Covid: పుజారా, ఉతప్ప ఉండటంతో భయమేసింది! - laxmipathy balajiwas worried for pujara and uthappa around him
close
Published : 23/05/2021 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid: పుజారా, ఉతప్ప ఉండటంతో భయమేసింది!

లక్ష్మీపతి బాలాజీ, వరుణ్‌ చక్రవర్తి కొవిడ్‌ అనుభవాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా నుంచి కోలుకోవడం డిస్కవరీలో ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్’ అనుభవాన్ని తలపించిందని చెన్నై సూపర్‌కింగ్స్‌ బౌలింగ్‌ కోచ్ లక్ష్మీపతి బాలాజీ అన్నాడు. చెతేశ్వర్‌ పుజారా, రాబిన్‌ ఉతప్ప తన దగ్గరే ఉండటంతో భయపడ్డానని వెల్లడించాడు. వైరస్‌ నుంచి కోలుకొన్న రెండు వారాల వరకు పూర్తి విశ్రాంతి తీసుకోవడం మంచిదని మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి తెలిపాడు. నెగెటివ్‌ వచ్చాక వీరిద్దరూ మీడియాతో తొలిసారి మాట్లాడారు.

సగం సీజన్‌ ముగిశాక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిరవధికంగా వాయిదా పడింది. ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కరోనా వైరస్‌ సోకడమే ఇందుకు కారణం. కోల్‌కతాలో ఆడుతున్న వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌, దిల్లీ ఆటగాడు అమిత్‌ మిశ్రా, హైదరాబాద్ కీపర్ వృద్ధిమాన్‌ సాహా, చెన్నై బ్యాటింగ్‌ కోచ్ మైక్ హస్సీ, బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీకి పాజిటివ్‌ వచ్చింది. దాంతో లీగ్‌ను అప్పటికప్పుడే వాయిదా వేశారు.

‘కొవిడ్‌-19 నుంచి మానసికంగా, శారీరకంగా కోలుకోవడం మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ ఎపిసోడ్‌ అనుభవాన్ని తలపించింది. మే 2న కాస్త నలతగా అనిపించింది. ఒళ్లు నొప్పులు, ముక్కు బిగుసుకుపోవడం కనిపించాయి. ఆ రోజు మధ్యాహ్నమే పరీక్ష చేయించుకున్నా. మే 3న పాజిటివ్‌ వచ్చిందని తెలియడంతో షాకయ్యా. నేనెసలు బుడగ నిబంధనలు ఉల్లంఘించనే లేదు’ అని లక్ష్మీపతి బాలాజీ అన్నాడు.

‘మొదట ఏం మాట్లాడాలో తెలియలేదు. బయట ప్రజలు చనిపోతున్నారని తెలుసు. ఒక రోజు గడిచాక విషయం తీవ్రత అర్థమైంది. పాజిటివ్‌ రావడానికి ముందు నేను ఆటగాళ్లను కలవడంతో వారికి ఏమవుతోందనని భయపడ్డా. రాజీవ్‌ కుమార్‌ (ఫీల్డింగ్‌ కోచ్‌), రాబిన్‌ ఉతప్ప, పుజారా, దీపక్‌ చాహర్‌, కాశీ సర్‌ (సీఈవో) నా పక్కనే ఉన్నారు’ అని బాలాజీ గుర్తు చేసుకున్నాడు.

కరోనా వైరస్‌ సోకినప్పుడు మానసికంగా బలంగా ఉండాలని వరుణ్‌ చక్రవర్తి చెప్పాడు. బయటి విషయాలతో మనసు పాడుచేసుకోవద్దని సూచించాడు. ఎందుకంటే కుటుంబ సభ్యులు, జట్టు సభ్యులతో దూరంగా ఉండాల్సి వస్తుందని తెలిపాడు. ‘నాకు జలుబు, జ్వరం లేవు. బలహీనత, అలసట వంటి లక్షణాలు కనిపించాయి. మధ్యలో వాసన, రుచి కోల్పోయాను. కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న క్రీడాకారులకు చెప్పేదొకటే. నెగెటివ్‌ వచ్చాక కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలి. మాస్క్‌ ధరించే బయటికి వెళ్లాలి. త్వరలోనే నేను సాధన ఆరంభిస్తాను’ అని వరుణ్‌ ధీమా వ్యక్తం చేశాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని