దక్షిణాది నిర్మాతపై క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యాఖ్యలు - neena gupta shares her casting couch experience
close
Published : 19/06/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దక్షిణాది నిర్మాతపై క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యాఖ్యలు

వెల్లడించిన బీ టౌన్‌ నటి నీనాగుప్తా

ముంబయి: దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన ఓ నిర్మాత వల్ల తాను ఒకానొక సమయంలో ఇబ్బందిపడ్డానని ప్రముఖ బాలీవుడ్‌ నటి నీనాగుప్తా తెలిపారు. 62 ఏళ్ల నీనా 1982 నుంచి నటిగా, దర్శకురాలిగా ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుంటున్నారు. తాజాగా ఆమె ‘సచ్‌ కహో తా: మేరీ ఆత్మకథ’ అనే పేరుతో తన ఆటోబయోగ్రఫీని రాసుకున్నారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ పుస్తకంలో తన జీవితానికి సంబంధించిన ఎన్నో షాకింగ్‌ విషయాలను నీనా బయటపెట్టారు.

కాగా, క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి స్పందిస్తూ ఆమె ఈ విధంగా రాసుకొచ్చారు. ‘‘నేను నటిగా వెండితెరకు పరిచయమైన కొత్తలో ఆఫర్‌ విషయమై దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన పేరు పొందిన నిర్మాతను కలవాల్సి వచ్చింది. ముంబయిలోని పృథ్వీ థియేటర్‌ పక్కనే ఉన్న ఓ హోటల్‌లో ఆయన బస చేయడంతో.. పాత్ర గురించి వివరిస్తానంటూ నాకు కాల్‌ చేశారు. సరేనని.. ఆ హోటల్‌కు చేరుకుని రిసెప్షన్‌ నుంచి ఆయనకు ఫోన్‌ చేశాను. ఆయన వెంటనే రూమ్‌కి రమ్మన్నారు. దాంతో నేను కొంత సమయం ఆలోచనలో పడ్డాను. ఎందుకంటే సినిమా ఆఫర్‌ ఇస్తానంటూ ఎవరైనా మన వద్దకు వచ్చినా.. లేక మనం ఎవరి వద్దకైనా వెళ్లినా అందరికీ కనిపించేలా బయట మాత్రమే కూర్చోవాలని, రూమ్స్‌కి మాత్రం వెళ్లకూడదని మొదట్లోనే నిర్ణయించుకున్నాను. కానీ మంచి సినిమాలో ఆఫర్‌ పోతుందేమోనని భావించి చివరికి హోటల్‌లో ఆయన ఉంటున్న గదికి వెళ్లాను.

ఆయన తన గురించి గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించారు. తాను ఎంతోమంది హీరోయిన్స్‌కి కెరీర్‌ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. వెంటనే నేను.. ‘సర్‌.. ఇంతకీ మీ సినిమాలో ఎలాంటి పాత్ర ఇస్తున్నారు?’ అని ప్రశ్నించాను. దానికి ఆయన హీరోయిన్ ఫ్రెండ్‌ రోల్‌ అన్నారు. ఆయన వివరించిన దానిని బట్టి.. సినిమాలో ఆ పాత్రకు అంత ప్రాముఖ్యం లేదనిపించింది. దాంతో అక్కడి నుంచి బయలు దేరాలని సిద్ధమయ్యాను. ‘ఇక నేను బయలుదేరతాను సర్‌’ అని చెప్పగానే.. ‘ఏంటి.. నువ్వప్పుడే వెళ్లిపోతున్నావా?ఈ రాత్రికి ఇక్కడే ఉంటావని భావించాను’ అని అన్నాడు. ఆ మాటతో నేను షాక్‌ తిన్నాను. భయం వేసింది. కంగారుగా అనిపించింది. దీంతో ఆయన నా హ్యాండ్‌బ్యాగ్‌ చేతికందించి.. ‘బలవంతం ఏమీ లేదు. నీకిష్టమైతే ఉండు. లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని అన్నాడు. అలా, నేను అక్కడి నుంచి బయటపడ్డాను’’ అని నీనా తన ఆత్మకథలో రాసుకొచ్చారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని