Tollywood: అక్కడ హీరోలు.. ఇక్కడ సినిమాలు - kollywood mollywood stars entering into tollywood
close
Published : 22/06/2021 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: అక్కడ హీరోలు.. ఇక్కడ సినిమాలు

తెలుగు ప్రజలు సినిమాను ఎంతగా ప్రేమిస్తారో తెలిసిందే.  కథలో దమ్ముంటే చాలు హీరోతో సంబంధం లేకుండా సూపర్‌ హిట్‌ చేస్తారు. తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీష్‌ ఇలా భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తారు. సూర్య, విక్రమ్‌, విజయ్‌ లాంటి హీరోలకు సొంత పరిశ్రమలోనే కాదు ఇక్కడా అభిమానులున్నారు. రజనీకాంత్, కమల్‌హాసన్‌లను ఇక్కడ స్టార్లుగానే కొలుస్తారు.  అలా అనువాదాలుగా విడుదలై సూపర్‌ హిట్లుగా నిలిచిన సినిమాలెన్నో. తెలుగులో సినిమా ఎప్పుడు? అని విలేఖరుల నుంచి వారికి తరచూ ఎదురయ్యే ప్రశ్నకు ఇప్పుడు తమ సినిమాలతోనే సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యారు కొందరు స్టార్లు ఆ వివరాలేంటో చూద్దాం. టాలీవుడ్‌లో నేరుగా సినిమాలు తీస్తున్న స్టార్లపై ఓ కథనం.

శేఖర్‌తో కలిసి ధనుష్‌

ధనుష్‌ కంటే ముందే ఆయన సినిమాలు రీమేక్‌ రూపంలో తెలుగు వాళ్లకు పరిచయం అయ్యాయి.  ‘కాదల్  కొండైన్‌’ సినిమా అల్లరి నరేశ్‌  ‘నేను’గా రీమేక్‌ అయింది. ‘తిరుడ తిరుడి’ చిత్రం దొంగ దొంగది’గా, ‘తుల్లువాదో ఇలమై’ చిత్రం ‘జూనియర్స్‌’గా టాలీవుడ్‌లో రీమేక్‌ అయ్యాయి.  ‘కుర్రాడు’, ‘టక్కరి’ లాంటి సినిమాలు కూడా  ధనుష్‌ తమిళ చిత్రాల ఆధారంగా తెరకెక్కినవే. ‘రౌడీ రుద్రయ్య’, ‘శౌర్య’, ‘ధూల్‌పేట’, ‘మరియన్‌’ లాంటి అనువాదాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించేవాడు ధనుష్‌. అయితే తెలుగులో ‘రఘువరన్‌ బీటెక్‌’తోనే ఆయనకు గుర్తింపు వచ్చింది. అది టాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అవడంతో ఆ తర్వాత వచ్చిన ‘అనేకుడు’, ‘మారి’ సినిమాలకు ఇక్కడా మంచి బిజినెస్‌ జరిగింది. ఓటీటీలు హవా మొదలయ్యాక ‘అసురన్’‌, ‘వడా చెన్నై’, ‘కర్ణన్‌’ సినిమాలను తెలుగు వాళ్లు కూడా ఆదరించారు. ధనుష్‌కు మంచి ఆదరణ దక్కుతుండటంతో ఇక్కడ కూడా మార్కెట్‌ను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాడు‌. అందుకే తెలుగు క్లాస్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ములతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.  ధనుష్‌ మాస్‌ నటనకు, శేఖర్‌ కమ్ముల క్లాస్‌ టేకింగ్‌ తోడైతే ఎలాంటి సినిమా బయటకొస్తుందో తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. 

టాలీవుడ్ మాస్‌ డైరెక్టర్‌తో విజయ్‌

‘పోకిరి’, ‘ఒక్కడు’, ‘చిరునవ్వుతో’, ‘అతనొక్కడే’, ‘పెళ్లిసందడి’ లాంటి సినిమాలను తమిళంలో తీసి బ్లాక్‌బస్టర్లుగా మలిచిన హీరో విజయ్‌. ఆయన నటించిన ‘ఖుషి’, ‘కత్తి’తో పాటు మరికొన్ని సినిమాలు తెలుగులో రీమేక్‌ అయి సక్సెస్‌ సాధించాయి.  అనువాదాల ద్వారా పలకరించే ఈ స్టార్‌ హీరోకు మొదట మార్కెట్‌ పెరిగింది మాత్రం ‘తుపాకి’ సినిమాతోనే. దేశభక్తికి కమర్షియాలిటీని కలిపి తీసిన ఈ మురుగదాస్‌ చిత్రం ఇక్కడ వంద రోజులకు పైగా ఆడింది.  ఆ తర్వాత ‘పోలీసోడు’, ‘అదిరింది’, ‘సర్కార్’‌, ‘విజిల్‌’, ‘మాస్టర్‌’ ఆయన మార్కెట్‌ను మరింతగా పెంచాయి. దాదాపు ఓ తెలుగు సినిమాను ఆదరించినట్లే విజయ్‌ చిత్రాలకు ఇక్కడ ఆదరణ దక్కుతోంది. అందుకే తన అభిమానులను, మార్కెట్‌ను మరింతగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నాడాయన. వంశీ పైడిపల్లి లాంటి కమర్షియల్‌ డైరెక్టర్‌తో ఓ ద్విభాష చిత్రంతో తెలుగులో నేరుగా అడుగుపెట్టబోతున్నారు. దీనికి దిల్‌రాజ్‌ నిర్మాత. 

పుష్పతో ఫహద్‌ ఢీ

వైవిధ్యమైన సినిమాలతో విలక్షణ నటుడిగా ప్రశంసలు పొందుతున్న స్టార్‌ హీరో ఫహద్‌ ఫాజిల్‌. మలయాళ సినిమాలో ఆయన ఇప్పుడో సంచలనం. కొత్త కథలు, కొత్త ప్రతిభతో తరచుగా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంటాడీ హీరో. ‘అనుకోని అతిథి’, ‘ట్రాన్స్‌’లాంటి అనువాదాలతో తెలుగువాళ్లను మెప్పించాడు. ప్రపంచ సినిమాను పరిశీలించేవారికి ఫహద్‌ సినిమాలు, ప్రతిభ పరిచయం అక్కరలేదు. అంత మంచినటుడిగా పేరుంది. ఇప్పుడు ఆయన తెలుగులోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే తమిళంలో రెండు చిత్రాల్లో విలన్‌గా నటించిన ‘ఫహద్‌’కి పుష్ప తొలి తెలుగు సినిమా. ఇందులో అల్లు అర్జున్‌ను ఢీకొనే విలన్‌గా విజృంభించేందుకు సిద్ధమయ్యాడు. తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తాడో చూడాల్సిందే.

విజయ్‌ సేతుపతి విలనిజం

పిజ్జా.. తమిళ హీరో విజయ్‌ సేతుపతికి తొలిసారి సక్సెస్‌ రుచి చూపిన చిత్రం. అది తెలుగులోనూ విడుదలై ఇక్కడ కూడా ప్రేక్షకాదరణ  పొందింది. కుర్రహీరోగా నటించి ఓ మంచి థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. ‘విక్రమ్‌ వేద’, ‘96’, ‘సూపర్‌ డీలక్స్‌’ లాంటి తమిళ చిత్రాలతో తెలుగులో సినిమాలు విడుదల చేయకుండానే ఇక్కడ అభిమానులను సంపాదించుకున్నాడు. దీంతో టాలీవుడ్‌కు ఆ విలక్షణ నటుడిని తీసుకొచ్చారు తెలుగు ఫిలిం మేకర్స్. ‘సైరా నరసింహరెడ్డి’లో అతిథి పాత్రలో నటించిన సేతుపతి... ‘ఉప్పెన’లో పూర్తిస్థాయి విలన్‌గా నటించి సినిమా సక్సెస్‌లో భాగమయ్యాడు. సుకుమార్‌ ‘పుష్ప’లోనూ విలన్‌గా చేయాల్సింది. కానీ కరోనా వల్ల డేట్స్‌ కుదరని కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. మళ్లీ తెలుగు తెరపై కనిపించే అవకాశాలు చాలానే ఉన్నాయి. 

సూర్య మళ్లీ ఎప్పుడో?

తెలుగులో ఓ దశలో స్టార్‌ హీరోకున్న ఫాలోయింగ్‌ సంపాదించుకున్న తమిళ హీరో సూర్య.  బాల ‘శివపుత్రుడు’తో ఆయన హవా తెలుగులో మొదలైంది. ‘గజిని’తో ఇక్కడా స్టార్‌ హీరో స్థాయికి చేరిపోయాడు. ‘యువ’, ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్’‌, ‘సింగం’, ‘వీడొక్కడే’, ‘24’ సినిమాలతో తెలుగులోనూ భారీ కలెక్షన్లు సాధించాడు సూర్య. టాలీవుడ్‌ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని సూర్య కథలను ఎంచుకుంటాడంటే తెలుగులో  ఏ స్థాయిలో ఫాలోయింగ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.  ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా ఓటీటీలో రిలీజ్‌ అయినా దాన్ని తెలుగులో సూపర్‌ హిట్‌ చేశారు మన ప్రేక్షకులు. ‘రక్త చరిత్ర 2’ తో నేరుగా తెలుగులో సినిమా తీసిన సూర్య. మళ్లీ తెలుగులో మరో సినిమా తీయలేదు. పలువురు తెలుగు దర్శకులు కథలను వినిపిస్తున్నారు.  సూర్య మళ్లీ ఎప్పుడు  డైరెక్ట్‌గా పలకిరిస్తాడో మరి?

కార్తి నుంచి దుల్కర్‌ వరకు

తెలుగులో ఇదివరకు చాలా మంది తారలు నేరుగా పలకరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.  సీనియర్‌ హీరోలు కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌లు టాలీవుడ్‌లో చాలా సినిమాలు తీశారు.  ఇప్పటి యువహీరోలు సైతం నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించారు.  ‘యుగానికి ఒక్కడు’, ‘అవారా’, ‘ఖైదీ’ లాంటి అనువాద చిత్రాలతో తెలుగులో హిట్లు కొట్టిన కోలీవుడ్‌ హీరో కార్తి. ఆయన తెలుగులో నాగార్జునతో ‘ఊపిరి’లో కలిసి నటించారు. మరో తమిళ యువహీరో అధర్వ ‘గద్దలకొండ గణేశ్‌’లో హీరోగా చేశాడు. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ‘జనతా గ్యారేజ్‌’లో పవర్‌ఫుల్‌ పాత్రను పోషించారు. యువహీరో దుల్కర్‌ సల్మాన్‌ మణిరత్నం ‘ఓకే బంగారం’తో హిట్ కొట్టాడు. ఆయనే ‘మహానటి’లో జెమినీ గణేశన్‌ పాత్రలో జీవించి తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. కన్నడ స్టార్‌  హీరో సుదీప్‌ ‘ఈగ’, ‘రక్తచరిత్ర’, ‘బాహుబలి’ లాంటి సినిమాలతో ఇక్కడ ఆదరణ దక్కించుకున్నారు. ఆర్య, మాధవన్‌, ఆది పినిశెట్టి ఇలా చాలామంది హీరోలు తెలుగులో నేరుగా సినిమాలు చేశారు. తమ నటనతో మెప్పించి అభిమానులను కూడా సంపాదించుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని