18 రాష్ట్రాల్లో ‘కొత్తరకం’ కరోనా! - new variant found in 18 states
close
Published : 24/03/2021 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

18 రాష్ట్రాల్లో ‘కొత్తరకం’ కరోనా!

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఆందోళన కొనసాగుతున్న వేళ.. కొత్తరకం స్ట్రెయిన్‌లు కలవరపెడుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 18 రాష్ట్రాల్లో కొత్తరకం స్ట్రెయిన్‌లను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో విదేశాల్లో బయటపడిన కొత్తరకాలే కాకుండా మరిన్ని స్ట్రెయిన్‌లు ఉన్నట్లు పేర్కొంది. అయితే, పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ విజృంభణకు ఈ కొత్తరకం స్ట్రెయిన్‌లే కారణమని చెప్పే సమాచారం మాత్రం వెల్లడికాలేదని తెలిపింది.

విదేశాలనుంచి భారత్‌ వస్తోన్న ప్రయాణికుల్లో పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇలా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 10,787 పాజిటివ్‌ శాంపిళ్లను కేంద్ర ఆరోగ్యశాఖ ఏర్పాటుచేసిన INSACOG విభాగం విశ్లేషించింది. వీటిలో 736 శాంపిళ్లలో బ్రిటన్‌ రకం(B.1.1.7), 34 శాంపిళ్లలో దక్షిణ ఆఫ్రికా(B.1.351) రకం, బ్రెజిల్‌కు చెందిన(P.1) రకాన్ని ఒక నమూనాలో గుర్తించినట్లు INSACOG పరిశోధనలో వెల్లడైంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఈ కొత్తరకాలు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. గత డిసెంబర్‌ నెలలో మహారాష్ట్రలో విశ్లేషించిన నమూనాలతో పోల్చి చూస్తే, E484Q, L452R మ్యుటేషన్ల నమూనాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు కేంద్రం తెలిపింది. గతంలో గుర్తించిన మ్యుటేషన్‌ రకాలతో ఇవి సరిపోలడం లేవని.. రోగనిరోధకతను తట్టుకొని వైరస్‌ తీవ్రత పెరుగుదలకు ఇలాంటి మ్యుటేషన్లు కారణమవుతాయని కేంద్రం అభిప్రాయపడింది.

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో వైరస్‌ తీరుతెన్నులను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు పది జాతీయ పరిశోధనా కేంద్రాలతో కూడిన ‘ది ఇండియన్‌ సార్స్-కోవ్‌-2 కన్సార్టియం ఆన్‌ జినోమిక్స్‌(INSACOG)’ ను కేంద్ర ఆరోగ్యశాఖ గతేడాది ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా, దేశంలో వ్యాపిస్తోన్న కొవిడ్‌-19 వైరస్‌లను విశ్లేషిస్తోన్న INSACOG, వాటి జినోమ్‌‌ సీక్వెన్సింగ్‌ను చేపడుతోంది.

ఇదిలాఉంటే, మార్చి 18 నాటికి దేశంలో 400గా ఉన్న ఈ కొత్త రకం కేసులు.. గడిచిన ఐదు రోజుల వ్యవధిలోనే సుమారు రెట్టింపయ్యాయి. ఒకవైపు దేశంలో కరోనా రెండోదఫా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ కొత్త రకాలు మరింత వ్యాప్తిచెందడం ఆందోళనకర విషయమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త రకాలకు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండడంతో ప్రజలు కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని