‘మహా’అప్‌డేట్‌: 1నుంచి 8తరగతులకు పరీక్షల్లేవ్‌ - maharashtra to promote students from classes 1 to 8 without exams
close
Updated : 03/04/2021 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మహా’అప్‌డేట్‌: 1నుంచి 8తరగతులకు పరీక్షల్లేవ్‌

మహారాష్ట్ర సర్కార్‌ కీలక నిర్ణయం

ముంబయి: కరోనా విజృంభణతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 8తరగతుల వరకు పరీక్షలు నిర్వహించరాదని నిర్ణయించింది. ఆ తరగతుల విద్యార్థులు పరీక్షలు రాయకుండానే వారిని పైతరగతులకు ప్రమోట్‌ చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. 9, 11 తరగతుల విద్యార్థులకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పాఠశాలలు మూసి ఉండటంతో అకడమిక్‌ సమయం దెబ్బతిన్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

మరోవైపు, కొవిడ్‌ ప్రభావంతో పిల్లల చదువులు అగమ్యగోచరంగా మారాయి. గతేడాది మార్చిలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి విద్యా సంస్థలు మూతబడటంతో గత విద్యా సంవత్సరంలో కూడా పరీక్షలు సజావుగా సాగలేదు. అప్పుడు కూడా పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ మహమ్మారి గతంలో కాస్త తగ్గుముఖం పట్టడంతో పరిస్థితులు గాడినపడుతున్నాయని భావిస్తున్న తరుణంలో మరోసారి వైరస్‌ విజృంభిస్తుండటంతో ఆయా రాష్ట్రాలు కఠిన ఆంక్షల అమలు దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. మహారాష్ట్రలో కొవిడ్‌ ఉద్ధృతి అధికంగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే దాదాపు 47వేలకు పైగా కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో మున్ముందు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నిన్న ప్రకటించారు. అంతేకాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. పరిస్థితులు ఇలాగే ఉంటే మాత్రం లాక్‌డౌన్‌ విధించే అవకాశాలనూ కొట్టిపారేయలేమంటూ ఆయన వ్యాఖ్యానించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని