‘ఈ విజయం తియ్యనిదీ’ అంటున్న కోహ్లీ - one of our sweetest odi wins in recent past kohli
close
Updated : 24/03/2021 11:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఈ విజయం తియ్యనిదీ’ అంటున్న కోహ్లీ

పుణె: ఇంగ్లాండ్‌పై తొలి వన్డేలో సాధించిన విజయం ఈ మధ్య కాలంలో టీమ్‌ఇండియాకు అత్యంత తియ్యనిదని సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. అద్భుతంగా ఆడిన శిఖర్‌ ధావన్‌ను ప్రశంసించాడు. రాహుల్‌పై తమ నమ్మకం నిజమైందని వివరించాడు. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.

ధావన్‌ (98)కు తోడుగా రాహుల్‌, కృనాల్‌, కోహ్లీ అర్ధశతకాలు చేయడంతో టీమ్‌ఇండియా 318 పరుగులు చేసింది. ఛేదనలో జానీ బెయిర్‌స్టో, జేసన్‌ రాయ్‌ విజృంభించడంతో ఇంగ్లాండ్‌ 15 ఓవర్లకే 135 పరుగులు దాటేసింది. ఈ క్రమంలో అరంగేట్రం పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ (4/54) చెలరేగి వారిని దెబ్బకొట్టాడు. శార్దూల్‌ 3, భువీ 2 వికెట్లతో విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ పోరులో టీమ్‌ఇండియా 66 పరుగుల తేడాతో విజయ కేతనం ఎగరేసింది.

‘ఈ మధ్య కాలంలో టీమ్‌ఇండియాకు ఇదే తియ్యని విజయం. మరేదీ దీనికి సాటిరాదు. వేగంగా 9 వికెట్లు తీయడం గొప్ప ప్రదర్శన. మేం ఆటలో తిరిగి పుంజుకోవడం అద్భుతమే. ప్రస్తుతం నేనెంతో గర్విస్తున్నాను’ అని కోహ్లీ అన్నాడు. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన రాహుల్‌, కీలక పరుగులు చేసిన ధావన్‌పై అతడు ప్రశంసలు కురిపించాడు.

‘మేం ఇంతకు ముందే చెప్పాం. కసితో ఉండే ఆటగాళ్లను మేం ప్రోత్సహిస్తాం. శిఖర్‌ ధావన్‌ ఇన్నింగ్స్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కేఎల్‌ రాహుల్‌ సైతం అంతే. పరుగులు చేసేవాళ్లు, నిస్వార్థంగా సేవ చేసేవాళ్లకు మేం కచ్చితంగా అవకాశాలు ఇస్తాం. ప్రస్తుతం ప్రతి స్థానానికి ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. మేం సరైన దారిలో పయనిస్తున్నాం. ఎంచుకోవడానికి మాకు ఎంతోమంది ఆటగాళ్లతో కూడిన బృందం ఉంది’ అని కోహ్లీ అన్నాడు.

‘తుది జట్టులో చోటు దొరకనప్పుడూ శిఖర్‌ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. అతడి దేహభాష చాలా బాగుంది. మాకెంతో సహాయకారిగా ఉన్నాడు. నేటి ఫలితానికి అతడు అర్హుడు. మ్యాచ్‌లో సంక్లిష్టమైన దశలో అతడు ఆడాడు. అతడు చేసిన 98 పరుగులు స్కోరుబోర్డులో కనిపించేవాటి కన్నా ఎంతో విలువైనవి’ అని విరాట్‌ తెలిపాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని