90ఏళ్ల తాత.. కరోనాను రెండుసార్లు జయించి   - ninty-year-old from maharashtras beed defeats covid-19 twice
close
Published : 23/04/2021 17:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

90ఏళ్ల తాత.. కరోనాను రెండుసార్లు జయించి 

ఔరంగాబాద్‌: యావత్ దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఆటలు ఈ తాతగారి ముందు సాగలేదు. ఆయన సంకల్పం, మనోధైర్యానికి కొవిడ్‌ కూడా తోకముడుచుకుని పారిపోయింది. అది కూడా రెండుసార్లు. రెట్టింపు వేగంతో బుసలుకొడుతున్న కరోనాకు ఆరోగ్యంగా ఉన్న యువతే గడగడలాడుతుంటే.. మహారాష్ట్రలో ఓ 90ఏళ్ల వృద్ధుడు రెండు సార్లు వైరస్‌ను జయించాడు. 

బీద్‌ జిల్లాలోని అదాస్‌ ప్రాంతానికి చెందిన 90ఏళ్ల  పాండురంగ ఆత్మారామ్‌ అగ్లావే గతేడాది నవంబరులో తొలిసారి కరోనా బారినపడ్డారు. 10 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత కోలుకుని ఇంటికి వెళ్లారు. అయితే ఏప్రిల్‌ తొలివారంలో పాండురంగకు మరోసారి కొవిడ్‌ సోకింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఐదు రోజుల తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో స్వామి రామానంద్‌ తీర్థ్ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం వైరస్‌ నుంచి కోలుకుని ఏప్రిల్‌ 17న డిశ్చార్జ్‌ అయ్యారు.

తొలిసారి కంటే రెండోసారి కోలుకోవడం కాస్త కష్టంగానే అన్పించిందని పాండురంగ చెప్పారు. అయినప్పటికీ ధైర్యాన్ని వీడకపోవడంతో క్షేమంగా బయటపడగలిగానని తెలిపారు. ‘‘ఈ కాలంలో యువత అనేక దురలవాట్లకు బానిసవుతున్నారు. వ్యాయామాలు చేయట్లేదు. ఇక చిన్నచిన్న విషయాలకే ఒత్తిడికి గురవుతున్నారు. కానీ నా వరకు నేను రోజూ వాకింగ్‌కు వెళ్తా. ఆసుపత్రిలో ఉన్నప్పుడు నా పక్కన చాలా మంది రోగులు చనిపోతున్నా కూడా నేను ఆందోళన చెందలేదు. ఆక్సిజన్‌ తీసుకుంటూ ప్రశాంతంగా గడిపా. ఆరోగ్యం, ఆహారంపై దృష్టిపెట్టా. అందుకే కోలుకోగలిగా’’ చెబుతున్నారు. 

రెండో దశలో ఎంతో మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్‌ సోకిన తర్వాత వారిలో పెరుగుతున్న ఆందోళనే మరింత ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారందరికీ పాండురంగ ఓ ఆదర్శంగా మారాలి..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని