శెభాష్..‌ మిథాలి @ 10,000 - mithali raj becomes the first indian womens cricketer to complete 10k international runs
close
Updated : 12/03/2021 16:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శెభాష్..‌ మిథాలి @ 10,000

తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మహిళా వన్డే జట్టు సారథి మిథాలి రాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో గొప్ప మైలురాయి చేరుకున్నారు. అన్ని ఫార్మాట్లలో కలిపి పదివేల పరుగులు సాధించారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో మిథాలి (36; 50 బంతుల్లో 4x4) పరుగులు చేసి అన్నేబాష్‌ బౌలింగ్‌లో ఔటయ్యారు. ఈ క్రమంలోనే 35 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఆమె అంతర్జాతీయ క్రికెట్‌లో పదివేల పరుగుల మైలురాయి చేరుకున్నారు.

ఈ మ్యాచ్‌కు ముందు టీమ్‌ఇండియా సారథి అన్ని ఫార్మాట్లలో కలిపి 9,965 పరుగులు చేశారు. 1999లో టీమ్‌ఇండియాలోకి అడుగుపెట్టిన మిథాలి సుదీర్ఘకాలంగా భారత క్రికెట్‌లో కొనసాగుతున్నారు. 2002లో టెస్టుల్లో అడుగుపెట్టిన ఆమె 10 మ్యాచ్‌లాడి 663 పరుగులు చేశారు. అందులో ఒక శతకం, నాలుగు అర్ధశతకాలున్నాయి. ఇక వన్డే కెరీర్‌లో 212 మ్యాచ్‌లాడిన మిథాలి 6,974 (ఈ మ్యాచ్‌తో కలిపి) పరుగులు సాధించారు. అందులో ఏడు శతకాలు, 54 అర్ధశతకాలున్నాయి. మరోవైపు పొట్టి క్రికెట్‌లో 89 మ్యాచ్‌లు ఆడగా 2,364 పరుగులు సాధించారు. ఇక్కడ 17 అర్ధశతకాలు సాధించడం విశేషం. ప్రస్తుతం టీ20, టెస్టులకు దూరమైన మిథాలి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. తర్వాతి ప్రపంచకప్‌లో భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టాలని కలలుకంటున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు కొత్త చరిత్ర సృష్టించారు.

ఈ జాబితాలో ఇంగ్లాండ్‌ మాజీ సారథి చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ 10,273 పరుగులతో తొలి స్థానంలో నిలవగా, మిథాలి రాజ్‌ 10,001 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. ఆపై న్యూజిలాండ్‌ క్రికెటర్‌ సుజీ బేట్స్‌(7,849), వెస్టిండీస్‌ బ్యాటర్‌ స్టిఫానీ టేలర్‌(7,816), ఆస్ట్రేలియా క్రికెటర్‌ మెగ్‌ లానింగ్‌ (6,900) పరుగులతో వరుసగా ఉన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని