close
Published : 11/04/2021 11:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

షికాగో విప్లవ ‘సప్తా’స్త్రాలు

ఆస్కార్‌ సినిమా 2

చిత్రం: ది ట్రయిల్‌ ఆఫ్‌ ది షికాగో 7; భాష: ఇంగ్లీష్‌; విడుదల: 2020; దర్శకత్వం: ఆరోన్‌ సోర్కిన్‌; నటీనటులు: బారోన్‌ కోహెన్, జాన్‌ కారోల్, ఎడీ రెడ్‌మేన్‌ తదితరులు; నిడివి: 130 నిమిషాలు; ఆస్కార్‌ నామినేషన్స్‌: ఉత్తమ చిత్రం  సహాయ నటుడు, ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫి, ఒరిజినల్‌ సాంగ్, ఫిల్మ్‌ ఎడిటింగ్‌.

ఉత్తమ చిత్రం విభాగంలో గట్టిపోటినిస్తున్న చిత్రాల్లో ‘ది ట్రయల్‌ ఆఫ్‌ ది షికాగో 7’ ఒకటి. ఆస్కార్‌ విన్నింగ్‌ రచయిత ఆరోన్‌ సోర్కిన్‌ దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రమిది. ‘ది సోషల్‌ నెట్‌వర్క్‌’   సినిమాకు గానూ ఆడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆరోన్‌ని ఆస్కార్‌ వరించింది. తను దర్శకత్వం వహించిన తొలిచిత్రం మాలీస్‌ గేమ్‌(2017)తో పాటు, 2012లో వచ్చిన మనీ బాల్‌ సినిమాలకు అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్‌ నామినేషన్‌ పొందారు. హాలీవుడ్‌లో పేరెన్నికగన్న రచయిత ఆయన. ‘ది ట్రయల్‌ ఆఫ్‌ ది షికాగో 7’ను పారమౌంట్‌ పిక్చర్స్‌ నిర్మించింది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో చిత్ర హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకొంది. ఈ చిత్రం  మొత్తం ఆరు విభాగాల్లో ఈ ఏడాది నామినేషన్లు దక్కించుకొంది. ఉత్తమ చిత్రం విభాగంలో మిగతా సినిమాలకు గట్టి పోటీనిస్తోంది. ‘ది థియరీ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌’ సినిమాతో ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ను ఎగరేసుకుపోయిన ఎడీ రెడ్‌మేన్‌ ఇందులో టామ్‌ హేడెన్‌గా కీలక పాత్రలో పోషించాడు. అలాగే నటుడు, నిర్మాత, రచయిత సచా బారోన్‌ కొహెన్‌ ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ఆస్కార్‌ బరిలో ఉన్నారు. సంగీతం, ఎడిటింగ్, రచన ఇలా అన్నింట్లో ఈ చిత్రం బలంగా ఉంది.

కథ: అది 1968 సంవత్సరం. వియాత్నంలో జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ యుద్ధానికి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కొంతమంది యువనాయకులు, విద్యార్థులు కలిసి డెమాక్రాటిక్‌ పార్టీ సమావేశం జరుగుతున్న షికాగో నగరంలో  నిరసనలు చేపట్టేందుకు సిద్ధమవుతారు. అవి హింసాత్మకంగా మారతాయి. ఇది జరిగిన కొన్నాళ్లకి అల్లర్లు రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఏడుగురు యువకులను అరెస్ట్‌ చేస్తారు. ఆ ఏడుగురే ‘షికాగో 7’గా ప్రసిద్ధి. వీరితో పాటు బాబీ సీల్‌ అనే నల్లజాతి యువకుడిని పోలీసును చంపాడని ఆరోపిస్తూ అరెస్ట్‌ చేస్తారు. సినిమా ఈ కేసు విచారణ చుట్టూనే తిరుగుతుంది. ప్రభుత్వం తరఫున రిచర్డ్‌ షల్ట్స్, షికాగో 7 తరఫున విలియం కన్‌స్ట్లర్‌ కోర్ట్‌లో తమ వాదనలు వినిపిస్తారు. ఈ వాదోపవాదాల్లో ఎవరు గెలిచారు. ఎవరికి శిక్ష పడిందనేది మిగతా కథ.

స్పీల్‌బర్గ్‌ ఆలోచనలోంచి..: దర్శకుడు స్పీల్‌బర్గ్‌ను 2006లో కలిసినప్పుడే ఈ సినిమాకు బీజం పడిందని చెబుతాడు ఆరోన్‌ సోర్కిన్‌. షికాగో ఉదంతంపై సినిమా తీయాలన్న ఆలోచనను బయటపెట్టారు స్పీల్‌ బర్గ్‌. ఆరోన్‌ సోర్కిన్‌ 2007లో స్క్రిప్ట్‌ సిద్ధం చేసి ఇవ్వడంతో విల్‌స్మిత్, హేత్‌ లెడ్జర్‌లు ప్రధాన పాత్రధారులుగా పట్టాలెక్కాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. దర్శకులు మారుతూ వచ్చారు. చివరకు 2018లో ఆరోన్‌ సోర్కిన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్నట్లు ప్రకటించి సినిమాను పూర్తి చేశారు.

ఎడిటింగ్‌ చేస్తుంటే చేతులు వణికాయి: సినిమా అంతా నాన్‌ లీనియర్‌ స్క్రీన్‌ప్లేలో నడుస్తుంది. కోర్టులో జరిగే విచారణతోపాటే షికాగో వీధుల్లో జరిగిన   నిరసన, అల్లర్లు సమాంతరంగా కనిపిస్తాయి. ఎక్కువశాతం సన్నివేశాలు ఆ కేసుపై జరుగుతున్న వాదన మీదే ఉంటాయి.  చేయని   నేరానికి విచారణ ఎదుర్కొంటూ అసహనాన్ని, వ్యతిరేకతను తెలిపే బ్లాక్‌పాంథర్‌ నాయకుడు బాబీ సీల్‌ నటన ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఏబీ హాఫ్‌మ్యాన్‌ నటించిన బారోన్‌ కోహెన్‌ కోర్టులో అమెరికా న్యాయవ్యవస్థపై వ్యంగ్యంగా పలికే సంభాషణలు నవ్వు తెప్పిస్తాయి. ఈ సినిమాలో నటనకు గానూ కోహెన్‌ ఉత్తమ సహాయనటుడి విభాగంలో ఆస్కార్‌ రేసులో ఉన్నాడు. 1968లో జరిగిన యదార్థ సన్నివేశాలను ఇందులో చొప్పించారు.  అందుకే ఎడిటింగ్‌ చేసేప్పుడు చేతులు వణికాయని చెబుతారు ఎడిటర్‌ అలన్‌ బౌంగర్టెన్‌. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో చివరిదాకా ఉత్కంఠ కలిగేలా సినిమాను తీర్చిదిద్దారు   దర్శకరచయిత ఆరోన్‌. ఆయన ఆడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో పోటీలో ఉన్నారు. వియత్నాం యుద్ధం సృష్టిస్తున్న అలజడి, ఆనాటి సగటు అమెరికన్ల స్థితి, అమెరికా ప్రభుత్వ   పక్షపాత వైఖరి, నల్లజాతీయులపై వివక్ష, విప్లవ నాయకత్వం ఎగసిన తీరు ఇలా ఎన్నో అంశాలను ఇందులో చర్చించాడు దర్శకుడు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని