Ajay Devgn: దేశభక్తి మళ్లీ కాసులు కురిపిస్తుందా? - once again ajay devgn patriotism will give huge collections
close
Published : 14/07/2021 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ajay Devgn: దేశభక్తి మళ్లీ కాసులు కురిపిస్తుందా?

దేశభక్తి... అభిమానుల్ని థియేటర్లకు రప్పించే ఎవర్‌గ్రీన్‌ సబ్జెక్ట్‌. చారిత్రకం, కల్పితం.. ఏదైనా కథ, కథనంలో కాస్త వైవిధ్యం చూపితే బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం ఖాయం. ఇలాంటి పాత్రలతో దుమ్ములేపడంలో ముందుండే బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌. గతంలో దేశభక్తి కథాంశంతో వచ్చిన చిత్రాలు మంచి హిట్లు అందుకున్నాయి. అదే లైన్‌తో మరోసారి ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’తో వస్తున్నాడు. ఓసారి గత సినిమాల ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే...

తానాజీ: ది అన్‌సంగ్‌ హీరో

జనవరి 2020లో థియేటర్లలో సందడి చేసింది. సరిగ్గా అదేసమయంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరిగింది. అయినా తానాజీ రికార్డులను కొవిడ్‌ ఆపలేకపోయింది. రూ.172కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.368 కోట్లు రాబట్టి సూపర్‌హిట్‌గా నిలిచింది. తీవ్రమైన డిమాండ్‌ రావడంతో తర్వాత మరాఠీ భాషలోకి డబ్‌ చేశారు. మరాఠా వీరుడు తానాజీ మలుసరే చారిత్రక జీవిత గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఔరంగజేబు కైవసం చేసుకున్న కొంధణ కోటను తిరిగి చేజిక్కించుకోవడానికి అసమాన పోరాటం చేసిన పోరాట యోధుడే తానాజీ.


రెయిడ్‌

2018లో వచ్చిన ఈ చిత్ర ట్యాగ్‌లైన్‌ ‘హీరోస్‌ డోంట్‌ ఆల్వేస్‌ కమ్‌ ఇన్‌ యూనిఫామ్‌’. దానికి తగ్గట్టే పెద్దగా యాక్షన్‌ సీన్లు లేకున్నా దేవ్‌గణ్‌ ఇందులో ఇండియన్‌ రెవెన్యూ ఆఫీసర్‌గా ఆకట్టుకునే నటనతో మెప్పించాడు. 1980లలో  అధికారులు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక రాజకీయ నాయకుడి ఇంటిలో సుదీర్ఘ దాడులు నిర్వహించి భారీఎత్తున నల్లదనం స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఆధారంగా నిర్మించిన సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కాసులు కురిపించి రూ.153 కోట్లు వసూళ్లు రాబట్టింది.


గంగాజల్‌ (2003)

ఈ సినిమాలో ఎస్పీ అమిత్‌ కుమార్‌గా మెప్పించాడు దేవ్‌గణ్‌. విపరీతమైన నేరాలు జరిగే బిహార్‌లోని ఒక జిల్లాకు పోలీసు బాస్‌గా వస్తాడు. సరికొత్త దారిలో అక్కడి నేరస్థులు, గూండాలు, అవినీతి రాజకీయ నాయకుల ఆట కట్టించి సామాన్యులకు న్యాయం ఎలా అందించాడనేది కథాంశం. ఈ చిత్రం కేవలం రూ.16కోట్లు రాబట్టింది.


ది లెజెండ్‌ భగత్‌సింగ్‌ (2002)

దేవ్‌గణ్‌ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయే సినిమా ఇది. స్వాతంత్య్ర యోధుడు భగత్‌సింగ్‌గా ఈ పాత్రలో జీవించాడు అజయ్‌. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడిగా రెండు జాతీయ అవార్డులు గెలుచుకుంది ఈ సినిమా. కథ, కథనం, నటనపరంగా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నా బాక్సాఫీస్‌ దగ్గర నిరాశే ఎదురైంది. రూ.20 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తే అంతే వసూళ్లు వచ్చాయి.


భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా

మరోసారి దేశభక్తి బాట పట్టాడు అజయ్‌ దేవ్‌గణ్‌. ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’లో స్క్వాడ్రన్‌ లీడర్‌ విజయ్‌ కార్నిక్‌ పాత్ర పోషించాడు. సోనాక్షి సిన్హా, సంజయ్‌ దత్‌, నోరా ఫతేహీ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. డిస్నీ హాట్‌స్టార్‌ ఓటీటీలో ఆగస్టు 13న విడుదలవబోతోంది ఈ సినిమా.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని