Natyam: ‘నాట్యం’ కోసం ఆ పుస్తకాన్ని చదివా - natyam movie director revanth korukonda interview
close
Updated : 19/10/2021 06:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Natyam: ‘నాట్యం’ కోసం ఆ పుస్తకాన్ని చదివా

‘‘తెలుగుదనం ఉట్టి పడేలా... భారతీయ సంస్కృతిని చాటిచెప్పేలా  సినిమాలు తీయడమే నా కల. ఆ ప్రయాణంలోనే ఉన్నా’’ అంటున్నారు యువ దర్శకుడు రేవంత్‌ కోరుకొండ. లఘు చిత్రాల మీదుగా సినీ పరిశ్రమకి వచ్చిన ప్రతిభావంతుడు... రేవంత్‌. తొలి ప్రయత్నంలోనే ‘నాట్యం’ నేపథ్యంలో అదే పేరుతో సినిమా చేశారు. ప్రముఖ నర్తకి సంధ్యారాజు నటించడంతోపాటు స్వయంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రేవంత్‌ కోరుకొండ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘మన పురాణాల్లో ఎన్నో మంచి కథలు ఉన్నాయి. అలాంటి ఓ కథని చెప్పడంలో భాగమే ‘నాట్యం’. నాట్యం అంటే కథని అందంగా చెప్పడం. ఈ చిత్రం కోసం ‘నాట్యశాస్త్రం’ పుస్తకాన్ని చదివా. అందులో ఇది తప్పు అని మనిషికి చెబితే వినడు, కథతో చెబితేనే వింటాడని బ్రహ్మ అనుకుంటాడు. అలా ఓ కథని నాట్యం ద్వారానే చెబుతాడు. అందుకే నాట్యం అంటే అభినయం అంటారు. మొదట ఒక మంచి తెలుగు సినిమా చేయాలనుకున్నాం. అలా అనుకున్నప్పుడు మనకు గుర్తుకొచ్చేది అగ్ర దర్శకుడు కె.విశ్వనాథ్‌. ఆయన కళల నేపథ్యంలో సినిమాలు తీసినట్టుగానే, నేను కూడా క్లాసికల్‌ డ్యాన్స్‌ నేపథ్యంలో సినిమాని తీశా’’

* ‘‘ఒక ఊరు, అందులో గొడవలు, నాట్యం, ఇతర కొన్ని పాత్రల్ని అల్లి ఈ కథని రాశా. మాది అనకాపల్లి. అమెరికాలో చదువుకున్నా. సినిమాలంటే ఇష్టం. నాకు కథలు రాయడం అంటే ఇష్టం. విఠలాచార్య సినిమాలంటే ఎంతో ఇష్టం. ఒక ఊర్లోమూఢనమ్మకాలపై ప్రజలకున్న విశ్వాసాన్ని మార్చాలని ఓ గురువు నిర్ణయిస్తాడు. అందుకోసం ఓ పాపకి కథని చెబుతాడు. కానీ ఆ కథ చెప్పడం మధ్యలోనే ఆగిపోతుంది. మరి ఆ అమ్మాయి ఆ కథని పూర్తి చేసిందా? ఇంతకీ ఆమెకీ, ఆ కథకీ ఉన్న సంబంధం ఏమిటి? ఊరి జనాలు మారారా? తదితర విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. తొమ్మిది నెలలు కథపైనే దృష్టిపెట్టా. ఇందులో కాస్ట్యూమ్స్‌ కోసం ప్రత్యేకంగా పరిశోధన చేసి, లొకేషన్ల కోసం మూడు నెలలు తిరిగా. దర్శకత్వంతోపాటు కెమెరా, ఎడిటింగ్‌ బాధ్యతల్ని నేనే చూసుకున్నా. ఈ మూడూ నేనే చేయడంతో నేను అనుకున్నట్టుగా సినిమా చాలా బాగా వచ్చింది’’.

* ‘‘ప్రధాన పాత్రధారి సంధ్యారాజు లేకపోతే ఈ చిత్రం ఇంత బాగా వచ్చి ఉండేది కాదు. ఆమె కేవలం నటిగా, నిర్మాతగానే కాదు, ఓ సాంకేతిక నిపుణురాలిగా నాతో కలిసి పనిచేశారు. ఆమెతో ఇదివరకు ఓ లఘు చిత్రం చేశా. అక్కడ నా పనితీరు నచ్చి, ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. నా తొలి సినిమా తీస్తే నృత్యం నేపథ్యంలోనే తీయాలనుకున్నా. సంధ్యారాజుకి కూడా నృత్యం అంటే ప్రాణం. అలా మా ఇద్దరి అభిరుచులు కలవడంతో ఈ సినిమా మొదలైంది. రామ్‌చరణ్‌ సినిమా చూసి ఎంతగానో ప్రోత్సహించారు. నా తదుపరి సినిమా అచ్చమైన తెలుగు చిత్రమే’’.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని