Aditya 369: టైమ్‌ మెషీన్‌ తెచ్చిన కబుర్లివే! - nandamuri balakrishna about 30 years of aditya 369 movie
close
Updated : 18/07/2021 11:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Aditya 369: టైమ్‌ మెషీన్‌ తెచ్చిన కబుర్లివే!

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్‌ మూవీ ‘ఆదిత్య 369’. ఈ సినిమా విడుదలై జులై 18వ తేదీకి 30ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఒక స్పెషల్‌ వీడియోను విడుదల చేసింది. టైమ్‌ మెషీన్‌ మాట్లాడుతూ ఈ చిత్రానికి మూల స్తంభాలైన సింగీతం శ్రీనివాసరావు, బాలకృష్ణ, శివలెంక కృష్ణ ప్రసాద్‌, పేకేటి రంగా, తరుణ్‌ల మనోగతాన్ని మన ముందుకు తీసుకొచ్చింది.

‘‘ఆదిత్య 369’ క్రియేట్‌ చేసింది మాత్రం నేనే. అయితే, టైమ్‌ మెషీన్‌ సృష్టికర్తను నేను కాదు. హెచ్‌జీ వెల్స్‌ అనే మహానుభావుడు దాన్ని నవలగా రాశాడు. నేను చదువుకునే రోజుల్లో ఆ పుస్తకం నాపై ప్రభావాన్ని చూపింది. దర్శకుడు అయిన తర్వాత ఎప్పటికైనా ఈ కథా నేపథ్యంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఓ సినిమా తీయాలని అనుకున్నా. అనుకోకుండా నేను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారిని ఒక విమాన ప్రయాణంలో కలిశా. మా మధ్య సినిమాల గురించి చర్చ వచ్చి, ఈ కథను ఆయనకు చెప్పా. ఆయనకు నచ్చడంతో నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌కు చెప్పమన్నారు. అయితే, చర్చలో భాగంగా ఒక షరతు పెట్టారు. ‘శ్రీకృష్ణదేవరాయలు పాత్ర నందమూరి బాలకృష్ణ చేస్తేనే.. లేకపోతే ఈ సినిమా లేదు’ అన్నారు. అలా ఈ కథను బాలయ్యకు వినిపించడం, ఆయన కూడా ఓకే చెప్పడంతో సినిమా పట్టాలెక్కింది. ఇక సినిమాకు సీక్వెల్‌ అంటారా? అది కూడా చేసేద్దాం’’ అని దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘ఆదిత్య 369’తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఆదిత్య 369 విడుదలై 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలు. ఎన్నిసార్లు చూసినా అదొక అద్భుతం. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎప్పుడు ప్రసారమైనా ఆ సినిమాను చూస్తూనే ఉంటారు. చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. కానీ, ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన కొన్ని చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఈ సినిమా కార్యరూపం దాల్చడంలో ప్రధాన పాత్ర అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంది. ఇలాంటి సినిమాలు తీయాలంటే దర్శకుడికి ధైర్యం, నిర్మాతకు ప్యాషన్‌ ఉండాలి. హీరోకు రెండూ ఉండాలి. ఈ సినిమాకు గుండెకాయ శ్రీకృష్ణదేవరాయలు పాత్ర. ప్రతి విషయంలోనూ ఆచితూచి సినిమాను తెరకెక్కించారు. ఇలాంటి సినిమా చేయడం నా పూర్వ జన్మ సుకృతం. ఇక ముందు ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయాలన్న నిర్ణయానికి వచ్చాం’’ అని అన్నారు. ఇలా ఈ అపురూప చిత్రంతో తమకున్న అనుబంధాన్ని ఎవరెలా పంచుకున్నారో మీరే చూసేయండి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని