పాటలు రాయడమే కాదు.. పాడతారు కూడా.. - lyric writers also sing a song in telugu movies
close
Updated : 14/12/2020 15:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాటలు రాయడమే కాదు.. పాడతారు కూడా..

సొగసైన పదాలతో పాటలు రాసే కొందరు గీత రచయితలూ.. ఆకట్టుకునే సాహిత్యానికి ఊర్రూతలూగించే బాణీలు కట్టిన కొందరు సంగీత దర్శకులూ రాయడానికీ, ట్యూన్‌లు కట్టడానికే పరిమితం కాలేదు. గొంతు సవరించుకొని, అలరించే పాటలూ పాడారు!

సిరివెన్నెల కలం..గళం..

తన కలంతో తెలుగు పాటకు సొబగులద్దిన సిరి వెన్నెల గళం విప్పి మంచి పాటలు పాడిన సందర్భాలున్నాయి.  కళ్లు సినిమాలో ‘తెల్లారింది లెగండోయ్‌’ పాటతో గొంతు సవరించుకున్నారాయన. రామ్‌గోపాల్‌ వర్మ నిర్మించిన ‘మనీ’ సినిమాలో ‘వారెవా ఏమి ఫేసు..’ అని బ్రహ్మానందాన్ని ఆటపట్టించే సరదాగీతాన్ని ఆయనే రాసి, ఆలపించారు. వరుణ్‌తేజ్‌ చిత్రం ‘అంతరిక్షం’లో అంతరిక్షయానం పాటలో ఓ చరణం దగ్గర ఆయన గొంతు వినిపిస్తుంది.

జానపద జావళి.. పెంచల్‌ దాస్‌

రాయలసీమ సాహిత్య పరిమళాన్ని తెలుగు పాటకు అద్దిన రచయిత పెంచల్‌ దాస్‌.. నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’లో దారి చూడు... దమ్ము చూడు పాటను రాసి, పాడారు. త్రివిక్రమ్‌- ఎన్‌టీఆర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రంలో యాడబోయినాడో పాటకు కొంత మేర సాహిత్యాన్ని అందించడమే కాక ఆ పాటను ఆయనే స్వయంగా పాడి రాయలసీమ యాస అందాన్ని, అక్కడి నేల తడిని తన గొంతులో పలికించారు.  శర్వానంద్‌, ప్రియాంక మోహన్‌ కలయికలో తెరకెక్కుతున్న ‘ శ్రీకారం’లోనూ.. భలేగుంది బాల అనే గీతానికి ఆయనే సాహిత్యం అందించి ఆయనే పాడారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

తొలి నిప్పు కణం..విశ్వ

‘కేరాఫ్‌ కంచెరపాలెం’లో ‘ఆశాపాశం...’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’లో ‘నింగిచుట్టే...’ పాటలు రాసి తెలుగు ప్రేక్షకులను అలరించారు గీత రచయిత విశ్వ. మహేశ్‌బాబు, త్రిష నటించిన అతడు సినిమా టైటిల్‌ సాంగ్‌ను స్వయంగా ఆయనే రాసి పాడారు. అంతే కాదు పూరి జగన్నాథ్‌ చిత్రం ‘నేను నా రాక్షసి’లో పడితినమ్మో పాటకు ఆయన బాణీలందించి, పాటను రాసి, గాత్రమిచ్చారు. పవన్‌ కల్యాణ్‌, త్రిష కలయికలో తెరకెక్కిన ‘తీన్‌మార్‌’లోని చిగురబోనియా గీతాన్నీ రాసి పాడారు.

హృద్యమైన చంద్రబోస్‌ పాట

తెలుగు పాటల తోటలో చంద్రబోస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తన కలం నుంచి జాలువారిన పాటలెన్నో సూపర్‌ హిట్లుగా నిలిచాయి. ఆయన గొంతు సవరించుకొని పాట పాడారు. సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్ హీరోగా వచ్చిన ‘రంగస్థలం’లో కీలక సందర్భంలో వచ్చే ‘ఓరయ్యో...’ పాటను ఆయనే రాసి అంతే హృద్యంగా పాడారు. పెళ్లిసందడిలో సరిగమపదని, చిక్కలేదు చిన్నదాని ఆచూకీల్లో ఆయన గొంతు వినిపిస్తుంది. పరదేశీలోని బూరెల వారి అమ్మాయికి అనే గీతంలో ఆయన స్వరం వినిపిస్తుంది. 

కీరవాణి ఆలాపన

సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌.కీరవాణీ కూడా తన కలం బలాన్ని చూపించారు. ‘అనుకోకుండా ఒకరోజు’, ‘సై’, ‘ఈగ’, ‘వేదం’, ‘బాహుబలి’, ‘మగధీర’ చిత్రాల్లో ఆయన పాటలు రాశారు. అయితే వేదం సినిమాలోని మళ్లీపుట్టనీ, రూపాయి, యే చీకటి చేరనీ, వేదం టైటిల్‌ సాంగ్‌ పాటలను ఆయనే స్వయంగా రాసి, పాడి మరీ తెలుగు శ్రోతలను మెప్పించారు.

దేవీ శ్రీప్రసాద్‌.. హార్ట్‌బీట్‌

తెలుగులో పాటను రాసి పాడిన వారిలో ముందు వరుసలో ఉంటారు దేవీ శ్రీ ప్రసాద్‌. ఉదయ్‌కిరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘కలుసుకోవాలని’లో ‘ఉదయించిన సూర్యుడినడిగా’, ‘ఆనందం’ చిత్రంలో ‘ప్రేమంటే ఏమిటంటే’ , ‘శంకర్‌ దాదా ఎం.బి.బి.ఎస్‌.’లో ‘చైల చైలా’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లో సూపర్‌ మచ్చి వంటి హుషారైన గీతాలను రాసి పాడారు. మెగాస్టార్‌ నటించిన ‘ఖైదీ నెంబర్‌ 150’లో అమ్మడు లెట్స్‌డు కుమ్ముడు.. పాటకు సాహిత్యాన్ని అందించి పాటకోసం గళం విప్పారు. ‘అత్తారింటికి దారేది’లో నిన్ను చూడగానే, ‘నాన్నకు ప్రేమతో’లో టైటిల్‌ సాంగ్‌ పాటలనూ ఆయనే రాసి ఆలపించారు.

వీరితో పాటు మరికొందరు గీత రచయితలు, సంగీత దర్శకులు కూడా తెలుగు పాటకు సాహిత్యం, శ్రవ్యమైన గొంతును అందించి అలరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని