తెరవెనుక వ్యథ.. తెరపై కథ    - oscar nominated movie mank story
close
Published : 18/04/2021 15:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెరవెనుక వ్యథ.. తెరపై కథ   

‘సిటిజన్‌ కేన్‌’... శిల్పిని ఆవిష్కరించే శిల్పం

ఆస్కార్‌ సినిమా -6

‘సిటిజన్‌ కేన్‌’... హాలీవుడ్‌కే చిత్రరాజం.. మూకీ నుంచి టాకీ వైపు అడుగులేస్తున్న చిత్రసీమను ఓ కుదుపు కుదిపేసిన సినిమా అది. ప్రపంచంలోని ప్రముఖ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లన్నీ ఉత్తమ చిత్రాల్లో దీనికే అగ్రస్థానం కట్టబెట్టాయి. అలాంటి క్లాసిక్‌ సినిమాకు స్క్రీన్‌ప్లే హక్కుల విషయంలో పెద్ద వివాదమే ఉంది. దీన్ని కథాంశంగా చేసుకొనే గతేడాది ‘మ్యాంక్‌’ సినిమా తెరకెక్కింది. ఈ ఏడాదికిగానూ అత్యధిక ఆస్కార్‌ నామినేషన్లు సాధించి ఉత్తమ చిత్రం విభాగంలోనూ బలమైన పోటీదారుగా నిలిచింది.

చిత్రం: మ్యాంక్‌; దర్శకుడు: డేవిడ్‌ ఫించర్‌; రచయిత: జాక్‌ ఫించర్‌; భాష: ఇంగ్లీష్‌; తారాగణం: గ్యారీ ఓల్డ్‌మ్యాన్, అమాండ సీఫ్రీడ్‌ ఇతర నటీనటులు; నిడివి : 131 నిమిషాలు; ఆస్కార్‌ నామినేషన్లు : 10

హాలీవుడ్‌ గతిని మార్చిన ‘సిటిజన్‌ కేన్‌’ సినిమాకు ఆర్సన్‌ వెల్స్‌ దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేను అందించింది హెర్మన్‌ మ్యాంకివిజ్‌. ఆయన జీవితం, ‘సిటిజన్‌ కేన్‌’ కథను రాసే క్రమంలో అల్లుకున్న సంఘటనల ఆధారంగా ‘మ్యాంక్‌’ తెరకెక్కింది. డేవిడ్‌ ఫించర్‌ ఆయన తండ్రి జాక్‌ ఫించర్‌ రాసుకున్న కథ, స్క్రీన్‌ప్లే ఆధారంగా ‘మ్యాంక్‌’ సినిమాని తీర్చిదిద్దాడు. ఆస్కార్‌ గ్రహీత గ్యారీ ఓల్డ్‌మ్యాన్‌ టైటిల్‌ పాత్ర పోషించారు. గతేడాది నవంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. అలనాటి హాలీవుడ్‌ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించిన దర్శకుడు డేవిడ్‌ ఫించర్‌పై ప్రశంసల జల్లు కురిసింది. మ్యాంక్‌ పాత్రలో ఒదిగిపోయిన గ్యారీ ఓల్డ్‌మ్యాన్, సినిమాటోగ్రఫి, సంగీతం, నిర్మాణ విలువలకు అన్నివైపుల నుంచి ప్రశంసలు దక్కాయి. అంతేకాదు ఈ ఏడాది ఆస్కార్‌ పోరులో ఏకంగా 10 నామినేషన్లు దక్కించుకొని సినీ అభిమానుల్ని   సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. ఉత్తమ చిత్రం, నటుడు, సహాయనటి, దర్శకుడు, ఒరిజినల్‌ స్కోర్, సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్‌ డిజైన్, కాస్ట్యూమ్‌ డిజైన్, మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్, సౌండ్‌ విభాగాల్లో పోటీనిస్తూ బలమైన పోటీదారుగా ఆస్కార్‌ బరిలో నిలిచింది.

కథ: సినిమా కథంతా 1930-40 మధ్య కాలంలో జరుగుతుంది. రెండో ప్రపంచ యుద్ధం  కారణంగా లోకమంతా అల్లాడుతుంటే.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటుంది సినిమా రంగం. అందులో భాగంగానే ఆర్సన్‌ వెల్స్‌ తనకు 60 రోజుల్లో కథను సిద్ధం చేసి ఇవ్వాలని రచయిత మ్యాంకివిజ్‌ను కోరతాడు. ఓ కారు ప్రమాదంలో అతని కాలు విరిగి మంచానికే పరిమితమవ్వాల్సి వస్తుంది. తన సహాయకురాలు రిటా అలెగ్జాండర్‌ సాయంతో కథ రాయడం ప్రారంభిస్తాడు. అయితే కథలోని ప్రధాన పాత్ర ఆనాటి పత్రిక సంపాదకుడు విలియం రాండాల్ఫ్‌ను పోలి ఉందని ఆమె గ్రహిస్తుంది. పైగా మ్యాంకివిజ్‌కు మద్యం అలవాటు. దీంతో వెల్స్‌ ఇచ్చిన గడువులో కథను పూర్తిచేయలేడని భావిస్తుంది. ఇలా రాస్తున్న సన్నివేశాలకు సమాంతరంగా మ్యాంకి 1930ల నాటి జీవితం కనిపిస్తూ ఉంటుంది. ఈ కథ రాయడానికి ఎలాంటి ఘటనలు ప్రేరణ? అసలు అనుకున్న సమయానికి ఆర్సన్‌ వెల్స్‌కి పూర్తి స్క్రిప్ట్‌ను అందించాడా? లేదా? ఆ తదనంతరం ఎలాంటి పరిణామాలు జరిగాయనేది అనేది మిగతా కథ.

డేవిడ్‌ ఫించర్‌ మార్క్‌..: దర్శకుడిగా డేవిడ్‌ ఫించర్‌ సత్తా ఏంటో ఆయన సినిమాలే చెబుతాయి. ‘ఫైట్‌ క్లబ్‌’, ‘సెవెన్‌’ లాంటి క్లాసిక్‌ సినిమాలు తీశారాయన. ఆయన తీసిన ‘ది సోషల్‌ నెట్‌వర్క్‌’ మూడు ఆస్కార్లు గెలుచుకుంది. 2013లో వచ్చిన ‘గాన్‌ గర్ల్‌’ చిత్రమే చివరిది. 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘మ్యాంక్‌’ను తెరకెక్కించారు. తండ్రి జాక్‌ ఫించర్‌ 1990లోనే రాసుకున్న కథకు దాదాపు 30 ఏళ్ల తర్వాత డేవిడ్‌ ఫించర్‌ దృశ్యరూపమిచ్చారు. అలనాటి హాలీవుడ్‌కు, అప్పటి పరిస్థితులకు పోతపోసినట్టుగా ‘మ్యాంక్‌’ను రూపొందించారు. అయితే ఆయన గత చిత్రాలతో పోల్చితే ఇది పూర్తి భిన్నమైంది. సినిమా అంతా బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే సాగుతూ తొలితరం హాలీవుడ్‌ సినిమాలను చూస్తున్న అనుభూతినిస్తుంది. సంభాషణలు, కాస్ట్యూమ్స్‌ అందుకు తగినట్లుగానే ఉంటాయి. కాస్ట్యూమ్‌ డిజైనింగ్, సౌండ్‌ డిజైనింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ ఇలా ప్రతి విభాగంలోనూ ప్రత్యేకతను చాటుతూ ‘సిటిజన్‌ కేన్‌’ తెరవెనుక కథను కళ్లముందుంచారు. ఆనాటి రాజకీయాలు, హాలీవుడ్‌లోని అవకతవకలను చూపించే ప్రయత్నమూ చేశారు.

ఇదీ స్క్రీన్‌ప్లే వివాదం: హాలీవుడ్‌లో ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ సినిమా సిటిజన్‌ కేన్‌కి కథ, స్క్రీన్‌ప్లే అందించింది ఆనాటి మేటి రచయిత మ్యాంకివిజ్‌. ఇప్పుడు క్లాసిక్స్‌గా చెబుతున్న 1930ల నాటి చాలా సినిమాలకు ఈయనే కథనందించినట్లు చెబుతారు. కాని వాటికి క్రెడిట్‌ మాత్రం దక్కలేదు. ఆయన జీవితంలో ఎదురైన కొందరు వ్యక్తులు, కొన్ని సంఘటనల   ఆధారంగా సిటిజన్‌ కేన్‌కు రూపమిచ్చాడు మ్యాంకి. అయితే స్క్రీన్‌ప్లే టైటిల్‌లో ఆయనతో పాటు ఆర్సన్‌ వెల్స్‌ పేరు ఉండటమే వివాదం. దర్శకుడు కథలో స్వల్ప మార్పులే చేశాడని, పూర్తి క్రెడిట్‌ మ్యాంకికి దక్కాలనేది కొందరి వాదన. స్క్రీన్‌ప్లే విభాగంలో సిటిజన్‌ కేన్‌ సినిమాకు గానూ ఇద్దరినీ ఆస్కార్‌ వరించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని