మాజీ మంత్రి దేవినేని ఉమా వర్గీయులపై రాళ్ల దాడి - main
close
Updated : 28/07/2021 18:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాజీ మంత్రి దేవినేని ఉమా వర్గీయులపై రాళ్ల దాడి

ఏపీలో వైకాపా కార్యకర్తల దాష్టీకం

అర్ధరాత్రి కారు అద్దాలు పగులగొట్టి ఉమాను అదుపులోకి తీసుకున్న పోలీసులు

జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం : కృష్ణా జిల్లాలో తెదేపా, వైకాపా నేతల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇది ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లక్ష్యంగా రాళ్ల దాడి చేసేవరకూ వెళ్లింది. ఈ దాడిలో ఓ తెదేపా నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి.కొండూరు మండలంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.  చివరికి ఉమాను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కొండపల్లిలో మైలవరం నియోజకవర్గ తెదేపా ముఖ్య కార్యకర్తల సమావేశం దేవినేని ఉమా అధ్యక్షతన మంగళవారం సాయంత్రం నిర్వహించారు. అనంతరం నాయకులంతా కొండపల్లి రిజర్వు అడవిలోకి వెళ్లారు. అక్కడ గతంలో అక్రమంగా తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, మీడియాతో మాట్లాడారు. ఈ దృశ్యాలను తెదేపా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. విషయం తెలుసుకున్న వైకాపా కార్యకర్తలు జి.కొండూరు మండలం గడ్డమణుగు వద్ద కాపు కాశారు. దాంతో పోలీసులు దేవినేని ఉమాను డొంకరోడ్డులో జి.కొండూరు తీసుకెళ్లారు. అది తెలిసిన వైకాపా వర్గీయులు... రోడ్డుపైకి చేరుకుని తెదేపా నేతల వాహనాలపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఓ తెదేపా నాయకుడి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసు రక్షణ మధ్య తెదేపా నేతల వాహనాలు జి.కొండూరు స్టేషను సమీపానికి చేరుకున్నాయి. 

స్టేషను వద్ద ఉద్రిక్తత

ఉమాను పోలీసులు స్టేషన్‌కు తీసుకొస్తున్నారన్న విషయం తెలుసుకున్న మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల వైకాపా, తెదేపా నేతలు, కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. దీంతో స్టేషన్‌ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జీ చేశారు. అయినా వారు కదలలేదు.  రాత్రి అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్టేషన్‌ వద్దకు భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. స్టేషన్‌ వద్ద భారీగా నాయకులు మోహరించడంతో దేవినేని ఉమాను తీసుకొస్తున్న పోలీసులు అక్కడికి అర కిలోమీటరు దూరంలోనే వాహనాన్ని నిలిపివేశారు.  రాత్రి 7 గంటల నుంచి ఉమా అక్కడే కారులో ఆగిపోయారు. తాను ఫిర్యాదు ఇస్తానని, తీసుకోవాలని ఉమా కోరినా పోలీసులు స్పందించలేదు. ఫిర్యాదు తీసుకునే దాకా తాను కదిలేది లేదని ఆయన భీష్మించుకుని అందులోనే కూర్చున్నారు. కారును తొలగించి, ఉమాను తరలించేందుకు పోలీసులు పెద్ద క్రేన్‌ను కూడా తెప్పించారు. వీలు కాకపోవడంతో చివరకు కారు అద్దాన్ని తొలగించి ఉమాను అదుపులోకి తీసుకున్నారు. 1.15 గంటల ప్రాంతంలో తమ వాహనంలోకి ఎక్కించుకుని తరలించారు. దాడి విషయం తెలుసుకున్న చంద్రబాబు.. ఫోనులో దేవినేని ఉమాతో మాట్లాడారు. వైకాపా అక్రమాలపై నిలదీసినందుకు దాడిచేయడం దుర్మార్గమని, మీ వెంట యావత్తు పార్టీ అండగా ఉంటుందన్నారు.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని