వెండితెరపై ‘ఆటా’డేస్తారు! - once again sports drama in tollywood
close
Published : 29/09/2020 09:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెండితెరపై ‘ఆటా’డేస్తారు!

ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఒక్కో సమయంలో ఒక్కో తరహా కథలు వరుసగా వస్తుంటాయి. పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌, హారర్‌ కామెడీ, ఫ్యామిలీ డ్రామా ఇలా వివిధ జోనర్‌లలో సినిమాలు చేస్తుంటారు మన కథానాయకులు. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. సరికొత్త కథలు, విభిన్న కథాంశాలతో యువ దర్శకులు చిత్ర పరిశ్రమలో సందడి చేస్తుండటంతో వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అప్పుడప్పుడు క్రీడా నేపథ్యంలోనూ కథలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా, ఈ ట్రెండ్‌ బాలీవుడ్‌లో బాగా ఉంది. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ వరుసగా క్రీడా నేపథ్యం ఉన్న కథలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ చిత్రాలంటో చూసేద్దామా?

ఎవరి కోసం ‘ఫైటర్‌’గా మారాడు?

మాస్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ పూరి జగన్నాథ్‌. కథానాయకుల పాత్రలను సైతం అదే విధంగా చూపిస్తారు. పూరి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ‘ఫైటర్‌’(వర్కింగ్‌ టైటిల్‌) అనే చిత్రం తెరకెక్కుతోంది. అనన్యా పాండే కథానాయిక. ముంబయిలో ఒక షెడ్యూల్‌పూర్తి చేశారు. ఈ లోగా కరోనా విజృంభించడంతో షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడింది. ఇందులో విజయ్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఆయన కొంత శిక్షణ కూడా తీసుకున్నారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే తిరిగి షూటింగ్‌ ప్రారంభిస్తారు. ఇందులో విజయ్‌ బాక్సింగ్‌ ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

 

విలుకారుడిగా నాగశౌర్య

లవర్‌బాయ్‌గా ఎంట్రీ ఇచ్చి, మాస్‌, కమర్షియల్‌ కథలవైపు అడుగులు వేస్తున్న యువ కథానాయకుడు నాగశౌర్య. త్వరలో ఆయన విల్లు పట్టి బాణాలు సంధించేందుకు సిద్ధమయ్యారు. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య తన 20వ చిత్రంలో నటించనున్నారు. ప్రాచీన విలు విద్య నేపథ్యంలో స్పోర్ట్స్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా కోసం నాగశౌర్య ఎంతో కష్టపడుతున్నారు.

 

కబడ్డీ ఆడిస్తామంటున్న గోపీచంద్‌, తమన్నా

గోపీచంద్‌ కథానాయకుడిగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కతున్న చిత్రం ‘సీటీమార్‌’. తమన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో గోపీచంద్‌, తమన్నాలు కబడ్డీ కోచ్‌లుగా కనిపించనున్నారు. ఆంధ్రా క‌బ‌డ్డీ జట్టు కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ జట్టు కోచ్‌గా త‌మ‌న్నా న‌టిస్తున్నారట. భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది.

 

హాకీ స్టిక్‌ పట్టిన సందీప్‌ కిషన్‌, లావణ్య

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. జీవన్‌ దర్శకుడు. ఇందులో సందీప్‌, లావణ్యలు హాకీ క్రీడాకారులుగా సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ క్రీడకు సంబంధించిన మెళకువలు కూడా తెలుసుకున్నారు. పలు సందర్భాల్లో క్రీడను సాధన చేస్తున్న వీడియోలను సైతం అభిమానులతో పంచుకున్నారు.

 

గురి తప్పదంటున్న కీర్తి సురేశ్‌

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటి కీర్తి సురేశ్‌. ఆమె కీలక పాత్రలో నగేశ్‌ కుకునూరు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. రైఫిల్‌ షూటింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ పల్లెటూరి అమ్మాయి రైఫిల్‌ షూటింగ్‌లో ఏ విధంగా అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందన్న ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆది, జగపతిబాబులు కీలకపాత్ర పోషిస్తున్నారు

 

బాక్సర్‌గా మారిన వరుణ్‌

వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌. ఇప్పుడు ఆయన బాక్సర్‌ అవతారం ఎత్తారు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్‌ ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ చిత్ర షూటింగ్‌ నవంబరులో పునః ప్రారంభం కానుంది. జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్‌శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

గోపీచంద్‌గా సుధీర్‌బాబు

బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ జీవిత కథ ఆధారం ఓ సినిమా తెరకెక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రొఫెనల్‌ క్రీడాకారుడు అయిన సుధీర్‌బాబు ఇందులో నటించనున్నారు. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ ప్రాజెక్టు అనేక కారణాలతో వాయిదా పడింది. ఈ ఏడాది డిసెంబరులో దీన్ని ప్రారంభించబోతున్నట్లు ఇటీవల సుధీర్‌బాబు తెలిపారు. 2021 టోక్యో ఒలింపిక్స్‌ కంటే ముందు చిత్రాన్ని విడుదల చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నట్లు చెప్పారు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని