Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు - morning news at nine am
close
Updated : 21/09/2021 09:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. సమతాస్ఫూర్తి.. ఈ దివ్యమూర్తి

పంచలోహాలతో ప్రతిష్ఠించిన స్వర్ణశోభిత విగ్రహం.. ప్రపంచానికి సమతాస్ఫూర్తిని చాటిన దివ్యమానవ రూపం.. రామానుజాచార్యుల మూర్తి శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ సమీపంలోని శ్రీరామనగరంలో కొలువుదీరింది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల పంచలోహ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ఆవిష్కరించనున్నారు. సమతామూర్తి (స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ)గా పిలిచే ఈ విగ్రహం కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇలాంటి మూర్తుల్లో ఇది ప్రపంచంలోనే రెండో ఎత్తయినది. దాదాపు రూ. 1200 కోట్లతో సమతామూర్తి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. విగ్రహ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. చుట్టూ ఉన్న ఆలయాలు నిర్మాణంలో ఉన్నాయి.

2. ‘ఓటీఎస్‌’ మొత్తాన్నిసచివాలయాల్లోనే చెల్లించొచ్చు

రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్‌ నుంచి రుణం తీసుకొని ఇళ్లు నిర్మించుకున్న పేద వర్గాలకు అమలు చేయనున్న వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకానికి (ఓటీఎస్‌) జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంగా  ఏపీ ప్రభుత్వం పేరు పెట్టింది. ఈ పథకానికి అర్హులైనవారు... ఓటీఎస్‌ కింద నిర్దేశించిన మొత్తాన్ని గ్రామ సచివాలయాల్లోనే చెల్లించే వెసులుబాటు కల్పించనుంది. దీనిపై సీఎం జగన్‌ సంబంధిత మంత్రులు, అధికారులతో సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాన్ని కేంద్రంగా చేసుకొని పథకాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్‌ ఈ నెల 25 నుంచి డేటా అప్‌లోడ్‌ చేస్తుందని, ఆ సమాచారాన్ని సచివాలయాలకు పంపిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

3. సర్కారు వారి తృణధాన్యాహారం

రాగులు, కొర్రలు, సామలు, ఊదలు, సజ్జలు తదితర పోషక తృణధాన్యాల ఆహారోత్పత్తులను నేరుగా విక్రయించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రైవేటు సంస్థలు అధిక ధరలకు అమ్ముతున్నట్లు సర్కారు దృష్టికి రావడంతో వాటికన్నా తక్కువ ధరలకే నాణ్యమైన ఆహారోత్పత్తులను ప్రజలకు చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రాజేంద్రనగర్‌లోని ‘భారత తృణధాన్యాల పరిశోధనా సంస్థ’(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌- ఐఐఎంఆర్‌)లో గల ‘న్యూట్రిహబ్‌’తో రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ’(ఆగ్రోస్‌) తాజాగా ఒప్పందం చేసుకుంది. తృణధాన్యాల పంటలతో పలు రకాల ఆహారోత్పత్తుల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐఎంఆర్‌ అభివృద్ధి చేసింది.

అంపశయ్యపై ఇంజినీరింగ్‌ కళాశాలలు

4. ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేయండి

‘ప్రతిపక్షం వదిలేసిన ఎన్నికల్లో గెలిచామని భుజాలు చరుచుకోవడం ముఖ్యమంత్రి జగన్‌ అవగాహన లోపానికి నిదర్శనం. ఆయనకు నిజంగా ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనే ఆలోచన, ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాల’ని తెదేపా సవాలు విసిరింది. ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఎలా అపహాస్యం చేసిందో దేశమంతా చూసిందని ధ్వజమెత్తింది. తెదేపా వ్యూహ కమిటీ సమావేశం సోమవారం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆన్‌లైన్‌లో జరిగింది. గుజరాత్‌లో పట్టుబడ్డ రూ.72వేల కోట్ల హెరాయిన్‌ అక్రమ రవాణాకు, విజయవాడకు సంబంధమున్నట్టు వస్తున్న వార్తలను బట్టి చూస్తే భవిష్యత్తులో మాదకద్రవ్యాల రవాణాకు ఏపీ కేంద్రంగా మారనుందన్న ఆందోళన కలుగుతోందని సమావేశం పేర్కొంది.

5. అమెరికా ప్రయాణంపై ఆంక్షల సడలింపు

అమెరికాలో పర్యటించనున్న విదేశీయులపై ఆ దేశం ఆంక్షలను సడలించింది. తమ దేశం వచ్చే విమానం ఎక్కడానికి ముందే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ వేయించుకోవాలని షరతు పెట్టింది. దేశంలో అడుగుపెట్టిన తర్వాత అలాంటి వారికి క్వారంటైన్‌ అవసరం ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు... భారత్‌ తదితర దేశాలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తేసింది. ఈ మేరకు కొత్త అంతర్జాతీయ పర్యాటక విధానాన్ని సోమవారం ప్రకటించింది. నవంబరు నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను శ్వేతసౌధం కొవిడ్‌ స్పందన సమన్వయకర్త జెఫ్‌ జియెంట్స్‌ వెల్లడించారు.

6. భారత్‌ బయోటెక్‌కు లిమ్కా బుక్‌ ప్రశంసలు

ముందుండి కరోనాపై పోరాడిన యోధులను, ఆవిష్కర్తలను గౌరవిస్తూ... ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ ప్రత్యేక సంచిక తీసుకొచ్చింది. మానవ ప్రయత్నాలు, నిర్మాణాలతో పాటు... విద్య, రక్షణ, శాస్త్ర-సాంకేతిక, సాహస, వ్యాపార, సినీ, ప్రకృతి ప్రపంచ, సాహిత్య రంగాల్లో భారతీయులు సాధించిన విజయాలను గుదిగుచ్చుతూ రూపొందించిన 2020-22 సంయుక్త ఎడిషన్‌ను సోమవారం ఆవిష్కరించింది. దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌... భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)తో కలిసి కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసిందని ప్రశంసించింది. 

7. లారీతో గుద్దించారు!

ఆడపిల్లలపై అకృత్యాల గురించి విన్నప్పుడు ‘అయ్యో’ అంటాం. మహా అయితే ఇంకో నాలుగు మాటలు మాట్లాడి ఆవేశం చల్లారాక ఆ విషయాన్ని మర్చిపోతాం. కానీ విశాఖపట్నానికి చెందిన మల్లీశ్వరి అలాకాదు.. సమస్యని మూలాల నుంచి పెకిలించే ప్రయత్నం చేస్తున్నారు. అదీ మాటలతో కాదు... చేతలతో! ఈ కృషిలో తనకు ఆటంకం కాకూడదని బ్యాంకు మేనేజర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారామె. ‘న్యూ హోప్‌ ఫౌండేషన్‌’ను స్థాపించి పదేళ్లుగా బాలికలకు అండగా ఉంటున్నారు. విశాఖ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఒంటరి మహిళలు, భిక్షాటన చేసే పిల్లలు, డ్రగ్స్‌కి బానిసలైన వారిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించే వారు. ఇది నచ్చని ఆకతాయిలు ఆమెను అడ్డుకున్నారు. భయపెట్టారు. ఫోన్లు చేసి ‘బతకాలని లేదా’ అంటూ బెదిరించారు. ఇదెక్కడి దాకా వెళ్లిందంటే... 2012లో ఆమె బండి మీద వెళ్తుండగా లారీతో ఢీకొట్టారు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది మల్లీశ్వరి.

8. సుధాకర్‌ పాత్రధారి.. దిల్లీ వ్యక్తే కీలక సూత్రధారి

గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయంలో పట్టుబడ్డ రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ వెనుక పాత్రధారి తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్‌ అయితే.. సూత్రధారి మాత్రం మాదకద్రవ్యాల మాఫియాలో కింగ్‌పిన్‌ అయిన దిల్లీ వాసేనని కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా విజయవాడ చిరునామాతో ఉన్న ఆషీ ట్రేడింగ్‌ కంపెనీకి వస్తున్న ఈ మాదకద్రవ్యాన్ని దిల్లీకి చేర్చాలనేది వారి వ్యూహమని గుర్తించాయి. నిఘా, దర్యాప్తు సంస్థల దృష్టిలో పడకుండా ఉండేందుకు విజయవాడ సత్యనారాయణపురం చిరునామాతో కంపెనీని ప్రారంభింపజేసి దాన్ని చీకటి కార్యకలాపాలకు వినియోగించినట్లు నిర్ధారణకొచ్చాయి.

9. ఆంధ్రా సిమెంట్స్‌పై శ్రీ సిమెంట్‌ ఆసక్తి

రాజస్థాన్‌లోని అజ్మీర్‌ కేంద్రంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యంత క్రియాశీలక సిమెంటు కంపెనీగా ఉన్న శ్రీ సిమెంట్‌, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఉన్న ఆంధ్రా సిమెంట్స్‌ను కొనుగోలు చేయటానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే ఆంధ్రా సిమెంట్స్‌ యూనిట్లను కొనుగోలు చేసేందుకు బిడ్లు దాఖలు చేసినట్లు తెలిసింది. రుణభారం, ఇతర సమస్యలతో ఖాయిలా పడిన ఆంధ్రా సిమెంట్స్‌ యూనిట్లను ఇటీవల ఎడెల్‌వైజ్‌ ఏఆర్‌సీ (అసెట్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ) అమ్మకానికి పెట్టిన విషయం విదితమే. దీనికి అనుగుణంగా ఆసక్తి కల కొనుగోలుదార్ల నుంచి బిడ్లు ఆహ్వానిస్తూ బహిరంగ ప్రకటన జారీ చేశారు.

10. బెంగళూరు విలవిల

భారత్‌లో జరిగిన ఐపీఎల్‌-14 తొలి అంచెలో చక్కటి ప్రదర్శనతో పట్టికలో మూడో స్థానంలో నిలిచిన జట్టు బెంగళూరు.  యూఏఈలో రెండో అంచె ఆరంభం కాబోతుండగా, ఈ సీజన్‌ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో జట్టంతా కసిగా ఆడి ట్రోఫీతో అతడికి వీడ్కోలు పలుకుతుందని ఆశించారు. కానీ తొలి మ్యాచ్‌లో జరిగింది వేరు. బ్యాటుతో, బంతితో ఘోరంగా విఫలమై పాత జట్టును గుర్తు చేసింది ఆర్‌సీబీ. కోల్‌కతా చేతిలో ఆ జట్టు చిత్తుగా ఓడింది.

విశాఖలో టీ20.. హైదరాబాద్‌కు నిరాశేమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని