పేదవాడి పెద్దమనసు - meet this auto driver bhumaiah from vizag for serves free food to 150 people a day
close
Updated : 04/04/2021 05:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేదవాడి పెద్దమనసు

పేదల ఆకలి తీరుస్తున్న ఆటో డ్రైవర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతడో సాదాసీదా ఆటో డ్రైవర్‌. అయితేనేం.. పేదల ఆకలి తీర్చే పెద్ద మనసు ఆయన సొంతం. నిత్యం వందల మంది ఆయన ఆటో కోసం ఎదురుచూస్తారు. కడుపు నిండాక కళ్లతోనే కృతజ్ఞతలు చెబుతారు. కుటుంబ పోషణకు రాత్రింబవళ్లు పనిచేసే ఆ శ్రామికుడు మిగిలిన కాస్త శక్తిని అన్నదాన సేవకే వెచ్చిస్తున్నాడు. ఆరేళ్లుగా నిస్వార్థ సేవాస్ఫూర్తితో ముందుకుసాగుతున్నాడు. భూమయ్య అనే ఆటో డ్రైవర్‌ విశాఖలోని మానసిక రోగుల ఆస్పత్రి వద్ద ఆరేళ్లుగా నిత్యం అన్నదానం చేస్తున్నాడు.

మానసిక రోగుల కోసం ప్రభుత్వం భోజనం సమకూరుస్తుంది. వారికి సహాయంగా అక్కడే ఉండే బంధువులు, సహాయకులకు మాత్రం ఎలాంటి ఆహార సదుపాయం ఉండదు. పూటపూటకు హోటళ్లలో భోజనం చేసే స్థోమత లేని నిరుపేదలైన వారందరికీ భూమయ్యే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాడు. స్వయంగా ఇంటి వద్ద భోజనం వండి సమయం ప్రకారం ఆటోలో తెచ్చి వారికి వడ్డిస్తాడు. రోజూ ఈ విధంగా 150 మందికి పైగా ఆకలి తీరుస్తున్నాడు.

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన భూమయ్య పిల్లల చదువు కోసం విశాఖకు వలస వెళ్లాడు. పది మందికి అన్నం పెడితే మంచిదని ఆరేళ్ల క్రితం ఓ వృద్ధురాలు ఆయనకు సలహా ఇచ్చింది. కొంత సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. అప్పటినుంచే ‘అన్నపూర్ణ నిత్య అన్నదానం’ పేరుతో భూమయ్య సేవ ప్రారంభమైంది. తర్వాత దాతల సహకారం కూడా తోడైంది. కొంతమంది బియ్యం పంపుతుంటే.. మరికొందరు పాత్రలు, ఇతర సామగ్రి సమకూర్చారు. కరోనా సమయంలో ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు, ఆంబులెన్స్‌ డ్రైవర్లకు భూమయ్య అన్నదానం చేశాడు. భూమయ్య అన్నదానానికి కుటుంబసభ్యులు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. నిత్యం తమ ఆకలి తీర్చే ఆటోడ్రైవర్‌కు పేదలు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని