దక్షిణాదిన కొత్త కరోనా ‘ఎన్‌440కె’ - new corona varient n440k in south
close
Published : 20/02/2021 10:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దక్షిణాదిన కొత్త కరోనా ‘ఎన్‌440కె’

సీసీఎంబీ అధ్యయనంలో గుర్తింపు

హైదరాబాద్‌: దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్‌440కె అనే కొత్త రకం కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తిలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అది ప్రమాదకరమో కాదో స్పష్టత లేకున్నా, వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. దేశంలో తొలి కరోనా కేసు నమోదై ఏడాది దాటింది. ఈ క్రమంలో వైరస్‌ జన్యుక్రమ విశ్లేషణ ద్వారా వ్యాప్తిలో ఉన్న రకాలపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. సీసీఎంబీ సహా వేర్వేరు సంస్థలు చేపట్టిన కొవిడ్‌ వైరస్‌ 6400 జన్యుక్రమ విశ్లేషణలో 5వేల ఉత్పరివర్తనాలు గుర్తించారు. ప్రధానంగా కొన్ని రకాలే ఎక్కువ వ్యాప్తిలో ఉన్నట్లు తేల్చారు. ఏ3ఐ జూన్‌ 2020 వరకు వ్యాప్తిలో ఉండగా.. తర్వాత ఏ2ఏ విస్తరించింది. ఇందులోని డీ614జీ ఉత్పరివర్తనంతో ఎక్కువ విస్తరణకు కారణమైంది. ప్రపంచవ్యాప్తంగానూ ఇదే ఎక్కువగా కన్పించింది. ఇటీవల చాలా దేశాల్లో కొత్తరకం కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో ఉత్పరివర్తనాలతో కొత్త రకం వ్యాప్తిలోకి వచ్చింది. మానవ శరీర కణాలకు అతుక్కుపోయే గుణంతో అధిక ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతున్నట్లు తేలింది. 
భారత్‌లో ఉనికి తక్కువే..
యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో వేగంగా విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్న కొత్త వైరస్‌ మన దేశంలోనూ వ్యాప్తిలో ఉందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తెలిపారు. రోగనిరోధక వ్యవస్థను తప్పించుకుని వ్యాప్తికి కారణమవుతున్న ఈ484కె, అధిక వ్యాప్తికి కారణమవుతున్న ఎన్‌501వై ఉత్పరివర్తనాలు వీటిలో ఉన్నాయి. భారత్‌లో వీటి ఉనికి ప్రస్తుతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పాజిటివ్‌ల నుంచి సేకరించిన వైరస్‌ నమూనాలను తక్కువగా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తుండటం ఇందుకు కారణం కావొచ్చని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌మిశ్రా అన్నారు. సాధ్యమైనంత ఎక్కువగా జన్యుక్రమాలను కనుక్కొంటే కొత్త రకం వైరస్‌ పుట్టుక, వ్యాప్తి గురించి కచ్చిత సమాచారం తెలుస్తుందన్నారు. తద్వారా రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటున్న, రోగ లక్షణాలను బట్టి, ఎక్కువ విస్తరణకు కారణమవుతున్న కొత్త రకాలను సకాలంలో గుర్తించి నివారించడానికి వీలవుతుందన్నారు. వైరస్‌ ఉత్పరివర్తనాలను పర్యవేక్షించే దిశగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరాన్ని తాజా అధ్యయనం సూచిస్తోందని పరిశోధకులు దివ్యతేజ్‌ అన్నారు. వ్యాప్తిని అడ్డుకోవడం ద్వారా ఉత్పరివర్తనాలతో హానికరమైన కొత్తరకం వైరస్‌ పుట్టకుండా అడ్డుకోవచ్చని ముఖ్య పరిశోధకులు డాక్టర్‌ సురభి శ్రీవాస్తవ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని