MAA Elections: అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు.. నిబంధనలివే! - maa elections guidelines issued
close
Updated : 18/09/2021 16:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు.. నిబంధనలివే!

హైదరాబాద్‌: తెలుగు సినీ నటుల సంఘం(MAA) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అక్టోబరు 10వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని గతంలో జరిగిన సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ‘మా’ ఎన్నికలకు సంబంధించిన తేదీ, నియమ నిబంధనలు, ఇతర విషయాలను అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. అదే రోజు ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఎనిమిది మంది ఆఫీస్ బేరర్స్ 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌తో కూడిన కమిటీకి ఈ ఎన్నికలు జరగనున్నాయి.

నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ

సెప్టెంబరు 27, 28, 29 తేదీల్లో నామినేషన్లు స్వీకరించి 30న వాటిని పరిశీలిస్తామని కృష్ణమోహన్‌ వివరించారు. అక్టోబరు 2వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా ఉపసంహరణకు అవకాశం ఉంటుందని, ఆ తర్వాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. నామినేషన్‌ దరఖాస్తుకు రూ.100, ఓటర్ల జాబితా కావాలంటే రూ.500 చెల్లించాలని తెలిపారు. ఆఫీస్‌ బేరర్‌ పదవికి పోటీ చేసే అభ్యర్థులు రూ.15వేలు, ఈసీ మెంబర్‌ రూ.10వేలు డిపాజిట్‌(నాన్‌ రిఫండబుల్‌)చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్లు సమర్పించే సమయంలో అవసరమైతే అభ్యర్థులు తమ గుర్తింపు కార్డులను చూపాలని. పోలింగ్‌ తేదీ రోజున ప్రతి ఒక్కరూ తమ గుర్తింపు కార్డుతో రావాల్సిందేనని వివరించారు

* ఒక అభ్యర్థి ఒకే పదవికి మాత్రమే పోటీ చేయాలి.

* గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్‌లకు హాజరు కాకపోయి ఉంటే పోటీ చేసేందుకు అనర్హులు.

* 20 శాఖల అసోసియేషన్‌లలో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.

* సీనియర్‌ సిటిజన్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం.

* ఓటు వేయడానికి వచ్చే సభ్యులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.

* నామినేషన్‌ సమర్పణ, ఓటు వేసే సమయంలో మాస్క్‌లు ధరించి రావాలి.

* పోలింగ్‌ బూత్‌లోకి మొబైల్‌ ఫోన్లకు అనుమతి లేదు.

‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నర్సింహరావు పోటీపడుతున్నారు. ప్రకాశ్‌రాజ్‌ ఇప్పటికే తన ప్యానెల్‌ సభ్యులను ప్రకటించారు. ప్రస్తుతం మంచు విష్ణు ప్యానెల్‌కు సంబంధించి బాబూమోహన్‌, రఘుబాబు పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే పూర్తి ప్యానెల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని