MAA Elections: ప్రకాశ్‌రాజ్‌, నాగబాబులకు నరేశ్‌ కౌంటర్‌.. విష్ణుకు ఆ అవసరం లేదు! - naresh speech at manchu vishnu panel oath taking ceremony
close
Updated : 16/10/2021 17:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: ప్రకాశ్‌రాజ్‌, నాగబాబులకు నరేశ్‌ కౌంటర్‌.. విష్ణుకు ఆ అవసరం లేదు!

హైదరాబాద్‌: మంచు విష్ణు కమిటీ సభ్యులు తమ పని గురించి ఎవరికీ రిపోర్ట్‌ చేయాల్సిన అవసరం లేదని సినీ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్‌ అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించిన మంచు విష్ణుతో సహా ఆయన ప్యానెల్‌ సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.  ‘మా’ బయట ఉండి తాము విష్ణు చేసే పనులకు మద్దతు ఇస్తూనే, ప్రతి నెలా రిపోర్ట్‌ కార్డు అడుగుతామని గతంలో ప్రకాశ్‌రాజ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ‘మా’ మసకబారిందని నాగబాబు చేసిన వ్యాఖ్యలకూ నరేశ్‌ ఈ సందర్భంగా కౌంటర్‌ ఇచ్చారు.

‘‘పోటీలో గెలిచిన వాళ్లందరికీ శుభాకాంక్షలు. ‘మంచు కమిటీ.. మంచి కమిటి’. ఎందుకంటే ఈ కమిటీలో అనుభవం కలిగిన వాళ్లు, యువత, మహిళలు ఉన్నారు. అవకాశాల కోసం పోరాడతామని చెప్పారు. మంచి మేనిఫెస్టోతో వచ్చారు. అదే మన పనికి అద్దం పడుతుంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌గారు చొరవ తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసే ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇప్పటివరకూ అయిపోయిందేదో అయిపోయింది. భవిష్యత్‌ కోసం పనిచేద్దాం. ‘మా’ మెరుగు పడాలని ఆరేళ్లు పోరాటం చేశా. ‘మా’ సభ్యులకు అన్ని రకాలుగా సహాయం చేశా. ‘మా’ ఏ ఒక్కరి సొత్తు కాదు. ‘మా’ చిన్నదా? పెద్దదా అనేది కూడా విషయం కాదు. ఎందుకంటే కోహినూరు వజ్రం చిన్నదే. కానీ, అది వజ్రమే. ఈ కమిటీ కచ్చితంగా అద్భుతాలను సాధిస్తుందని నమ్ముతున్నా. ‘మా’ మెరుగు పడింది. మరింత ముందుకు తీసుకెళ్తాం. ఈ క్షణం నుంచి ‘మంచి మాత్రమే మైకులో మాట్లాడదాం. చెడు చెవిలో చెప్పుకుందాం’’

‘‘మా’ పదవులు భుజకీర్తులు కావు. ‘మా’ బాధ్యత. ఒక సభ్యుడిగా ‘మా’ని అంటిపెట్టుకుని ఉంటా. అధ్యక్షుడంటే అందరి మన్ననలు పొందాలి. విష్ణు 106 ఓట్ల మెజార్టీతో గతంలో నేను సాధించిన మెజార్టీ కన్నా ఎక్కువ సంపాదించాడు. దానర్థం సభ్యులకు విష్ణుపైనా, ఆయన వెనకున్న వారిపైనా(మోహన్‌బాబును చూపిస్తూ..) ఉన్న నమ్మకం. ఇందులో ఏమాత్రం రాజకీయం లేదు. ఈ కమిటీ అవకాశాలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. ఎవరికీ రిపోర్ట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. వెబ్‌సైట్‌లో ఉంటుంది. చూసుకోవచ్చు. మహిళలు, యువత కోసం విష్ణు కమిటీ పనిచేస్తుంది. హెల్ప్‌లైన్‌ కూడా నిరంతరం పనిచేస్తుంది. ఏమైనా ఫిర్యాదులు తప్పకుండా పరిష్కరిస్తాం. ఎటువంటి సమస్య ఉన్నా, మీరు నాకు ఫోన్‌ చేయొచ్చు. విష్ణుకు, ‘మా’కు అన్నయ్య ఉంటా. వేగంగా పని జరగాలనే ఉద్దేశంతోనే మొన్న విష్ణుకు బాధ్యతలు అప్పగించి, ఈరోజు ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశాం. విష్ణు బాధ్యతలు స్వీకరించిన రోజున నేను కన్నీళ్లతో బయటకు వస్తుంటే, ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. అవి ఆనందబాష్పాలు. ఆరేళ్ల పనికి ఒక మంచి భవిష్యత్‌ కనపడిందని సంతోషపడ్డా. పదవుల కోసం నేనెప్పుడూ ఉండను. బాధ్యతల కోసం ఉంటాను. అందరికీ నేను న్యాయం చేయలేకపోవచ్చు. నా తుది శ్వాస వరకూ ‘మా’కోసం పనిచేస్తా’’ అని నరేశ్‌ అన్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని