Corona Vaccine: టీకా తాత్పర్యం తెలుసుకో! - major doubts and questions on corona vaccine and vaccination
close
Updated : 04/05/2021 16:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona Vaccine: టీకా తాత్పర్యం తెలుసుకో!

అందరూ కోరుకున్నట్టుగానే, అనతికాలంలోనే 18 ఏళ్లు పైబడ్డవారికీ కొవిడ్‌-19 టీకా అందుబాటులోకి వచ్చింది. కరోనా మీద వీలైనంత త్వరగా, సమర్థంగా విజయం సాధించటంలో ఇది అత్యంత కీలక పరిణామం అనటం నిస్సందేహం. మనదేశంలో యువతీ యువకుల సంఖ్య ఎక్కువ. ఇలాంటి చిన్నవయసువారంతా టీకాలు తీసుకుంటే కరోనా పీచమణచటానికి ఎంతో సమయం పట్టదు. సరైన అవగాహనతో, తగు జాగ్రత్తలతో టీకా తీసుకోవటమే ఇప్పుడందరి కర్తవ్యం కావాలి. కాకపోతే తెలిసో తెలియకో కొందరు కొవిడ్‌-19 టీకా విషయంలో ఇప్పటికీ అనేక రకాలుగా సందేహిస్తుండటం విచారకరం. ఇది తగదు. తప్పుడు ప్రచారాల మూలంగా భయాల్లో మునిగిపోవటం ఎంతమాత్రం మంచిది కాదు.

కవైపు రోజురోజుకీ ఎక్కువవుతున్న కొవిడ్‌-19 కేసులు. మరోవైపు పెరిగిపోతున్న మరణాలు. ఆసుపత్రుల్లో రద్దీ పెరగటం.. సదుపాయాలు, చికిత్సలు సత్వరం అందకపోవటం వంటి దృశ్యాలు భయానక పరిస్థితికే అద్దం పడుతున్నాయి. ఇంతటి భీతావహ వాతావరణంలోనూ టీకా ఒక్కటే ఆశాజనకంగా, తిరుగులేని బ్రహ్మాస్త్రంలా అభయమిస్తోంది. నిజానికి టీకా సైతం కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవీ2 లాంటిదే. కాకపోతే ప్రమాదకరం కాదు. ఎలాంటి హాని చేయకుండానే మనలో రోగనిరోధకశక్తిని ఉత్తేజితం చేస్తుంది. యాంటీబాడీలు పుట్టుకొచ్చేలా చేసి మున్ముందు ఇన్‌ఫెక్షన్‌ బారినపడకుండా.. ఒకవేళ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తినా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లకుండా కాపాడుతుంది. అయితే ఆరోగ్యవంతుల దగ్గర్నుంచి మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్థమా, అలర్జీల వంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారి వరకూ అందరి మనసుల్లోనూ ఒకటే ప్రశ్న. టీకా తీసుకోవాలా? వద్దా? తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పటికే మనదగ్గర దాదాపు 16 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు. అయినా ఇంకా సందేహాలు ఎందుకు? ఏదైనా అనుమానం ఉంటే నివృత్తి చేసుకొని, ముందుకు సాగటమే తక్షణం చేయాల్సిన పని.

నెలసరి సమయంలో టీకా తీసుకోవచ్చా?

యుక్తవయసు అమ్మాయిలకు టీకా అనగానే నెలసరి సమయంలో తీసుకోవచ్చా? అనే చాలామంది అడుగుతున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో అపోహలూ రాజ్యమేలుతున్నాయి. వీటిల్లో ప్రధానమైంది నెలసరితో రోగనిరోధకశక్తి మందగిస్తుందని.. అందువల్ల నెలసరి రావటానికి ఐదు రోజుల ముందు, నెలసరి అవుతున్నప్పుడు, తర్వాత టీకా తీసుకోవద్దని. ఇందులో ఏమాత్రం నిజం లేదు. నెలసరి మీద, రుతుస్రావం మీద టీకా ఎలాంటి విపరీత ప్రభావం చూపదు. అంతర్జాతీయ వైద్య సంస్థలన్నీ ఈ విషయాన్నే గట్టిగా పేర్కొంటున్నాయి. అందువల్ల నెలసరి సమయాన్ని బట్టి టీకా తేదీని మార్చుకోవటం వంటివేవీ చేయొద్దు. నెలసరితో సంబంధం లేకుండా 18 ఏళ్లు దాటిన మహిళలంతా తప్పకుండా టీకా తీసుకోవాలి.

గర్భిణులు, పాలిచ్చే తల్లులు తీసుకోవచ్చా?
మనదగ్గర ప్రస్తుతానికి గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు టీకా వద్దనే ప్రభుత్వం సూచిస్తోంది. ఒకవేళ తెలియకుండా పొరపాటున తీసుకున్నా ఏమీ కాదు. భయపడాల్సిన పనేమీ లేదు.
కొత్తగా పెళ్లయినవారు తీసుకోవచ్చా?
గర్భధారణకు ప్రయత్నించేవారు, కొత్తగా పెళ్లయిన యువతులు టీకా తీసుకోవద్దని ప్రభుత్వ మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. టీకా తీసుకున్న సమయంలో గర్భం ధరించినా ఇబ్బందులేవీ తలెత్తటం లేదనే అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నప్పటికీ మనదగ్గర దీని విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
గర్భసంచిలో తిత్తులుంటే?
అవివాహిత అమ్మాయిలు, యువతులు నిరభ్యంతరంగా టీకా తీసుకోవచ్చు. పెళ్లయినా కాకున్నా నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువ, తక్కువ అయ్యేవారు.. గర్భసంచిలో నీటితిత్తుల వంటి సమస్యలు గలవారు కూడా టీకా తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
రక్తహీనతతో బాధపడుతుంటే?
మనదేశంలో రక్తహీనత ఎక్కువ. మూడింట రెండొంతుల మంది మహిళలు దీంతో బాధపడుతున్నవారే. దీనికి, టీకాకు సంబంధమేమీ లేదు. రక్తహీనత ఉన్నా కూడా టీకా విధిగా తీసుకోవాలి.

సంతాన సమస్యలేవైనా వస్తాయా?

సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న మరో పెద్ద అపోహ ఇది. టీకాలోని పదార్థాలు మాయలోని ప్రొటీన్‌కు హాని కలిగిస్తాయని కొందరు వెనకాడుతున్నారు. వీటిల్లో ఎలాంటి నిజమూ లేదు. టీకాల్లో మన శరీరానికి హాని చేసే పదార్థాలేవీ ఉండవని తెలుసుకోవాలి. ఇవి ఎలాంటి సంతాన సమస్యలను కలగజేయవు. గర్భిణులు రకరకాల టీకాలు తీసుకోవటం చూస్తున్నదే. వీటితో పుట్టుకొచ్చే యాంటీబాడీలు గర్భస్థ శిశువుకూ చేరుకుంటాయి. కాన్పు తర్వాత తల్లిపాల ద్వారా శిశువులకూ అందుతాయి. కొవిడ్‌-19 టీకా విషయంలోనూ ఇలాంటి ఫలితమే కనిపిస్తున్నట్టు అంతర్జాతీయ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి సంతాన సమస్యలపై ఎలాంటి అపోహలు, భయాలు పెట్టుకోవద్దు. అయితే సంతాన చికిత్సలు తీసుకునేవారు.. అండాన్ని సేకరించటానికి, గర్భంలో పిండాన్ని ప్రవేశపెట్టటానికి మూడు రోజుల ముందు, మూడు రోజుల తర్వాత టీకా తీసుకోవటం తగదు. అలాగని టీకా హాని చేస్తుందనీ కాదు. టీకా తీసుకున్నాక జ్వరం వంటి ఇబ్బందులు తలెత్తితే అవి టీకాతోనా? సంతాన చికిత్సల దుష్ప్రభావాలా? అనేవి తెలుసుకోవటం కష్టమవుతుంది కాబట్టే.  

సోరియాసిస్‌ గలవారు?
సోరియాసిస్‌ వంటి చర్మ సమస్యలు గలవారు రోగనిరోధకశక్తిని అణచిపెట్టే కొన్నిరకాల మందులు వాడుతుంటారు. ఇలాంటివారు టీకా తీసుకుంటే యాంటీబాడీల ప్రతిస్పందనలు అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌, ఎస్‌ఎల్‌ఈ వంటి స్వీయ రోగనిరోధక జబ్బులతో బాధపడేవారు డాక్టర్‌ను సంప్రదించి టీకా తీసుకోవాలి. అవసరమైతే జబ్బు తీవ్రతను బట్టి డాక్టర్లు మందుల మోతాదు కొంతవరకు తగ్గిస్తారు. దీంతో టీకా సామర్థ్యం పెరిగేలా చేసుకోవచ్చు. మందుల మోతాదు తగ్గించే అవకాశం లేకపోయినా టీకా తీసుకోవటమే మంచిది. ఎంతోకొంత టీకా రక్షణ లభించే అవకాశం లేకపోలేదు.
రెటీనా రక్తనాళంలో గడ్డ ఉంటే?
ప్రధాన రెటీనా రక్తనాళంలో రక్తం గడ్డ (సెంట్రల్‌ రెటీనల్‌ ఆర్టరీ అక్లూజన్‌) గలవారు రక్తం గడ్డలు ఏర్పడకుండా చూసే మందులు వేసుకుంటుంటారు. ఇలాంటివారు కొవిషీల్డ్‌కు బదులు కొవాగ్జిన్‌ టీకా వేసుకోవటం మంచిది. కొవిషీల్డ్‌తో కొందరికి రక్తం గడ్డలు ఏర్పడే అవకాశముంటున్నట్టు బయటపడింది. కాబట్టి డాక్టర్‌ పర్యవేక్షణలో తగు టీకా తీసుకోవాలి.
ఇతరత్రా టీకాలు వేయించుకుంటే?
ఫ్లూ, న్యుమోనియా వంటి ఇతరత్రా టీకాలు వేయించుకున్నవారు రెండు వారాల తర్వాతే కొవిడ్‌-19 టీకా వేయించుకోవాలి.
టీకా కోసం పోతే..?
టీకా కోసం వెళ్లి కొవిడ్‌-19ను వెంట తెచ్చుకోవటం తగదు. టీకా కేంద్రానికి వెళ్లినప్పుడు విధిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టీకా రెండు మోతాదులు తీసుకున్నాక 2 వారాల తర్వాతే వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుంది. అప్పటివరకూ మిగతావారితో సమానంగానే ముప్పు ఉంటుంది. ఇటీవల టీకా కేంద్రాల్లో రద్దీ బాగా పెరిగిపోయింది. దూరం పాటించటం లేదు. టీకా లభిస్తుందో, లేదోననే ఆందోళనలతో ఒకరి మీద మరొకరు పడిపోతున్నారు. ఇది కొవిడ్‌ వ్యాపించటానికి దారితీస్తోంది. మంచి నాణ్యమైన మాస్కులు ధరించాలి. గ్లవుజులు వేసుకోవాలి. ముఖానికి షీల్డ్‌ ధరిస్తే ఇంకా మంచిది. దీంతో కళ్లు, ముక్కు పూర్తిగా కప్పుకొని ఉండేలా చూసుకోవచ్చు. మాటిమాటికి చేత్తో ముఖాన్ని తాకటమూ తగ్గుతుంది.

అలర్జీలు, ఆస్థమా బాధితులు తీసుకోవచ్చా?

చిన్న చిన్న అలర్జీ సమస్యలకు, ఆస్థమాకు భయపడాల్సిన పనిలేదు. నిరభ్యంతరంగా టీకా తీసుకోవచ్చు. టీకాలో వాడే నిల్వ పదార్థాల వల్ల రియాక్షన్‌ వస్తేనే దాన్ని తీవ్రంగా పరిగణిస్తారని తెలుసుకోవాలి. కొందరు ‘నాకు ఈ మందు పడదు, ఆ మందు పడదు’ అని భయపడుతున్నారు. ఇలాంటివారు టీకా కేంద్రంలో సిబ్బందికి ముందే విషయాన్ని తెలియజేయాలి. అయితే గతంలో స్టీవెన్స్‌ జాన్సన్‌ సిండ్రోమ్‌ వంటి తీవ్ర అలర్జీ తలెత్తినవారు గానీ ఇంతకుముందు ఇతరత్రా టీకాలు వేసుకున్నప్పుడు అలర్జీలు తలెత్తినవారు గానీ టీకాకు దూరంగా ఉండటం మంచిది. స్టీవెన్స్‌ జాన్సన్‌ సిండ్రోమ్‌ గలవారి విషయంలోనూ టీకా తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనం, వేసుకోకపోతే వచ్చే నష్టం బేరీజు వేసి డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు.

రక్తాన్ని పలుచబరచే మందులేసుకుంటే?

ప్రస్తుతం ఎంతోమంది చిన్న వయసులోనే రక్తాన్ని పలుచబరచే యాస్ప్రిన్‌, క్లొపిడెగ్రెల్‌ మందులు వేసుకుంటున్నారు. వీటిని వేసుకుంటున్నా కూడా వయసుతో నిమిత్తం లేకుండా టీకా తీసుకోవచ్చు. కాకపోతే రక్తం గడ్డలు ఏర్పడకుండా చూసే మాత్రలు (యాంటీ కొయాగ్యులెంట్లు) వేసుకునేవారు పీటీఐఎన్‌ఆర్‌ పరీక్ష చేసుకొని, ఫలితాలను బట్టి వేయించుకోవాలి. పీటీఐఎన్‌ఆర్‌ ఎక్కువగా ఉంటే ఇంజెక్షన్‌ ఇచ్చిన చోట రక్తం గూడు కట్టే ప్రమాదముంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని