అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా - nivetha thomos interview
close
Updated : 12/04/2021 08:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా

‘వకీల్‌ సాబ్‌’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’ అన్నారు నాయిక నివేదా థామస్‌. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా శ్రీరామ్‌ వేణు తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవలే విడుదలై విజయవంతంగా ముందుకెళ్తోంది. ఈ సందర్భంగా తన మనసులో మాట తెలియజేసింది నివేదా. ఆ ఆసక్తికర విషయాలివీ...

నేరుగా చూడాలని ఉంది..

‘వకీల్ సాబ్‌’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది.. మన కోసం చేసిన సినిమా అనుకునేవి అరుదుగా ఉంటాయి. నాకు సంబంధించినంత వరకు ఆ జాబితాలో మొదటి స్థానంలో నిలుస్తుంది ‘వకీల్‌’. ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది. హిందీ హిట్‌ చిత్రం ‘పింక్’ రీమేక్‌గా తెరకెక్కించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అలా చేసిన మా ప్రయత్నం విజయం సాధించింది. సినిమా ప్రచారం సమయానికే నేను కరోనా బారిన పడ్డాను. దాంతో ప్రచారానికి వెళ్లలేకపోయాను, ప్రేక్షకులకు దూరంగా ఉన్నానని బాధ పడ్డాను. ప్రస్తుతానికి మహమ్మారి నుంచి కోలుకున్నా మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దాంతో థియేటర్‌కి వెళ్లి సినిమా చూడలేకపోతున్నాను. నేరుగా వెళ్లి థియేటర్‌లో ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూడాలని ఉంది.

దర్శకుడి సలహాల మేరకు..

నా పాత్ర గురించి నేను ఎక్కువగా ఆలోచించలేదు. సెట్‌లో అడుగుపెట్టాక మాత్రమే అందులో లీనమయ్యేదాన్ని. ఎందుకంటే నేనూ సగటు మహిళలకి ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కొన్నాను. వాటి గురించి ఆలోచిస్తే మనసు పాడవుతుందనే ఉద్దేశంతో ఈ పాత్రని వ్యక్తిగతంగా ఫీలవ్వలేదు. పరిమితి మేర నటించాల్సి రావడంతో ఎక్కువగా దర్శకుడిపైనే ఆధారపడ్డాను. ఆయన నన్ను ఎలా చూపించాలనుకుంటున్నారో తెలుసుకుని అందుకు తగిన సలహాలు తీసుకునేదాన్ని. మనం ఎలా నటిస్తే ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారంటూ నేనూ అంజలి, అనన్య చర్చించుకునేవాళ్లం. వాళ్లతో కలిసి నటించడం కొత్త అనుభూతినిచ్చింది.

సినిమాలు చూసి మారిపోరు..

ప్రేక్షకులతో నేను ప్రత్యక్షంగా మాట్లాడలేకపోయినా సామాజిక మాధ్యమాల్లో వాళ్లు  నా పాత్ర గురించి ప్రస్తావిస్తుంటే సంతోషంగా ఉంది. వీలైనంత త్వరగా వాళ్లతో నేరుగా మాట్లాడాలని ఉంది. సినిమాలు చూసి రాత్రికి రాత్రే ఎవరూ మారిపోరు. అంత తేలికగా మహిళల్ని చులకనగా చూసే స్వభావాలు మారిపోవు. కానీ, మార్పు కోసం ఓ ఆలోచన మొదలవుతుంది. ‘వకీల్‌ సాబ్‌’ దీనికి నాంది అని భావిస్తున్నాను. 

ఆయన్ను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

పవన్‌ కల్యాణ్‌ గారితో కలిసి నటించడం ఎప్పటికీ మరిచిపోలేను. సెట్‌లో మేము సినిమా గురించి, అందులోని పాత్రల గురించే ఎక్కువగా మాట్లాడునేవాళ్లం. ఆయన చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవారు. తెలుగు భాషపై ఆయనకు ఉన్న పట్టు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉండేది.

క్రెడిట్‌ వాళ్లకే..

ఈ చిత్రానికి తమన్‌ అద్భుతమైన సంగీతం అందించారు. ఓ సంగీత దర్శకుడిగా కాకుండా పవన్‌ కల్యాణ్‌ అభిమానిగా పనిచేశారాయన.  తొలి గీతం ‘మగువా మగువా’ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లింది. మా ముగ్గురి (నివేదా, అంజలి, అనన్య) మధ్య ఉన్న అనుబంధం, కుటుంబ నేపథ్యం తదితర విషయాల్ని ఈ పాటతోనే చూపించారు దర్శకుడు. పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు ఎలాంటి అంశాలు నచ్చుతాయో తెలుసుకుని ఓ రీమేక్‌ కథకి వాటిని జోడించిన దర్శకుడికి, సంగీత దర్శకుడు తమన్‌కి ఈ విజయంలో క్రెడిట్‌ ఇవ్వాలి. ‘పింక్‌’ కథని అలానే ఉంచి పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్‌కి తగినట్టు దర్శకుడు శ్రీరామ్‌ వేణు తెరకెక్కించిన తీరు అభిమానుల్ని బాగా మెప్పిస్తోంది. నిర్మాత దిల్‌ రాజు కలల ప్రాజెక్టు ఇది. ఆయన బ్యానర్‌లో నటించడం గౌరవంగా భావిస్తున్నాను.

తదుపరి చిత్రం

ప్రస్తుతం ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ అనే కొరియన్‌ రీమేక్‌లో నటిస్తున్నాను. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రెజీనా మరో కథానాయిక.’ అంటూ నివేదా చెప్పుకొచ్చింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని