Bollywood: కొరియన్‌ రీ‘మేకు’లు - korean remakes in bollywood
close
Updated : 25/05/2021 09:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bollywood: కొరియన్‌ రీ‘మేకు’లు

అక్కడి కథలతో బోల్తాపడ్డ బాలీవుడ్‌ చిత్రాలివే!

క్రైమ్‌ థ్రిల్లర్స్‌, భిన్నమైన కథాంశాలతో సినీలోకాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి కొరియన్‌ మూవీస్‌. ఆ సినిమాలే గత కొంతకాలంగా బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతున్నాయి. సల్మాన్‌ఖాన్‌ తాజా చిత్రం ‘రాధే’ కూడా ‘ఔట్‌ లాస్‌’ అనే కొరియన్‌ చిత్రం ఆధారంగా తెరకెక్కిందే. ఇది అంతగా ఆకట్టుకోలేదు. ఇలా కొరియన్‌ నుంచి బాలీవుడ్‌లోకి రీమేక్‌ అయి బోల్తాపడ్డ సినిమాలేంటో ఓ సారి చూద్దాం!

కండల వీరుడికి కలిసిరాలేదు

కొరియన్‌ రీమేక్స్‌ సల్మాన్‌ఖాన్‌కి వర్కౌట్‌ కావని మరోసారి నిరూపణ అయింది. ప్రభుదేవా దర్శకత్వంలో ఈ రంజాన్‌కు వచ్చిన ‘రాధే’ అంతగా మెప్పించలేదు. కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం నిరాశకు గురిచేసింది. దీనికన్నా ముందు ‘భారత్‌’తో పరాజయాన్ని మూటగట్టుకున్నాడు సల్లూ. కత్రీనా కైఫ్‌, దిశా పటానీ హీరోయిన్లుగా చేశారు. కొరియన్‌ చిత్రం ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’ ఆధారంగా ‘భారత్‌’ తెరకెక్కింది. కలెక్షన్లు భారీగానే వచ్చినా విమర్శకులను ఏ మాత్రం మెప్పించలేకపోయిందీ సినిమా. అంతకుముందు సోనమ్‌ కపూర్‌ జోడిగా నటించిన ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో’ కూడా బీటౌన్‌ను ఆకట్టుకోలేదు. ఇదీ ఓ కొరియన్‌ రీమేకే.

ఓల్డ్‌ బాయ్‌ మ్యాజిక్‌ రిపీట్‌ కాలేదు

కల్ట్ క్లాసిక్‌ స్టేటస్‌ ఉన్న కొరియన్‌ సినిమా ‘ఓల్డ్‌బాయ్‌’. ఈ ఒక్క సినిమాతో ప్రపంచ దృష్టిని తమ వైపునకు తిప్పుకుంది. 2003లో దక్షిణ కొరియాలో విడుదలై ఘనవిజయం సాధించింది. అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అవార్డులు గెలుచుకుంది. సంజయ్‌ దత్‌, జాన్‌ అబ్రహాం ప్రధానపాత్రల్లో ‘జిందా’ పేరుతో 2006లో బాలీవుడ్‌లో రీమేక్‌ అయింది. కథానాయకుడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి 14 ఏళ్ల పాటు బందిస్తారు. ఆ చెర నుంచి బయటికొచ్చాక ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే కథాంశంతో ఓల్డ్‌బాయ్‌ తెరకెక్కింది. ప్రధానమైన మలుపును ఇక్కడి ప్రేక్షకులు జీర్ణించుకోలేరని మార్చేశారు. దాంతో జిందా మామూలు థ్రిల్లర్‌గా మిగిలి బాక్సాఫీస్‌ వద్ద తేలిపోయింది. అధికారికంగా రీమేక్‌ చేయకపోవడంతో ‘ఓల్డ్‌ బాయ్‌’ నిర్మాతల నుంచి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

అక్షయ్‌ ఆకట్టుకోలేకపోయాడు

అక్షయ్‌ కుమార్‌, ఎమీ జాక్సన్‌ కలిసి నటించిన యాక్షన్‌ కామెడీ చిత్రం ‘సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌’. 2015లో విడుదలైన ఈ చిత్రం ‘మై వైఫ్‌ ఈజ్‌ ఏ గ్యాంగ్‌స్టర్‌ 3’ అనే సినిమాకు రీమేక్‌. అతికించినట్లుండే సన్నిశాలు, మితిమీరిన హాస్యం, అనవసర సెంటిమెంట్‌ వల్ల బీ టౌన్‌ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కలెక్షన్ల పరంగా ఓ మోస్తరు వసూళ్లను సాధించినా.. సగటు సినీ ప్రేమికుడికి మాత్రం నిరాశనే మిగిల్చింది.

తేలిపోయిన ఐష్‌ రీ ఎంట్రీ

అభిషేక్‌ను వివాహమాడిన తర్వాత ‘జజ్బా’తోనే సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది ఐష్‌. ‘సెవన్‌ డేస్‌’ అనే కొరియన్‌ థ్రిల్లర్‌ను హిందీలో ‘జజ్బా’(2015)గా తెరకెక్కించారు. బాలీవుడ్‌ అందాలరాశి ఐశ్వర్యరాయ్‌ ఇందులో లాయర్‌గా నటించింది. అయితే  బాక్సాఫీస్‌ వద్ద తేలిపోయిందీ చిత్రం.  ఇర్ఫాన్‌ ఖాన్‌, ఐష్‌, షబానా అజ్మీ లాంటి నటులున్ననూ బలహీనమైన స్ర్కీన్‌ప్లేతో పాటు ఎడిటింగ్‌ లోపాల కారణంగా సినిమా దెబ్బతింది. ఒరిజినల్‌లో ఉన్న సస్పెన్స్‌ ఇందులో కలగదు.

విలనిజం పండలేదు..

కొరియన్‌ థ్రిల్లర్ చిత్రాల్లో హింసాత్మకమైన చిత్రాల్లో ‘ఐ సా ది డెవిల్‌’(2010) ఒకటి. ఈ చిత్రం ఆధారంగానే బాలీవుడ్‌లో ‘ఏక్‌ విలన్‌’(2014) తీశాడు దర్శకుడు మోహిత్‌ సూరి. సిద్ధార్థ్‌ మల్హోత్ర, శ్రద్ధా కపూర్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. విలన్‌గా రితేశ్‌ దేశ్‌ముఖ్‌కి మంచి మార్కులు పడ్డాయి. బాక్సాఫీస్‌ వద్ద ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. మోహిత్‌ సూరి దీన్ని బాలీవుడ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దడంతో ఒరిజినల్‌ చిత్రంలా ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమాలోని హింసాత్మక సన్నివేశాలు తీసేసి రొటీన్‌ రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా మార్చాడు దర్శకుడు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా... ఏక్‌ విలన్‌ 2 వస్తోంది. 

కాజల్‌కూ తప్పలేదు

కాజల్‌ బాలీవుడ్‌లో చేసిన మూడో చిత్రం ‘దో లఫ్జోకి కహాని’. రణ్‌దీప్‌ హుడా కథానాయకుడు. ‘ఆల్వేస్‌’ అనే కొరియన్‌ చిత్రం ఆధారంగా ఇది తెరకెక్కింది. ఓ బాక్సర్‌కి, అంధురాలైన యువతికి మధ్య నడిచే అందమైన ప్రేమ కథ 2016లో విడుదలైంది. ఇక్కడ సరిగా ఆడలేదు. సినిమా బడ్జెట్‌లో సగం వసూళ్లు కూడా దక్కలేదు. దీంతో బాక్సాఫీసు వద్ద భారీ నష్టాన్ని మూటకట్టుకుంది. ఇదే సినిమా కన్నడలో ‘బాక్సర్‌’గా విడుదలైంది. అక్కడా ఇలాంటి ఫలితమే దక్కింది. అలాగే రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘సాసీ గర్ల్‌’కు రీమేక్‌గా వచ్చిన ‘అగ్లీ ఔర్‌ పగ్లీ’ కూడా మెప్పించలేదు.

తీన్‌.. తిరగబడింది!

* అమితాబ్‌ బచ్చన్‌, నవాజుద్దిన్‌ సిద్దిఖీ, విద్యాబాలన్‌ కలయికలో వచ్చిన చిత్రం ‘తీన్’‌. ‘మాంటేజ్‌’ అనే కొరియన్‌ సినిమా హక్కులను కొని హిందీలో తెరకెక్కించారు. అయితే ఈ మిస్టరీ థ్రిల్లర్‌ జనాలను అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మంచి తారాగణం, కథ ఉన్ననూ సినిమాను కాపాడలేకపోయాయి. ఇక్కడి ప్రేక్షకులకు అనుగుణంగా దీన్ని తెరకెక్కించలేకపోయారు.

దక్షిణ కొరియాలో మంచి విజయం సాధించిన మాస్ మసాలా చిత్రం ‘బిట్టర్‌ స్వీట్‌ లైఫ్’‌. ఇదే హిందీలో ‘అవారాపన్‌’గా వచ్చింది. ఇమ్రాన్‌ హష్మీ, శ్రియా శరణ్‌లు హీరోహీరోయిన్లు. కథానాయకుడిగా ఇమ్రాన్‌కి మంచి మార్కులు పడ్డా బాక్సాఫీసు వద్ద ఆశించిన వసూళ్లు రాలేదు. అలాగే ‘బర్సీ’, ‘రాక్‌ ఆన్‌’, ‘రాకీ హాండ్సమ్‌’ కూడా కొరియన్‌ సినిమాల ఆధారంగా అల్లుకున్న కథలే. వీటికి ప్రశంసలు దక్కాయి. ‘ది ఛేజర్‌’ ఆధారంగా తీసిన ‘మర్డర్‌2’ ఆకట్టుకుంది. అయితే ఇలా రీమేక్‌ అయిన వాటిలో ఎక్కువ శాతం పరాజయం పాలయ్యాయి. విజయాల శాతం చాలా తక్కువ. కారణం ఆ సినిమాల్లో ఉన్న తీవ్రత, సస్సెన్స్‌ను చూపించలేకపోయారు మన దర్శకులు.

 

బాలీవుడ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో అసలు కథను పక్కదారి పట్టించడం కారణంగా మరికొన్ని పరాజయం పాలయ్యాయి. ఈ చిత్రాల ఫలితాలు.. చూస్తే కొరియన్‌ రీమేక్‌లు బాలీవుడ్‌కు ఏమాత్రం కలిసిరావని స్పష్టంగా అర్థమవుతోంది. ‘టెర్రర్‌ లైవ్‌’ అనే  సినిమాను రీమేక్‌ చేస్తూ, కార్తిక్‌ ఆర్యన్‌ నటించిన ‘ధమాకా’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని