లాక్‌డౌన్‌, కర్ఫ్యూకి ఆస్కారం లేదు: ఈటల - minister eatala review on coronavirus
close
Updated : 07/04/2021 18:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌, కర్ఫ్యూకి ఆస్కారం లేదు: ఈటల

హైదరాబాద్: నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. అయితే ఎక్కువ మందిలో ఎలాంటి లక్షణాలు లేవని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. గతంలో 85 శాతం మంది బాధితుల్లో లక్షణాలు లేకుండా ఉంటే.. ప్రస్తుతం 95 శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదన్నారు. హైదరాబాద్‌లో ఈటల మీడియాతో మాట్లాడారు. 

గతంలో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేసిన తర్వాత రిపోర్టు రావడానికి చాలా సమయం పట్టేదన్నారు. ప్రస్తుతం గ్రామాల్లోని పీహెచ్‌సీల వరకు ర్యాపిడ్‌ టెస్టులు అందుబాటులో ఉన్నందున ఫలితం వెంటనే తెలిసిపోతుందని చెప్పారు. కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన తర్వాత బాధితులకు లక్షణాలు లేకపోతే వెంటనే కరోనా కిట్‌ ఇచ్చి వారిని హోం ఐసోలేషన్‌కు తరలించడం.. లక్షణాలు ఉన్నట్లయితే ఆస్పత్రులకు పంపించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. రిపోర్టు వెంటనే రావడంతో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ సులభమవుతోందని ఈటల తెలిపారు.

‘‘ప్రపంచం, దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తోంది. అందుకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సమర్థంగా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెస్టులు, వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 50 వేల నుంచి 60 వేల మందికి నిత్యం వ్యాక్సిన్‌ అందిస్తున్నాం. ఈ సంఖ్యను 1.50 లక్షలకు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వ్యాక్సినేషన్‌  ప్రక్రియను కొనసాగిస్తూనే టెస్టుల సంఖ్యను అవసరమైతే లక్ష వరకు తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం. రాష్ట్రంలోని పీహెచ్‌సీల నుంచి రాష్ట్ర స్థాయి ఆస్పత్రుల వరకు రోజువారీ ఓపీ సేవలను కొసాగిస్తూనే కొవిడ్‌ సర్వీసెస్‌ కూడా అందిస్తున్నాం. అంతేకాకుండా వైద్యారోగ్య శాఖ పరిధిలోని సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం.

జిల్లాల వారీగా ప్రభుత్వ ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. కేంద్రాల్లో అన్ని రకాల మందులు, సామగ్రి, సిబ్బందిని అందుబాటులో ఉంచాం. పరిస్థితి విషమంగా ఉన్న బాధితులను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. అలాగే మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న జిల్లాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేశాం. 22 ఆస్పత్రుల్లో పెద్ద మొత్తంలో ఆక్సిజన్‌ సిలిండర్లు, 11వేల ఆక్సిజన్‌ బెడ్లు, ఐసీయూల సంఖ్యను పెంచుకున్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లతో సర్వసన్నద్ధంగా ఉన్నాం. ప్రజలు ఎలాంటి అనుమానాలు లేకుండా నిశ్చింతగా చికిత్స తీసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు కూడా వ్యాపార కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రజలకు ధైర్యం కల్పించి ఆదుకోవాలి’’ అని ఈటల వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల శాతం తక్కువగానే ఉందని ఈటల వెల్లడించారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. సెకండ్‌ వేవ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూలు విధించేలా పరిస్థితులు లేవని ఈటల స్పష్టం చేశారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని