భావోద్వేగాల ‘జెర్సీ’.. సందేశాత్మక ‘మహర్షి’ - maharshi and jersey movies awarded in national film festival
close
Updated : 22/03/2021 20:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భావోద్వేగాల ‘జెర్సీ’.. సందేశాత్మక ‘మహర్షి’

సత్తా చాటిన తెలుగు చిత్రాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాతీయ స్థాయిలో మరోసారి తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు మరో మూడు పురస్కారాలను కైవసం చేసుకొని ఔరా అనిపించాయి. 2019 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు సోమవారం ప్రకటించింది. అందులో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’, నేచురల్‌ స్టార్‌ నాని నటించిన ‘జెర్సీ’ ఉన్నాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రం, ఉత్తమ కొరియోగ్రఫర్‌ విభాగాల్లో మహర్షి పురస్కారాలు సొంతం చేసుకుంది. ఉత్తమ తెలుగు భాష చిత్రం, ఉత్తమ ఎడిటర్‌ విభాగాల్లో జెర్సీ అవార్డులు గెలుచుకుంది. మరి ఇంతకీ ఆ సినిమాలు జాతీయ స్థాయిలో అవార్డులు పొందడానికి గల కారణాలేంటో ఓసారి చూద్దాం..

అసలైన నివాళి ‘జెర్సీ’

మన దేశంలో క్రికెట్‌.. సినిమా.. ఎంతో ఎమోషన్‌తో కూడుకున్న పదాలు. ఇక ఈ రెండింటినీ ఒకచోట కలిపితే ఎమోషన్‌ తారస్థాయికి చేరుతుంది. అదే చేశారు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి-యువ కథానాయకుడు నాని. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రంజీ క్రికెటర్‌ రమణ్‌ లాంబ జీవితాన్ని ప్రేరణగా తీసుకుని దీన్ని తెరకెక్కించారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. 2019 ఏప్రిల్‌ 19న వచ్చిన ఈ చిత్రం.. అభిమానుల హృదయాలను తాకింది. బాలీవుడ్‌లోనూ ఈ సినిమా రీమేక్‌ అయింది. కట్‌ చేస్తే.. ఇప్పుడు ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా నిలిచింది.

నవీన్‌ నూలి

ఎప్పటికైనా భారత జట్టుకు క్రికెట్‌ ఆడాలని కలలుకంటుంటాడు హీరో (అర్జున్‌). కొన్ని అనివార్య కారణాల వల్ల క్రికెట్‌ను మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. తర్వాత పెళ్లి.. కొంతకాలానికి ఒక కుమారుడు.. ఇలా జీవితం సాధారణంగా సాగిపోతూ ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం కూడా పోతుంది. ఈ క్రమంలోనే ఒకసారి తన కుమారుడు.. టీమ్‌ ఇండియా ‘జెర్సీ’ కావాలని అడుగుతాడు. కన్న కొడుకు కోసం కనీసం జెర్సీ కూడా కొనివ్వలేని స్థితిలో ఉన్నానని గ్రహించి.. తనను తానే అసహ్యించుకుంటాడు అర్జున్‌. తన కొడుకు కోసమైనా మళ్లీ క్రికెటర్‌గా మారాలని నిర్ణయించుకుంటాడు. క్రికెట్‌ మైదానంలో అడుగుపెడతాడు. 36 ఏళ్ల వయసులో క్రికెట్‌ ఆడటమేంటని ఎన్నో ఎత్తి పొడుపులు.. అవమానాలు. అన్నింటినీ మౌనంగా దిగమింగుతూ.. హీరో తన కలవైపు ఎలా ప్రయాణించాడన్నదే కథ. ‘నువ్వు క్రికెట్‌ ఆడితే హీరోలా అనిపిస్తావు నాన్న’ అంటూ సాగే డైలాగ్‌లు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా జెర్సీ అనగానే గుర్తొచ్చేది రైల్వే స్టేషన్‌ సీన్. ఆ సన్నివేశంలో నానిని తప్ప మరెవర్నీ ఊహించుకోలేం. ఈ సినిమాలో నాని నటన, డైరెక్టర్‌ పనితీరు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయనడంలో సందేహం లేదు.

జెర్సీకి వచ్చిన అవార్డులు..

జీ తెలుగు సినీ అవార్డు - ఫేవరెట్‌ యాక్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - నాని
జీ తెలుగు సినీ అవార్డు -  ఉత్తమ హీరోయిన్‌ - శ్రద్ధ
క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ - ఉత్తమ డైరెక్టర్‌ - గౌతమ్‌ తిన్ననూరి
క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ - ఉత్తమ నటుడు - నాని
జాతీయ చిత్ర పురస్కారాలు -  ఉత్తమ తెలుగు చిత్రం - జెర్సీ
జాతీయ చిత్ర పురస్కారాలు -  ఉత్తమ ఎడిటర్‌ - నవీన్‌ నూలి

 

సక్సెస్‌కు అసలైన అర్థం ‘మహర్షి’

‘రైతు’ సెంటిమెంట్‌కు కనెక్ట్‌  కాని ప్రేక్షకులుంటారా..? రైతును తెరపై చూపిస్తే.. థియేటర్‌లో ఆటోమేటిక్‌గా ఎమోషన్‌ పండుతుంది. దానికి మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడిస్తూ వచ్చిందే ‘మహర్షి’. సక్సెస్‌కు అసలైన అర్థం చెప్పిన ఈ సినిమాలో మహేశ్‌బాబు, పూజా హెగ్డే జంటగా.. అల్లరి నరేశ్‌ ప్రధానపాత్రలో నటించారు. వంశీపైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మే 9న విడుదలైన ఈ చిత్రం కథ.. పాటలు.. డ్యాన్స్‌.. ఇలా అన్నింట్లోనూ ప్రేక్షకులను అలరించింది. మహేశ్‌బాబు కెరీర్‌లో ఓ మంచి సందేశాత్మక చిత్రంగా నిలిచింది.

రాజు సుందరం

జీవితంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండే ఓ మధ్య తరగతికి చెందిన యువకుడు రిషి కుమార్ (హీరో). అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలోనే పెద్ద కంపెనీ అయిన ఆరిజిన్‌కు సీఈఓ అవుతాడు. సక్సెస్‌కు ఫుల్‌స్టాప్‌ ఉండదనేది రిషి సిద్ధాంతం. ఈ క్రమంలోనే తన సక్సెస్‌ కోసం తల్లిదండ్రులను, స్నేహితులను దూరం చేసుకుంటాడు. చివరికి.. తన సక్సెస్ వెనుక తన స్నేహితుడు రవి (అ్లలరి నరేశ్‌) త్యాగం ఉందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత.. తన స్నేహితుడు ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకుని రవిని అమెరికా తీసుకువెళ్లడం కోసం స్వదేశానికి వస్తాడు. ఈ క్రమంలోనే ఆ సమస్య తన స్నేహితుడిది మాత్రమే కాదు.. ఒక గ్రామం మొత్తానిది అని గ్రహిస్తాడు. అలా.. ఆ గ్రామం కోసం హీరో ఎలా పోరాడాడన్నదే కథ. ఈ సినిమాలో డైరెక్టర్‌ వంశీ.. మహేశ్‌ను విద్యార్థిగా, ఉద్యోగిగా, రైతుగా చూపించడంలో సఫలమయ్యారు. ‘శ్రీమంతుడు’ తర్వాత మరోసారి అదే తరహాలో వచ్చిన ‘మహర్షి’ ఆకట్టుకుందంటే.. హీరో మహేశ్‌, డైరెక్టర్‌ వంశీతో పాటు చిత్రబృందం విశేష శ్రమ దాగి ఉంది. రైతు అంటే సానుభూతి కాదు.. రైతు అంటే గౌరవం అని నిరూపించిందీ చిత్రం.

మహర్షికి వచ్చిన అవార్డులు..

జీ తెలుగు సినీ అవార్డు - ఉత్తమ సహాయ నటుడు - నరేశ్‌
జీ తెలుగు సినీ అవార్డు -  ఉత్తమ నటి - పూజ హెగ్డే
జాతీయ చిత్ర పురస్కారాలు -  ఉత్తమ వినోదాత్మక చిత్రం - మహర్షి
జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ కొరియోగ్రఫీ - రాజు సుందరం





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని