15ఏళ్ల ‘బొమ్మరిల్లు’.. వేడుకలు చేసుకోబోమన్న సిద్ధార్థ్‌.. ఎందుకంటే..! - not celebrating 15 years of bommarillu today says siddharth
close
Published : 09/08/2021 23:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

15ఏళ్ల ‘బొమ్మరిల్లు’.. వేడుకలు చేసుకోబోమన్న సిద్ధార్థ్‌.. ఎందుకంటే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిలల్లపై అతి ప్రేమ కూడా ఇబ్బందులకు దారి తీస్తుంది. ఇదే విషయాన్ని చాలా సున్నితంగా చెప్పిన చిత్రం ‘బొమ్మరిల్లు’. ఈ సినిమా డైరెక్టర్‌ భాస్కర్‌తో పాటు హీరోహీరోయిన్లు సిద్ధార్థ్‌, జెనిలియాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అవార్డుల పంట పండించింది. భారీ ఫైట్‌ సీక్వెన్సులు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌ లేకుండానే అతి సాధారణమైన కథతో సినిమా భారీ విజయం సాధించింది. దేవిశ్రీప్రసాద్‌ అందించిన సంగీతం ఇప్పటికీ చాలామంది ఫోన్లలో రింగ్‌టోన్‌గా వినిపిస్తోంది. ఎవరైనా తండ్రికొడుకుల మధ్య అతి ప్రేమ కనిపిస్తే.. ‘ఏంట్రా మీ నాన్న బొమ్మరిల్లు ఫాదర్‌లా ఉన్నారు’ అనే అంతగా సినిమా యువత మనసులో నాటుకుపోయింది. 2006 ఆగస్టు 9న విడుదలైందీ ప్రేమకథా చిత్రం. విడుదలై నేటితో 15 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఆ సినిమా హీరో సిద్ధార్థ్‌ ఓ ఆసక్తికరమై ట్వీట్‌ చేశాడు.

‘‘నేటితో ‘బొమ్మరిల్లు’కు 15ఏళ్లు. కానీ మేం వేడుకలు చేసుకోవడం లేదు. ‘మహాసముద్రం’ థియేటర్లలో పూర్తిస్థాయిలో విడుదలైన రోజే వేడుకలు చేసుకోవాలనుకుంటున్నాం. త్వరలోనే థియేటర్లలో కలుద్దాం’ అంటూ సిద్ధార్థ్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. సిద్ధార్థ్‌ ప్రస్తుతం ‘మహా సముద్రం’లో నటిస్తున్నాడు. శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఆగస్టు 19న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇదిలా ఉండగా.. సిద్ధార్థ్‌, జెనీలియా జంటగా భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బొమ్మరిల్లు’ బ్లాక్‌ బస్టర్‌ విజయం నమోదు చేసింది. దిల్‌రాజు నిర్మించారు. సినిమా మంచి విజయం సాధించడంతో సినిమా పేరు కాస్తా దర్శకుడికి ఇంటిపేరుగా మారింది.  ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సునీల్‌, ధర్మవరపు సుబ్రమణ్యం, తనికెళ్ల భరణి, మురళీమోహన్‌, రవి వర్మ, చిత్రం శ్రీను, సురేఖ వాణి తదితరులు నటించారు. దేవి శ్రీప్రసాద్‌ అందించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలీ’, ‘బొమ్మని గీస్తే నీలావుంది దగ్గరకొచ్చి ముద్దిమ్మంది..’, ‘వీ హ్యావ్ ఎ రోమియో’, ‘నమ్మక తప్పని నిజమైనా’ పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు తొలుత ఎన్టీఆర్‌ను హీరోగా అనుకున్నప్పటికీ డేట్లు సర్దుదబాటు కాకపోవడంతో సిద్ధార్థ్‌ను తీసుకున్నారట. ఈ చిత్రాన్ని తమిళంలో ‘సంతోష్ సుబ్రమణియన్’ పేరుతో, బెంగాలీలో ‘భలోబాసా భలోబాసా’, ఒరియాలో ‘డ్రీమ్ గర్ల్’గా, హిందీలో ‘ఇట్స్ మై లవ్’ పేర్లతో రీమేక్‌ చేశారు.


 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని