మహారాష్ట్రలో కరోనా రెండో దశ..! - maharashtra is in the beginning of a second wave of covid
close
Published : 16/03/2021 12:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో కరోనా రెండో దశ..!

నిర్లక్ష్యమే ప్రధాన కారణమన్న కేంద్రం

ముంబయి: మహారాష్ట్ర.. కొవిడ్‌ రెండో దశ ప్రారంభంలో ఉందని, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్లే రాష్ట్రంలో వైరస్‌ విచ్చలవిడిగా వ్యాపిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. గత కొద్ది కాలంగా అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర నిపుణుల బృందం ఒకటి గతవారం రాష్ట్రంలో పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించింది. ఈ బృందం అందజేసిన నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖ తాజాగా ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వానికి లేఖ రాసింది.

‘‘మహారాష్ట్ర.. కరోనా మహమ్మారి రెండో దశ ప్రారంభంలో ఉంది. వైరస్‌ పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో కాంటాక్ట్‌ అయినవారిని గుర్తించడం, వారిని క్వారంటైన్‌లో ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని ప్రజలు కూడా కొవిడ్‌ నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వైరస్‌ వ్యాప్తి పరిస్థితులపై జిల్లా యంత్రాంగాల్లో ఎలాంటి ఆందోళన కన్పించట్లేదని కేంద్ర బృందం గుర్తించింది. ఇప్పటికే చాలా చర్యలు చేపట్టామన్న భావనలో వారు ఉన్నారు. ఈ పరిణామాలే కేసుల పెరుగుదలకు దారితీశాయి’’ అని రాష్ట్ర సీఎస్‌కు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ పేర్కొన్నారు.

ఔరంగాబాద్‌, నాసిక్‌, జలగావ్‌, నాగ్‌పూర్‌ వంటి జిల్లాల్లో తీసుకొచ్చిన పాక్షిక లౌక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్ల వంటి నిబంధనలు.. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తక్కువ ప్రభావం చూపుతున్నాయని కేంద్రం అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగాలు.. కేంద్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్మెంట్‌ వ్యూహంపై దృష్టిపెట్టాలని సూచించింది. గతేడాది ఆగస్టు-సెప్టెంబరులో ఎలాంటి వ్యవస్థ తీసుకొచ్చామో ఇప్పుడు కూడా అలాంటి చర్యలే చేపట్టాలని పేర్కొంది.

మహారాష్ట్రలో గత నాలుగు రోజులుగా 15వేలకు పైనే కొత్త కేసులు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో సగానికి పైగా ఒక్క ఈ రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,29,464కు చేరింది. అటు క్రియాశీల కేసులు కూడా లక్షపైనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. సినిమా థియేటర్లలో కెపాసిటీని సగానికి తగ్గించింది. వివాహాది శుభాకార్యాలకు కూడా పరిమిత సంఖ్యలో హాజరవ్వాలని, కార్యాలయాలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం సదుపాయం కల్పించాలని సూచించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని