భరత్‌ అనే నేను.. రెస్టారెంట్‌ తెరిచాను! - millet marvels by cardiologist bharath reddy
close
Updated : 08/06/2021 13:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భరత్‌ అనే నేను.. రెస్టారెంట్‌ తెరిచాను!

హైదరాబాద్: వృత్తిరీత్యా వైద్యుడైనా ప్రవృత్తిగా నటనను ఎంచుకొని తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, ఇంకా ఏదో వెలితి. వైద్యం కోసం తన దగ్గరకు వచ్చే వాళ్లలో 25 ఏళ్లు నిండకుండానే మధుమేహం బారిన పడటం ఆయనను ఎంతగానో కలిచివేసింది. ప్రజల ఆరోగ్యం కోసం ఏదైనా చేయాలని తపించారు. మూలాలు వెతికారు. ఏడాదిన్నర పాటు శ్రమించారు. తాతముత్తాతలు తిన్న చిరుధాన్యాలే రేపటి తరానికి రక్షణగా నిలుస్తాయని గ్రహించి వాటితో వివిధ రకాల ఆహారాన్ని తయారు చేసి ప్రజలకు వడ్డిస్తున్నారు. అయనే ప్రముఖ సినీనటుడు, హృద్రోగ వైద్య నిపుణుడు భరత్ రెడ్డి. 

* భరత్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు. స్నేహితుడు, పోలీసు పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వృత్తిరీత్యా ఆయన వైద్యుడు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తూనే కళామతల్లి సేవలో నటుడిగా తనను తాను ఆవిష్కరించుకుంటున్నారు. వైద్యం కోసం తన దగ్గరకు వచ్చే రోగులను పరిశీలించిన ఆయన 100లో 70 మందికి మధుమేహం ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. చిరుధాన్యాలతో తయారు చేసే వంటలను తినమని సలహా ఇచ్చేవారు. కొంత మంది తన సలహాలను పాటిస్తూ ఆరోగ్య వంతులయ్యేవారు. మరికొంత మందికి చిరుధాన్యాలతో ఎలా వంట చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడేవారు. ఈ విషయాన్ని గ్రహించిన భరత్ ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్ సెంటర్’ సహకారంతో హైదరాబాద్‌లో చిరుధాన్యాలతో ఆహారం తయారు చేయాలని సంకల్పించారు.

* సోదరి ప్రోత్సాహంతో ఫిల్మ్ నగర్‌లో ‘మిల్లెట్ మార్వెల్స్’ పేరుతో తొలి కేంద్రాన్ని ప్రారంభించారు. ‘మిల్లెట్ మార్వెల్స్‌’లో కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, కిన్వినా ఇలా ఆరు రకాలతో ఆహారాన్ని తయారు చేస్తున్నారు. అల్పాహారంతో పాటు భోజనం, స్నాక్స్ ఇస్తున్నారు. ప్రతి శుక్ర, ఆదివారాల్లో ధమ్ బిర్యానీ సిద్ధం చేస్తున్నారు. ప్రారంభంలో రుచి నచ్చాకే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునేవారు. అలా నెమ్మది నెమ్మదిగా చాలా మంది భరత్ రెడ్డి చిరు ఆహారానికి అలవాటు పడ్డారు. 

* 2023 ఏడాదిని కేంద్రం చిరు ధాన్యాల ఆహార సంవత్సరంగా ప్రకటించిందని భరత్ అన్నారు. గడిచిన రెండేళ్ల నుంచి వాటి ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. ప్రతీ వ్యక్తి వారానికి ఐదు రోజులు చిరు ధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటే చక్కటి ఆరోగ్యం సొంతమవుతుందని ఆయన చెబుతున్నారు. కరోనాతో ప్రజలంతా రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి రకరకాల ఆహారాన్ని తీసుకుంటున్నారని భరత్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మన ఆహార విధానం కొవిడ్ కంటే 100 రెట్లు భయంకరమైందని ఆందోళన వ్యక్తం చేశారు. తినే పద్ధతి మారితేనే వచ్చే తరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు. 

* ‘మిల్లెట్ మార్వెల్స్’ ద్వారా సుమారు 40 నుంచి 50 మందికి  ఉపాధి కల్పించారు. ఫిల్మ్ నగర్‌తో పాటు మరో నాలుగు చోట్ల శాఖలను తెరిచారు. చిరుధాన్యాలతో చేసిన ఆహారం ఖరీదే అయినా ఆరోగ్యంతో పోల్చుకుంటే చాలా తక్కువని ‘మిల్లెట్ మార్వెల్స్’ సిబ్బంది చెబుతున్నారు. 

* హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ‘మిల్లెట్ మార్వెల్స్‌’ను విస్తరించాలనే ఆలోచనలో భరత్ ఉన్నారు. త్వరలోనే నగర శివారులో ‘మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్’ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా చిరుధాన్యాలతో చేసిన నూడిల్స్‌ను కూడా వినియోగదారులకు రుచి చూపించబోతున్నట్లు ఆయన తెలిపారు. 

‘‘మిల్లెట్స్‌ని ఎప్పుడూ కూడా హోల్‌గ్రెయిన్‌గా కొనుగోలు చేయాలి. సుమారు 10 గంటలు వాటిని నానబెట్టాలి. ప్రొద్దున మళ్లీ దాన్ని శుభ్రం చేయాలి. తర్వాత వాటిని మామూలు రెగ్యూలర్ రైస్‌గా వండాలి. మేము కిచెన్‌లో వండే దాంట్లో ఎక్కడా ప్రాసెస్డ్ ఉప్పు, ఆయిల్ ఉండదు.  చక్కెర కూడా ఉండదు. బెల్లం, బ్రౌన్ చక్కెరను ఉపయోగిస్తాం. రెగ్యులర్ ఆహారంతో పాటు ఉండే బీట్ ఇడ్లీ, బీట్ పూరీ, బీట్ పొంగల్, బీట్ చపాతీ, బీట్ రోటీ, బీట్ ఊతప్పం, బీట్ దోశ ఇలా అన్ని రకాలను అందిస్తున్నాం.

- భరత్ రెడ్డి, సినీ నటుడు, హృద్రోగ వైద్య నిపుణుడు.

నేను ‘మిల్లెట్ మార్వెల్స్’లో ఆరు నెలల కిందట ఉద్యోగంలో చేరాను. ఇక్కడకు వచ్చిన తర్వాత మిల్లెట్స్ ప్రయోజనాలను తెలుసుకున్నాను. నేను, నా కుటుంబం కూడా మిల్లెట్స్ తీసుకోవటం ప్రారంభించాం. గత ఐదు నెలల నుంచి నేను మిల్లెట్స్ తింటున్నాను. దీంతో ఆరు నుంచి ఎనిమిది కిలోల బరువు తగ్గాను.

- భూషణ్‌, ఆపరేషన్ హెడ్. Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని