Puri Musings: అప్పుడు మాట్లాడినా వేస్ట్‌! - latest puri musings on being strong
close
Updated : 13/05/2021 14:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Puri Musings: అప్పుడు మాట్లాడినా వేస్ట్‌!

హైదరాబాద్‌: ఓ మనిషి శారీరకంగా ధృడంగా లేకపోతే అతనిలో మానసిక స్థైర్యం ఎంత ఉన్నా అది వృథానే అవుతుందని ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్‌ అన్నారు. ఈ మధ్యకాలంలో మనం ఎవరి నోట విన్నా ‘Being Strong’ అనే పదాన్ని ఎక్కువగా వింటున్నాం. అయితే, బీయింగ్‌ స్ట్రాంగ్‌ అనే దానికి తనదైన శైలిలో నిర్వచనాన్ని ఇస్తూ తాజాగా ఆయన ‘పూరీ మ్యూజింగ్స్‌’ వేదికగా ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా ‘బీయింగ్‌ స్ట్రాంగ్‌’ గురించి పూరీ ఏం చెప్పారంటే ఆయన మాటల్లోనే..

‘ఇన్నేళ్లు గడిచినా అనుకున్నది జరగలేదని బాధపడుతుంటాం. ‘డోన్ట్‌ గివ్‌ అప్‌ బీ స్ట్రాంగ్‌’ అని ఓ స్నేహితుడు చెబుతాడు. తండ్రి చనిపోయాడని ఏడుస్తుంటాం. ‘బాధపడకు ధైర్యంగా ఉండు’ అని అందరూ చెబుతుంటారు. ఇలా జీవితంలో ఏ కష్టం వచ్చినా అందరూ మనకు చెప్పేది ‘బీ స్ట్రాంగ్‌’ అని. వాళ్లు చెప్పింది నిజం. జీవితంలో ఏం జరిగినా బీయింగ్‌ స్ట్రాంగ్‌ అనేది ఆప్షన్‌ అయినప్పుడు మనం స్ట్రాంగ్‌ అయిపోవాలి. తప్పదు. స్ట్రాంగ్‌ అవ్వకపోతే బతకలేం. అలా ధైర్యంగా ఉండడానికి రెండు అంశాలు దోహదం చేస్తాయి. మానసిక స్థైర్యం, శారీరక బలం’’

‘‘ధైర్యంగా ఉండే వాళ్లకు కొన్ని లక్షణాలుంటాయి. అందులో ఒకటి కృతజ్ఞత. ఎదుటివాళ్ల నుంచి పొందిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోరు. ఎంతకాలమైనా గుర్తుపెట్టుకుంటారు. సవాళ్లను అంగీకరిస్తారు. వాటిని ఎదుర్కొవడానికి కృషి చేస్తారు. స్నేహితులతో ఆరోగ్యవంతమైన బంధాన్ని ఏర్పర్చుకుంటారు. ఏ పని చేసినా అందులోని రిస్క్‌ని లెక్కిస్తారు. తమ గతాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. పరాజయాన్ని కూడా ఓ అవకాశంగా మార్చుకుంటారు. ఒంటరిగా తనతో తాను గడపడం కోసం సమయాన్ని కేటాయించుకుంటారు. వాళ్లకున్న పాత నమ్మకాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు సాగుతుంటారు. అసౌకర్యం ఉన్నప్పటికీ సహిస్తారు. దాని గురించి ఫిర్యాదులు చేయరు. వాళ్లు దేనినైతే నమ్ముతారో దానికి విలువ ఇస్తారు. సహనం, ఓర్పు.. ఇలా ఎన్నో లక్షణాలు వాళ్లలో ఉంటాయి’’

‘‘గివ్‌ అప్‌’ అనేది ఎవరైనా చేస్తారు. ఏ పనినైనా మధ్యలో వదిలేసి పోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. వదిలేసి పోవడానికి మనం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ, చివరిదాకా నిలబడటానికి ప్రయత్నం చేయాలి. నేర్చుకోవాలి. అయితే, శారీరకంగా నువ్వు ధృడంగా ఉండకపోతే.. నీకు ఎంత మానసిక స్థైర్యం ఉన్నా కూడా ఉపయోగం లేదు. అందుకే అందరం వర్కౌట్‌ చేయాలి. మీరు ఎక్సర్‌సైజ్‌ చేసినా చేయకపోయినా ఈ మూడూ ఒక్కసారి పరిశీలించుకోండి. 1.ఒక్క నిమిషంపాటు గోడకుర్చీ వేయగలుగుతున్నామా లేదా?, 2.కుర్చీలో నుంచి ఒంటి కాలుపై లేవగలుగుతున్నామా లేదా? 3.మఠం వేసుకుని కింద కూర్చునప్పుడు రెండు చేతులు నేలమీద పెట్టకుండా పైకి లేవగలుగుతున్నామా లేదా?.. ఈ మూడూ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇవి మీరు చేయలేకపోతే వృద్ధాప్యంలో కర్రలు, గోడలు పట్టుకుని నడవాల్సి ఉంటుంది. ఫిట్‌గా ఉన్నప్పుడు మీరు ఏదైనా చెప్తేనే మీ పిల్లలు మాట వింటారు. నీ జ్ఞానాన్ని, తెలివితేటల్ని వాళ్లు అర్థం చేసుకుంటారు. వణుకుతూ, గోడపట్టుకుని నడుస్తూ మీరు ఏం చెప్పినా ఎవరూ వినరు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీరు మాట్లాడడం ఆపేయండి. ఎందుకంటే దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు’ అని పూరీ వివరించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని