కీరన్‌ పొలార్డ్‌ ‘ప్రత్యేక’ వికెట్లు..  - kieron pollards best catch ever in the odi vs sri lanka
close
Updated : 11/03/2021 10:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కీరన్‌ పొలార్డ్‌ ‘ప్రత్యేక’ వికెట్లు.. 

(Photo: West Indies Cricket Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ రెండు ప్రత్యేక వికెట్లు సాధించాడు. ఇరు జట్ల మధ్య గత రాత్రి జరిగిన తొలి వన్డేలో లంక తొలుత బ్యాటింగ్‌ చేసి 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ జట్టుకు‌ ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌(65; 90 బంతుల్లో 4x4, 2x6), షై హోప్‌(110; 133 బంతుల్లో 12x4, 1x6) శుభారంభం చేయగా, చివర్లో బ్రావో(37; 47 బంతుల్లో 2x4, 1x6) రాణించడంతో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 47 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 8 వికెట్ల తేడాతో కరీబియన్‌ జట్టు ఘన విజయం సాధించింది.

అయితే, టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన శ్రీలంకకు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు గుణతిలక(55; 61 బంతుల్లో 7x4), కరుణరత్నె(52; 61 బంతుల్లో 4x4) తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న వీరినీ పొలార్డ్‌ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేర్చాడు. తొలుత అతడు వేసిన 19.2 ఓవర్‌కు కరుణరత్నె షాట్‌ ఆడగా బంతి బౌలర్‌ కుడివైపు నుంచి వెళ్లింది. దాంతో వెంటనే స్పందించిన పొలార్డ్‌ తన కుడిచేతిని చాచి క్యాచ్‌ పట్టడానికి యత్నించాడు. అయితే బంతి చేతికి తగిలి గాల్లోకి లేవడంతో అలాగే కష్టపడి ముందుకెళ్లి ఒంటి చేత్తో బంతిని ఒడిసిపట్టాడు. దాంతో లంక తొలి వికెట్‌ కోల్పోయింది.

తర్వాత పొలార్డ్‌ వేసిన 21.1 ఓవర్‌కు గుణతిలక డిఫెన్స్‌ ఆడగా, బంతి అతడి కాళ్ల వద్దే ఆగిపోయింది. అది గమనించకుండా ముందుకు వెళ్లిన అతడు.. పొలార్డ్‌ రనౌట్‌ చేయడానికి వస్తున్నట్లు గమనించి మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ నిస్పంకను పరుగు కోసం రావొద్దని చెప్పాడు. అదే సమయంలో అతడు కూడా క్రీజులోకి వెనక్కి పరుగెడుతూ అనుకోకుండా బంతిని కాలితో తన్నాడు. అప్పటికే పొలార్డ్‌ రనౌట్‌ చేయడానికి బంతి దగ్గరికి రావడంతో గుణతికల కావాలనే బంతిని తన్నాడని, అది క్రికెట్‌ నిబంధనలకు విరుద్ధమని అప్పీల్‌ చేశాడు. విషయం థర్డ్‌ అంపైర్‌కు చేరడంతో అతడు రీప్లే చూసి ఔటిచ్చాడు. ఇక క్రికెట్‌ నిబంధనల ప్రకారం ఎవరైనా బ్యాట్స్‌మెన్‌ ఉద్దేశపూర్వకంగా తమ మాటలతో లేదా, చేష్టలతో ఫీల్డింగ్‌ చేస్తున్న జట్టుకు అడ్డంకులు సృష్టిస్తే ఆ బ్యాట్స్‌మెన్‌ను అబ్‌స్ట్రక్టింగ్‌ ది ఫీల్డ్‌గా పరిగణిస్తూ ఔటిస్తారు. ఈ నేపథ్యంలోనే ఔటిచ్చారు. అయితే, గుణతిలక అనుకోకుండా బంతిని తన్నాడని, ఉద్దేశపూర్వకంగా కాదని నెటిజెన్లు మండిపడుతున్నారు. అతడిని ఔటివ్వాల్సింది కాదని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడా రెండు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని