మహారాష్ట్రలో పగ్గాల్లేని ‘కరోనా’!  - maharastra covid update
close
Updated : 25/03/2021 22:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో పగ్గాల్లేని ‘కరోనా’! 

 ఒక్కరోజే దాదాపు 36వేల కొత్త కేసులు

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ శరవేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ భారీ సంఖ్యలో నమోదవుతున్న కొత్త కేసులు గత రికార్డులను బ్రేక్‌ చేస్తున్నాయి. గురువారం ఒక్కరోజే దాదాపు 36వేల కొత్త కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలోకి కరోనా ప్రవేశించిన తర్వాత గతంలో ఎన్నడూలేనంత స్థాయిలో 24గంటల్లోనే 35,952 కొత్త కేసులు, 111 మరణాలు వెలుగుచూశాయి. అదే సమయంలో 20,444 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 1,88,78,754 శాంపిల్స్‌ పరీక్షించగా.. 26,00,833 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 22,83,037మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 53,795మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 2,62,685 క్రియాశీల కేసులు ఉన్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

ముంబయిలో కొత్త రికార్డులు

ముంబయి నగరంలో గడిచిన 24గంటల్లోనే రికార్డుస్థాయిలో 5504 పాజిటివ్‌ కేసులు, 14మరణాలు నమోదైనట్లు బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ వెల్లడించింది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజే ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. అంతకు ముందురోజు ముంబయిలో 5185 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య రెట్టింపు కావాడానికి పట్టే సమయం 75రోజులకు తగ్గడం ఆందోళనకర విషయమని అధికారులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైరస్‌ విస్తృతి మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా అత్యధిక కొవిడ్ యాక్టివ్‌ కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ప్రస్తుతం ముంబయిలో 32,529 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఠానే 25,130, పుణె 50,240, నాసిక్‌ 18176, నాగ్‌పుర్‌ 35,795, నాందేడ్‌ 12,272, ఔరంగాబాద్‌ 17,411, జల్‌గావ్‌ 6,146, అకోలా 4,699, అహ్మద్‌నగర్‌లో 5,946 చొప్పున ఉన్నాయి.

కలవరపెడుతోన్న డబుల్‌ మ్యుటేషన్‌..?

దేశంలో నిత్యం నమోదవుతున్న కరోనా కేసుల్లో 60శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 53వేల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీటిలో కేవలం ఒక్క మహారాష్ట్రలోనే 31వేలకు పైగా కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటికే అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం, పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తోంది. అంతేకాకుండా వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న జిల్లాల్లో స్థానికంగా ఆంక్షలు విధించాలని అధికారులకు సూచించింది. అయితే, రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రత ఒక్కసారిగా పెరగడానికి డబుల్‌ మ్యుటేషన్‌ కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వెలుగుచూసిన వైరస్ రకా‌లతో పోలిస్తే ప్రస్తుతం బయటపడుతోన్న మ్యుటేషన్‌ చెందిన వైరస్‌లు సరిపోలేడం లేదన్న నివేదికలను నిపుణులు ఉదహరిస్తున్నారు. ఇప్పటికే అక్కడ E484Q, L452R మ్యుటేషన్ల రకాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

దేశ రాజధానిలోనూ అదేతీరు..

దేశ రాజధాని దిల్లీలోనూ వైరస్‌ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. గురువారం ఒక్కరోజే అక్కడ 1515 కేసులు బయటపడినట్లు దిల్లీ ప్రభుత్వం పేర్కొంది. డిసెంబర్‌ తర్వాత రోజువారీ కేసులు పెరగడం ఇదే తొలిసారి. డిసెంబర్‌ 16న అక్కడ అత్యధికంగా 1500కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అక్కడ 5497 క్రియాశీల కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని