లక్ష్య సాధనకు అంధత్వం అడ్డుకాదు! - nizamabads vishal shines in making short films with a message aiming to become a good director
close
Published : 19/06/2021 18:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లక్ష్య సాధనకు అంధత్వం అడ్డుకాదు!

నిరూపిస్తున్న నిజామాబాద్‌ యువకుడు 


ఇంటర్నెట్ డెస్క్‌: కంటిచూపు సరిగ్గా లేకున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా అనుకున్న లక్ష్యం దిశగా సాగుతున్నాడు నిజామాబాద్‌కు చెందిన విశాల్‌. 40 ఏళ్లకు పూర్తి అంధత్వం వస్తుందని తెలిసినా, నిరాశ చెందకుండా లఘుచిత్రాలు తీస్తూ దర్శకుడిగా రాణిస్తున్నాడు. ఎవరి మీదా ఆధార పడకుండా స్వయం ఉపాధితో జీవనం సాగిస్తూ ఆదర్శంగా నిలిచాడు.

విశాల్‌కు మూడేళ్లకే కంటిచూపు సమస్య ఎదురైంది. రెటీనా సమస్యవల్ల వయసు పెరిగే కొద్దీ చూపు మందగిస్తుందని, 40 ఏళ్లకు పూర్తి చూపు కోల్పోవలసి వస్తుందనీ వైద్యులు చెప్పారు. దాంతో విశాల్‌ను తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న స్నేహ సొసైటీ అంధుల పాఠశాలలో చేర్పించారు. చదువుకునే రోజుల్లో విశాల్‌ను లూయీ బ్రెయిలీ చరిత్ర ఆకర్షించింది. ఆయన జీవిత చరిత్రను అందరికీ చేరువ చేసేందుకు లఘు చిత్రం తీయాలని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో సినిమా, సంగీతంపై అభిరుచి పెరిగింది. తన ప్రతిభను నిరూపించుకోవాలని అనుకున్నాడు విశాల్‌. కానీ అతనికి సరైన మార్గదర్శకత్వం లభించలేదు. అయినా నిరాశ చెందకుండా లఘు చిత్రాలపై దృష్టి సారించాడు. అనేక ఇబ్బందులు ఎదురైనా లఘుచిత్రాలను తీయడం మానలేదు. తనకొచ్చే దివ్యాంగుల పింఛను డబ్బులను కూడబెట్టి  ‘ఆదర్శ దివ్యాంగులు’ అనే లఘుచిత్రం తీశాడు. ఆ చిత్రంతో అతడిలోని ప్రతిభ బయటకు వచ్చింది. తను చదువుకున్న స్నేహ సొసైటీ నిర్వాహకులు సిద్ధయ్య సహాయంతో ‘మరువలేని ప్రేమ’ అనే మరోలఘు చిత్రాన్ని నిర్మించాడు. సంపన్న కుటుంబంలో పుట్టిన అమ్మాయిని ప్రేమించిన పేదింటి యువకుడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడో అందులో చూపించాడు. తర్వాత నిజామాబాద్‌ జిల్లానుంచి గల్ఫ్‌ వెళ్లిన వారి కష్టాలను తెలియజేసేలా ‘గల్ఫ్‌ ఘోషలు’ అనే లఘుచిత్రం తీశాడు. 

తల్లిదండ్రులకు భారం కాకూడదని ప్రభుత్వ సహాయంతో పాన్‌ షాప్‌ నడుపుతున్నాడు. దాంట్లో వచ్చే ఆదాయంతో లఘుచిత్రాలు తీస్తున్నాడు. ఇప్పటి వరకూ ఆరు ఆల్బమ్‌ సాంగ్స్‌, 12 లఘుచిత్రాలు తీసిన విశాల్‌ ఎప్పటికైనా వెండితెరమీద తన పేరు చూసుకోవాలని కలలు కంటున్నాడు. విశాల్‌ ప్రతిభను చూసి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లఘు చిత్రాలతో తన ప్రతిభ నిరూపించుకుంటూనే వెండితెరవైపు అడుగులు వేశాడు విశాల్‌. ‘ఒక్కక్షణం’, ‘రుబాబు’ వంటి తెలుగు సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ అనుభవంతో, స్నేహితుల సహాయంతో గంటన్నర నిడివిగల ‘మౌనప్రేమ’ అనే సినిమా తీస్తున్నాడు. శాస్త్రీయ సంగీతంలో పట్టున్న విశాల్‌ ఈ సినిమాకోసం రెండు పాటలను కూడా స్వరపరిచాడు. 

దివ్యాంగుడనే భావన లేకుండా నచ్చిన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న విశాల్ క్రీడాకారుడిగా కూడా రాణించాడు. జిల్లా స్థాయి కరాటే పోటీల్లో మొదటి స్థానంలో నిలిచాడు. 2013లో జిల్లా స్థాయి పరుగుల పోటీల్లో రజతం సాధించాడు. తనకున్న లోపాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా అటు విద్య, ఇటు క్రీడలు, కళల్లో రాణిస్తూ అందరి అభినందనలూ అందుకుంటున్నాడు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని