24గంటల్లో 30లక్షల టీకాల పంపిణీ! - over 3 million get covid 19 vaccine in 24 hours
close
Updated : 16/03/2021 14:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

24గంటల్లో 30లక్షల టీకాల పంపిణీ!

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో టీకాలను పంపిణీ చేశారు. 24గంటల వ్యవధిలో 30లక్షల 39వేల టీకాలను వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు 3కోట్ల 29లక్షల డోసులను అందించినట్లు తెలిపింది. భారత్‌లో టీకా పంపిణీ ప్రారంభమైనప్పటి నుంచి ఒక రోజు వ్యవధిలో ఇంత భారీ సంఖ్యలో టీకాలు ఇవ్వడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ రాజస్థాన్‌లో అత్యధికంగా 31 లక్షలు, మహారాష్ట్రలో 30.9 లక్షల టీకాలను పంపిణీ చేశారు.

జనవరి 16వ తేదీన దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, తొలిదశలో దాదాపు కోటి మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు మాత్రమే ఇచ్చారు. ఇక 60ఏళ్ల వయసు పైబడినవారికి మార్చి 1వ తేదీ నుంచి టీకా ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటినుంచి గడిచిన పదిహేను రోజుల్లోనే 60ఏళ్లు పైబడిన కోటి మందికి టీకా ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు అందించిన టీకాల్లో 2కోట్ల 70లక్షల మందికి తొలిడోసు ఇవ్వగా.. మరో 58లక్షల మందికి రెండు డోసును ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

టీకా పంపిణీ ఆపే ప్రసక్తే లేదు..

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రక్తం గడ్డకడుతున్నట్లు యూరప్‌ దేశాల్లో కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పలు దేశాలు టీకా పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించాయి. దీనిపై ఇప్పటికే వ్యాక్సిన్‌ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పష్టతనిచ్చాయి. ఆస్ట్రాజెనెకా టీకా సురక్షితమేనని, వీటిని పంపిణీ చేయవచ్చని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో టీకా పంపిణీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లో టీకాలపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు లేనందున టీకా పంపిణీ సజావుగానే సాగుతుందని వెల్లడించాయి.

ఇక ఆస్ట్రాజెనెకా టీకాను భారత్‌లో కొవిషీల్డ్‌ పేరుతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తోన్న విషయం తెలిసిందే. భారత్‌లో రెండు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాగా.. ఆస్ట్రాజెనెకాకు చెందిన కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాలను ప్రజలకు అందిస్తున్నారు. ఇక్కడ పంపిణీ చేయడంతోపాటు విదేశాలకు కూడా భారీ స్థాయిలో ఎగుమతి చేస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని