కథలాంటిది. ప్రేక్షకుల తెరపై చూస్తున్నప్పుడు వాళ్లూ సర్‌ప్రైజింగ్‌గా ఫీలవుతారనుకొని చేసిన ప్రయత్నమిది. 

టైటిల్‌ వల్ల ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు దూరం అవుతుందని అనిపించలేదా?

కార్తికేయ: కథకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ‘90.ఎం.ఎల్‌’ అని పెడితేనే బాగుంటుందనిపించింది. పేరులో ఓ కొత్తదనం ఉంది కాబట్టి సినిమాపై ఓ ఆసక్తి ఏర్పడుతుందని అలా పెట్టాం. మరో విషయం ఏంటంటే దీన్ని మాస్‌ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని వాణిజ్యాంశాలతో నిండిన వినోదాత్మక చిత్రంగా రూపొందించాం. మేం అనుకున్నట్లుగానే ఇది వాళ్లకు చేరింది.

ఈ సినిమాలో మీ డ్యాన్సులు బాగున్నాయని అనుకుంటున్నారు. అందుకోసం ప్రత్యేక కసరత్తులు ఏమైనా చేశారా?

కార్తికేయ: ప్రత్యేకంగా అంటూ ఏమీ చెయ్యలేదు. నాకు చిన్నప్పటి నుంచీ డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. చిరంజీవి సర్‌ చిత్రాల్లోని పాటలకు స్కూల్, కాలేజీ రోజుల్లో వేదికలపై డ్యాన్స్‌ చేసేవాడిని. అయితే నా తొలి మూడు చిత్రాల్లో నృత్యాలకు అంత ప్రాధాన్యత దొరకలే. ఈ చిత్రంలో దొరికింది. అందుకే నా పూర్తి ప్రతిభను చూపించా. ఇక వినోదం విషయానికొస్తే.. కథానాయకులు ఎప్పుడు కామెడీ చేసినా ప్రేక్షకులకు నచ్చుతుంది. రజనీకాంత్, చిరు, మహేష్‌ వంటి హీరోలు నవ్విస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. నేనూ అది దృష్టిలో పెట్టుకునే వినోదాత్మక సన్నివేశాల్ని పండించా.

విమర్శల్ని ఎలా స్వీకరిస్తారు? ఈ చిత్ర విషయంలో ఏమైనా విమర్శలు ఎదుర్కొన్నారా?

కార్తికేయ: విమర్శల్ని నేనెప్పుడూ గౌరవిస్తా. అందరి అభిప్రాయాలు వింటా. చేసిన తప్పుల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటా. ఆ పొరబాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడుతుంటా. అన్ని సార్లు ‘ఆర్‌ఎక్స్‌ 100’ లాంటి చిత్రాలు రావు కదా. అది అనుకోకుండా దక్కిన వరం. ‘90.ఎం.ఎల్‌’ విషయంలో రివ్యూల పరంగా మిశ్రమ స్పందన లభించినప్పటికీ నా నటనా పరంగా మంచి మార్కులు పడ్డాయి. స్క్రీన్‌ ప్లే పరంగా కొన్ని లోపాలున్నట్లు నా దృష్టికొచ్చాయి. నా తర్వాతి చిత్రానికి ఈ పొరబాటు జరగకుండా జాగ్రత్త పడతా.

‘గ్యాంగ్‌లీడర్‌’లో ప్రతినాయకుడిగా చేశారు. మళ్లీ అలాంటి అవకాశమొస్తే చేస్తారా?

కార్తికేయ: కచ్చితంగా చేస్తాను. నాకు నటన అంటే ఇష్టం. నటుడిగా ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే. కానీ, విలన్‌ పాత్రలు చేస్తున్నప్పుడు దానికొక ప్రాధాన్యత ఉండాలి. సినిమాకీ నాకూ ఆ పాత్ర ఉపయోగపడేలా ఉండాలి. ఏదో హీరోతో నాలుగు ఫైట్లు చేసేసి వెళ్లిపోయేటట్లు ఉండకూడదు. మనసుకు నచ్చాలే కానీ ఐటెం గీతాలకైనా రెడీనే (నవ్వుతూ).

ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారు?

కార్తికేయ: ఇద్దరు కొత్త దర్శకులతో చెయ్యబోతున్నా. ఒకటి యాక్షన్‌ థ్రిల్లర్‌. మరకొటి భావోద్వేగాలతో నిండిన ఓ సరికొత్త ప్రేమకథ. త్వరలోనే ఓ చిత్రం పట్టాలెక్కుతుంది. ఈ చిత్రాలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తా.

‘దిశ’ హత్యాచార ఘటన తర్వాత సామాజిక మాధ్యమాల్లో మీ ‘గుణ 360’ క్లైమాక్స్‌ సన్నివేశాలు వైరల్‌ అయ్యాయి. దానిపై మీ అభిప్రాయం?

కార్తికేయ: నిజానికి ఆ సన్నివేశాల్ని ప్రజలు అలా స్టేటస్‌లు పెట్టుకోవడం చూసి నేను కాస్త బాధపడ్డా. ఆ సినిమాలో ఓ నటుడిగా హత్యాచార నిందితులను శిక్షించానే తప్ప, నిజ జీవితంలో దిశ ఘటనపై ట్వీట్‌ చేయడం తప్ప ఏం చెయ్యగలుగుతున్నా అని అనిపించింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.