101.. నాటౌట్! - lobster lady virginia oliver from us state maine is 101 years old and still going strong
close
Updated : 07/08/2021 16:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

101.. నాటౌట్!

(Image for Representation)

కొందరికి వయసులో ఉన్నా యాక్టివ్‌గా పనులు చేయడానికి శరీరం సహకరించదు.. మరికొందరు వయసు మీద పడుతున్న కొద్దీ మరింత చురుగ్గా మారుతుంటారు. సెంచరీ దాటినా యువతతో పోటీ పడుతూ వయసు కేవలం అంకె మాత్రమే అని నిరూపిస్తారు. అమెరికాకు చెందిన 101 ఏళ్ల వర్జీనియా ఒలీవర్‌ కూడా ఇదే కోవలోకి వస్తారు. చిన్నతనం నుంచి చేపల వేటపై ఇష్టం పెంచుకొని.. దాన్నే కెరీర్‌గా మార్చుకున్న ఆమె.. ఇంతటి ముదిమి వయసులోనూ సముద్రంపై ప్రయాణిస్తూ పీతల/చేపల వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ప్రొఫెషనల్‌ లాబ్‌స్టర్‌ (పీతలు/ఎండ్రకాయలు) ఫిషర్‌ఉమన్‌’గా లైసెన్స్‌ పొందిన ఆమెను అక్కడి వారంతా ‘ది లాబ్‌స్టర్‌ ఉమన్‌’ అంటూ ముద్దుగా పిలుస్తుంటారు. వయసు పెరుగుతోన్నా ఎంతో చలాకీగా తన పనిపై దృష్టి పెడుతున్న ఈ సెంచరీ బామ్మ.. పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగుతున్నానంటున్నారు.

వర్జీనియా ఒలీవర్‌.. మెయిన్ సిటీ రాక్‌ల్యాండ్‌లోని క్లారెడన్‌ స్ట్రీట్‌లో 1920లో పుట్టారామె. మెయిన్‌ల్యాండ్‌, రాక్‌ల్యాండ్‌, ఆండ్రూస్‌ దీవుల్లో.. తన బాల్యాన్ని గడిపిన ఆమె.. చేపల వేట విషయంలో తన తండ్రిని చూసి స్ఫూర్తి పొందారు. అక్కడి సముద్రాల్లో చేపలు, పీతలు పడుతూ.. స్థానిక ఫ్యాక్టరీకి అమ్ముతూ జీవనం కొనసాగించే వారాయన. ఈ క్రమంలోనే తన ఎనిమిదేళ్ల వయసులోనే అన్నయ్యతో కలిసి చేపలు పట్టడానికి వెళ్లే వారు ఒలీవర్.

భర్త అడుగుజాడల్లో..!

చిన్నతనం నుంచీ స్వతంత్ర భావాలు కలిగిన ఆమెకు ఏ విషయంలోనైనా ఒకరిపై ఆధారపడడం నచ్చదు. అందుకే తనకెంతో ఇష్టమైన చేపల వేటను కెరీర్‌గా మార్చుకున్నారు. అది కూడా పెళ్లై.. పిల్లలు కాస్త పెద్ద వాళ్లయ్యాకే! 17 ఏళ్ల వయసులో బిల్‌ అనే వ్యక్తిని వివాహమాడిన ఒలీవర్‌.. ఆ తర్వాత నలుగురు పిల్లల (ముగ్గురు కొడుకులు, ఒక కూతురు)కు తల్లయ్యారు. ఇటు పిల్లల ఆలనా పాలనా చూస్తూ.. అటు కుటుంబ బాధ్యతల్నీ సమర్థంగా నిర్వర్తించారామె. ఇక పిల్లలు స్కూలుకెళ్లే వయసులో తనకంటూ స్వతంత్రంగా ఏదైనా చేయడానికి సమయం దొరికిందామెకు. ఈ క్రమంలోనే ఓ ప్రింటింగ్‌ సంస్థలో 18 ఏళ్ల పాటు పనిచేశారు. మరోవైపు తన భర్త కూడా ‘బాత్‌ ఐరన్‌ వర్క్స్‌’ అనే షిప్‌యార్డ్‌ కంపెనీలో పనిచేసేవారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పీతలు/చేపల వేటపై దృష్టి సారించిన తన భర్తను చూసి ఆమె కూడా తన ఉద్యోగాన్ని వదిలేసి భర్త అడుగుజాడల్లో నడిచారు.

వారానికి మూడు రోజులు..!

‘నా భర్త ఉద్యోగానికి రాజీనామా చేసి చేపల వేటపై దృష్టి పెట్టారు. దీంతో నేనూ ఉద్యోగం వదిలేసి ఆయనతో పాటే వెళ్లేదాన్ని. నేను బోటు నడుపుతుంటే ఆయన చేపల/పీతట వేట కొనసాగించేవారు. అలా ఆయనకు 90 ఏళ్ల వయసొచ్చేదాకా రోజూ ఇదే మా పని. ఇక ఆయన పోయాక నా కొడుకుతో కలిసి ఇదే వృత్తిని కొనసాగిస్తున్నా. అయితే వారానికి మూడు రోజులు మాత్రమే వేటకు వెళ్తున్నా. నా ముగ్గురు కొడుకులు కూడా ప్రస్తుతం ఇదే కెరీర్‌లో ఉన్నారు. పీతలు/చేపలు పట్టడం నా కొడుకు పనైతే.. నేను బోటు నడపడం, పీతలకు ఎర వేసే బ్యాగుల్ని శుభ్రం చేయడం, పీతల కాళ్లకు బ్యాండ్స్‌తో బంధనాలు వేయడం.. వంటి పనులు చేస్తున్నా. రెండేళ్ల క్రితం నా కుడిచేతి మణికట్టు ఫ్రాక్చర్‌ అయింది.. అప్పట్నుంచి ఎడమ చేత్తోనే ఇవన్నీ చేస్తున్నా. ప్రస్తుతం మా వద్ద సుమారు 400 దాకా లాబ్‌స్టర్‌ ట్రాప్స్‌ (పీతలు పట్టడానికి ఉపయోగించే బోనులాంటి పరికరం) ఉన్నాయి..’ అంటూ ఎంతో ఉత్సాహంగా చెబుతున్నారీ బామ్మ.

ఆరోగ్య రహస్యమదే!

(Image for Representation)

చేపల వేటపై తనకున్న మక్కువతో ఇందులో లైసెన్స్‌ కూడా పొందారు ఒలీవియా. దీంతో ప్రస్తుతం తాను పుట్టిన మెయిన్‌ నగరంలో ‘ఎక్కువ వయసు ఉన్న ప్రొఫెషనల్‌ లైసెన్స్‌డ్‌ లాబ్‌స్టర్‌ ఉమన్‌’గానూ ఖ్యాతి గడించారామె. మరి, ఏ వృత్తికైనా రిటైర్మెంట్‌ ఉంటుంది.. మీరెప్పుడు రిటైరవుతారు? అని ఈ బామ్మను అడిగితే.. ఒక్కటే సమాధానమిస్తారు.. కొన ఊపిరి ఆగే దాకా ఇదే వృత్తిలో కొనసాగుతానంటున్నారు ఒలీవియా.

‘ప్రస్తుతం వారానికి మూడు రోజులు నా కొడుకుతో కలిసి చేపల వేటకు వెళ్తున్నా.. శీతాకాలంలో మాత్రం వెళ్లట్లేదు. వేటకెళ్లే రోజుల్లో ఉదయం 3.30 గంటలకే నిద్ర లేస్తాం. కాలకృత్యాలన్నీ తీర్చుకొని చేపల వేటకు సంబంధించిన వస్తువులన్నీ పట్టుకొని 5 గంటల కల్లా బోట్‌ వద్దకు చేరుకుంటాం. ఆ తర్వాత ఫిషింగ్‌ ప్రారంభిస్తాం. అలాగని ఇంట్లో ఉన్న రోజుల్లో మరీ ఆలస్యంగా నిద్ర లేస్తానేమో అనుకోకండి.. ఏ రోజైనా ఉదయాన్నే నిద్ర లేవడం నాకు ముందు నుంచీ అలవాటు. ఈ క్రమంలో 4.45 కే మెలకువ వచ్చేస్తుంటుంది. బహుశా ఇదే నన్ను ఈ వయసులోనూ ఉత్సాహంగా ఉండేలా చేస్తుందేమో! కొంతమంది మీరెప్పుడు రిటైరవుతారు? అని అడుగుతుంటారు. అలాంటి వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే. నా ఊపిరి ఆగే వరకు ఇదే పనిని కొనసాగిస్తా. మీరు నమ్ముతారో లేదో కానీ నాకు వయసు పెరిగినా.. ఇప్పటికీ నాలో ఉత్సాహం మాత్రం ఉరకలెత్తుతుంది.. అలాంటప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేయను?’ అంటూ ఓ నవ్వు రువ్వుతారు ఒలీవియా.

 

బేకింగ్‌ అంటే ఇష్టం!

వందేళ్లు దాటినా నా వంట నేనే చేసుకుంటానంటున్నారీ సెంచరీ బామ్మ. అంతేకాదు.. ఇప్పటికీ తన పిల్లలకూ ప్రేమగా వండివార్చుతున్నానంటున్నారు. ‘నా పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించా. ఈ క్రమంలో బేకింగ్‌ అంటే మక్కువ పెరిగింది. ఇప్పటికీ వారాంతాల్లో నా పిల్లల కోసం బేక్డ్‌ బీన్స్‌ తయారుచేస్తా. నాకు నేను చెప్పుకోకూడదు కానీ.. కేక్స్‌, బ్రౌనీస్‌, డోనట్స్‌ తయారుచేయడంలో నేను దిట్ట! ఇక పీతలు పట్టడమే కాదు.. వాటితో పీతల రోల్‌, గ్రిల్డ్‌ బన్‌.. వంటి వంటకాలు సైతం తయారుచేస్తుంటా..’ అంటూ తన పాకశాస్త్ర నైపుణ్యాలు బయటపెట్టారు ఒలీవియా.

వయసు మీద పడ్డాక.. వీల్‌ఛైర్‌లో ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా ఎవరి పనులు వాళ్లు చేసుకోవడంలోనే అసలైన ఆనందం దాగుందంటోన్న ఒలీవియా.. తన మాటలతోనే కాదు.. తన వృత్తినైపుణ్యాలు-చేతలతోనూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుంటారు. అందుకే ‘రాక్‌ల్యాండ్‌ హిస్టారికల్‌ సొసైటీ’ ఆమె జీవిత చరిత్రపై ‘Conversations with The Lobster Lady’ అనే పేరుతో తక్కువ నిడివి గల ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. అంతేకాదు.. అక్కడి ప్రజలు సైతం ఆమెను ‘The Lobster Lady’ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని