కెనడా పాఠశాలల్లో అస్థిపంజరాల గుట్టలు - over 600 bodies found at indigenous school in canada
close
Published : 25/06/2021 11:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కెనడా పాఠశాలల్లో అస్థిపంజరాల గుట్టలు

మరో బడి ప్రాంగణంలో 600లకు పైగా చిన్నారుల అస్థిపంజరాలు

వాంకోవర్‌: వందల కొద్దీ చిన్నారుల అస్థిపంజరాలతో కెనడా దేశం మరోసారి ఉలిక్కిపడింది. గత నెల బ్రిటిష్‌ కొలంబియాలోని ఓ మూసివున్న పాఠశాల ప్రాంగణంలో 200 అస్థిపంజరాలు బయటపడగా.. తాజాగా వాంకోవర్‌లోని మరో రెసిడెన్షియల్‌ పాఠశాల ప్రాంగణంలో 600లకు పైగా గుర్తుతెలియని అస్థిపంజరాలను అధికారులు గుర్తించారు. 

ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలున్న ‘కామ్‌లూప్స్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌’ ప్రాంగణంలో గత నెల ఒకేసారి 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడ్డాయి. మృతుల్లో మూడేళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. ఒక రాడార్‌ ద్వారా లభ్యమైన సమాచారంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన దర్యాప్తు అధికారులు దేశవ్యాప్తంగా ఇతర మూసివున్న రెసిడెన్షియల్‌ స్కూళ్లపై దృష్టిసారించారు. ఈ క్రమంలో కొవెస్సెస్‌ ఫస్ట్‌ నేషన్‌ ప్రాంతంలోని ‘మారివల్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌’ ప్రాంగణంలో రాడార్‌ ద్వారా సెర్చ్‌ చేయగా.. వందల కొద్దీ గుర్తుతెలియని సమాధులను గుర్తించారు. ఇందులో దాదాపు 600 మందికి పైనే చిన్నారులను సమాధి చేసినట్లు తెలిసింది. దీంతో తవ్వకాలు చేపట్టి పిల్లల అవశేషాలను బయటకు తీస్తున్నారు. ఈ ఆశ్రమ పాఠశాల 1899 నుంచి 1997 మధ్య రోమన్‌ కాథలిక్‌ చర్చి ఆధ్వర్యంలో నడిచింది.

బాలల సామూహిక హత్యాకాండేనా..!

19వ శతాబ్దం నుంచి 1970ల వరకు కెనడాలో దాదాపు లక్షన్నర మందికి పైగా చిన్నారులను క్రిస్టియన్‌ స్కూళ్లలో బలవంతంగా చేర్చినట్లు తెలిసింది. ఈ పాఠశాలల్లో అత్యధికం రోమన్‌ కాథలిక్‌ మిషనరీ ఆధ్వర్యంలోనే నడిచేవి. ఒకప్పుడు ఇక్కడి పాఠశాలల్లో బలవంతపు మత మార్పిళ్లు జరిగేవనీ, మాట విననివారిని తీవ్రంగా కొట్టేవారనీ చెబుతారు. చిన్నారులపై శారీరక, లైంగిక వేధింపులు జరిగాయని, మాతృభాష మాట్లాడినందుకు పిల్లలను చితకబాదేవారని ఇటీవల కెనడా ప్రభుత్వం కూడా అంగీకరించింది.  ఇలాంటి చర్యల వల్ల కనీసం 6,000 మంది చనిపోయి ఉంటారని ఒక అంచనా.

మరోవైపు కెనడాకు చెందిన పిల్లల పట్ల విద్యాసంస్థల్లో దారుణాలు జరిగాయంటూ ఐదేళ్ల క్రితం నిజ నిర్ధారణ కమిషన్‌ ఒకటి నివేదిక వెలువరించింది. సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల కనీసం 3200 మంది పిల్లలు చనిపోయి ఉంటారని, ఒక్క కామ్‌లూప్స్‌ పాఠశాలలోనే 1915-1963 మధ్య 51 మరణాలు చోటు చేసుకుని ఉండవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అయితే ఈ ఆశ్రమ పాఠశాలల్లో అంతకుమించిన స్థాయిలో ఏదో ఘాతుకం జరిగినట్లు తాజా పరిణామాలు చాటుతున్నాయి.

గుండె బద్దలవుతోంది: కెనడా ప్రధాని

తాజా ఘటనలపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ట్విటర్‌ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘మారివల్ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చిన్నారుల అస్థిపంజరాలు బయటపడిన వార్త విని నా గుండె బద్దలైంది. ఇది తీవ్ర విచారకరం. ఈ దారుణాల వెనుక వాస్తవాలను మేం బయటపెడతాం’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పాఠశాలలు చాలానే ఉన్నాయి. వాటన్నింటిలో తవ్వకాలు జరిపితే అస్థిపంజరాల లెక్క ఎంతవరకు వెళ్తుందనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని