Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు - night news at nine pm
close
Published : 16/09/2021 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. తెలంగాణపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి: ఎన్జీటీలో ఏపీ వాదన

ఏపీ సర్కార్‌ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలపై  ఎన్జీటీ చెన్నై బెంచ్‌ ముందు గురువారం సుదీర్ఘ విచారణ జరిగింది. ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందా అనే అంశంపై వాదనలు జరిగాయి. కోర్టు ఉల్లంఘనలపై ఎన్జీటీకి ఉన్న అధికారాలపై ఏపీ వాదనలు ముగిశాయి. ప్రజోపయోగ పనులు చేపట్టినందుకు జైలుకు పంపుతారా అని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు చేసినవి డీపీఆర్‌, ఇతర పనుల కోసమేనని ఏపీ తెలిపింది.  ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించేలా తెలంగాణ ప్రభుత్వం ఫొటోలు ఇచ్చిందని తెలిపింది. తప్పుడు ఫొటోలు పంపిన తెలంగాణపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరింది.

2. అమిత్ షా అపాయింట్‌మెంట్‌ ఇస్తే.. ఆధారాలతో ఫిర్యాదు చేస్తా: రేవంత్‌రెడ్డి

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేశారు. తనతోపాటు ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ.. మొత్తం పది మందికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని రేవంత్ కోరారు. సీఎం కేసీఆర్‌ అవినీతికి పాల్పడుతున్నట్లు పూర్తి ఆధారాలతో ఇప్పటికే కేంద్రానికి నివేదించినా ప్రయోజనం లేదని ఆక్షేపించారు. ఈ నెల 17న అమిత్‌ షా తెలంగాణకు రానున్న విషయం తెలిసిందే. 

3. జగన్‌ అక్రమాస్తుల కేసు: వెంకట్రామిరెడ్డి, రాజగోపాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. రాంకీ కేసులో విచారణకు హాజరుకాని విశ్రాంత ఐఏఎస్‌లు జి.వెంకట్రామిరెడ్డి, రాజగోపాల్‌పై న్యాయస్థానం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వాన్‌పిక్‌, దాల్మియా, జగతి పబ్లికేషన్స్‌, రాంకీ కేసుల విచారణ ఈనెల 28కి వాయిదా పడింది. రాంకీ ఈడీ కేసు నుంచి తొలగించాలని కోరుతూ సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి డిశ్ఛార్జి పిటిషన్లు దాఖలు చేశారు. రాంకీ ఈడీ కేసు విచారణ ఈనెల 30కి వాయిదా పడింది. జగతి పబ్లికేషన్స్‌పై ఎన్‌పోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు విచారణ జరిగింది.

4. మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లకు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం

మద్యం దుకాణాల్లో వివిధ వర్గాలకు రిజర్వేషన్లకు అవకాశం కల్పిస్తూ తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం రిజర్వేషన్ల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు గౌడ కులస్థులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.

5. పోలీసులు చేయలేని న్యాయం దేవుడు చేశాడు.: షర్మిల

సైదాబాద్‌ హత్యాచార ఘటనలో ఏడు రోజులైనా బాధిత కుటుంబాన్ని  ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ... ‘‘మా ఒత్తిడి వల్లే మంత్రుల్లో కదలిక వచ్చింది. వారి ఇంటికి వెళ్లి పరిహారం ఇవ్వడంతో పాటు, కేసు కొలిక్కి వచ్చేలా చేసింది. శాంతి యుతంగా  దీక్ష చేస్తుంటే రాత్రి 2గంటల సమయంలో దాదాపు 200 మంది పోలీసులు మాపై దాడికి దిగి అరెస్టు చేసి గృహనిర్బంధం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తెలంగాణలో లేదా? ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా?’ అని ప్రశ్నించారు. 

6. అటవీ సిబ్బందిపై పెట్రోల్‌ పోసిన పోడు సాగుదారులు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పోడు భూముల స్వాధీనానికి వెళ్లిన ఆజంనగర్‌ అటవీశాఖ రేంజి అధికారి దివ్య, సిబ్బందిపై పోడు సాగుదారులు పెట్రోల్‌ పోసి దాడి చేసిన ఘటన కలకలం రేపింది.  పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు గురువారం సాయంత్రం అటవీ అధికారులు పందిపంపుల గ్రామానికి వెళ్లారు. తమ భూముల్లో మొక్కలు నాటొద్దని నిరసన చేపట్టిన  పోడు సాగుదారులు ఒక్కసారిగా దాడికి దిగారు. పెట్రోల్‌ పోసి దాడికి పాల్పడ్డారు. గతంలోనూ అధికారులు పోడు భూముల్లో నాటిన మొక్కలను సాగుదారులు తొలగించారు. 

7. టీ-20 కెప్టెన్సీపై  విరాట్‌ కోహ్లి కీలక నిర్ణయం

టీ20 జట్టు కెప్టెన్‌గా టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి తప్పుకోనున్నారు. టీ20 ప్రపంచ కప్‌ తర్వాత ఈ ఫార్మాట్‌ నుంచి వైదొలగనున్నట్లు తెలిపారు. ‘‘ఐదారేళ్లుగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నా. 8-9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడుతున్నా. పని ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసున్నా’’ అని కోహ్లి ట్విటర్‌ వేదికగా   వెల్లడించారు. టెస్టు, వన్డే జట్లకు కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగనున్నారు. టీ20 జట్టులో బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతానని కోహ్లి స్పష్టం చేశారు. గంగూలీ, రవిశాస్త్రి, రోహిత్‌శర్మలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని విరాట్‌ వివరించారు.

8. రాబోయే 3 నెలలు జాగ్రత్తగా ఉండండి: కేంద్రం హెచ్చరిక

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, కేరళలో కూడా కేసులు తగ్గుదల కనబడుతోందని కేంద్రం వెల్లడించింది. అయితే, రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. రాబోయే మూడు నెలలూ పండుగల సమయం, అలాగే, ఫ్లూ కేసులు పెరిగే కాలం గనుక ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌ కోరారు. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు కరోనా కట్టడిలో సాధించిన ఫలితాలను మరింత మెరుగుపరుచుకుందామన్నారు.

9. బాలుడిపై లైంగిక దాడి.. ఆయాకు 20 ఏళ్ల జైలుశిక్ష

ఓ మహిళకు బాలమిత్ర కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లో వెళితే...చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ పాఠశాలలో చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడిని పాఠశాల ఆయా జ్యోతి లైంగికంగా వేధించింది. బాలుడి మర్మావయవాలను పట్టుకొని ఇబ్బంది పెట్టింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో బాలుడి తండ్రి 2017 డిసెంబరులో చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానంలో సాక్ష్యాధారాలు సమర్పించారు. 

10. బ్యాడ్‌ బ్యాంక్‌కు ప్రభుత్వ హామీ.. రుణ వసూళ్లు పెరిగాయన్న నిర్మలా సీతారామన్‌

బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారానికి సంబంధించి బ్యాడ్‌బ్యాంక్‌ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. ఇందుకోసం ఏర్పాటు చేయబోతున్న జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ (NARCL) లేదా బ్యాండ్‌ బ్యాంక్‌ జారీ చేసే సెక్యూరిటీ రసీదులకు ప్రభుత్వం హామీ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం వెల్లడించారు. మొత్తం రూ.30,600 కోట్ల విలువైన రశీదులకు ప్రభుత్వ హామీ ఇస్తుందని తెలిపారు. రికగ్నేషన్‌, రిజల్యూషన్‌, రీక్యాపిటలైజేషన్‌, రిఫార్మ్స్‌ వల్ల గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో రూ.5,01,479 కోట్ల మేర రుణాలు వసూలయ్యాయని పేర్కొన్నారు. 2018 మార్చి తర్వాత రూ.3.1 లక్షల కోట్లు రుణాలు రికవరీ అయినట్లు తెలిపారు.

భారత్‌లో టీవీఎస్‌ రైడర్‌ 125 విడుదలమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని