‘ప్రాణవాయువు’ను తోడేస్తున్న సెకండ్‌ వేవ్‌! - over 70 pc of covid 19 patients above 40 years in both waves
close
Updated : 20/04/2021 11:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ప్రాణవాయువు’ను తోడేస్తున్న సెకండ్‌ వేవ్‌!

శ్వాసకోశ ఇబ్బందుల పెరుగుదలతో భారీగా వినియోగం
వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: కరోనా వైరస్‌ రెండో దఫా విజృంభణతో భారత్‌ సతమతమవుతోంది. అయితే మొదటి దఫాతో పోలిస్తే ఈసారి రోగులకు అధికస్థాయిలో ప్రాణవాయువు అవసరమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య తొలి, రెండో దఫాలో ఎటువంటి తేడా లేదని పేర్కొంది. ఇక కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతిలో 70శాతం మంది రోగులు 40 ఏళ్లకు పైబడినవారే ఉంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

దేశంలో కరోనా వైరస్‌ తొలిదఫా విజృంభణతో పోలిస్తే రెండో దఫాలో వైరస్‌ బారినపడుతున్న వారిలో కొన్ని భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ముఖ్యంగా చాలామంది రోగులు శ్వాస ఆడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఆక్సిజన్‌ అవసరం ఎక్కువైనట్లు పేర్కొంది. తొలిదఫాలో 41.5శాతం రోగులకు ఆక్సిజన్‌ అవసరం కాగా.. సెకండ్‌ వేవ్‌లో అది 54.5 శాతంగా ఉంది. వెంటిలేటర్‌ అవసరం మాత్రం సెకండ్‌ వేవ్‌లో తక్కువగానే ఉన్నట్లు వెల్లడించింది. తొలి దఫా విజృంభణలో పొడిదగ్గు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలను ఎక్కువగా చూశామని నీతిఆయోగ్‌ సభ్యులు వీకే పాల్‌ పేర్కొన్నారు. 

70 శాతం మంది ఆ వయసువారే..!

ఇక కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌ సమయంలో వైరస్‌ బారిన పడుతున్నవారిలో 70 శాతం మంది 40 ఏళ్ల పైడినవారేనని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ వెల్లడించారు. అయినప్పటికీ సెకండ్‌ వేవ్‌లో వృద్ధులు వైరస్‌ బారినపడే ప్రమాదం మరింత ఎక్కువగా ఉందన్నారు. ఈసారి యువతలోనూ కేసుల సంఖ్య పెరగడంతోపాటు లక్షణాలు కనిపించని కేసుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఫస్ట్‌వేవ్‌లో 7600, సెకండ్‌ వేవ్‌లో 1885 రోగులపై జరిపిన అధ్యయనం ప్రకారం వీటిని అంచనా వేశామని ఆయన వెల్లడించారు. మొదటి దఫాలో 30 ఏళ్లలోపు ఉన్నవారిలో 30శాతం కేసులు వెలుగుచూడగా, రెండో విజృంభణలో ఇది 32 శాతంగా ఉందని నీతి ఆయోగ్‌ సభ్యులు వీకే పాల్‌ పేర్కొన్నారు. ఇలాంటి కీలక సమయంలో మెడికల్‌ ఆక్సిజన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయవద్దని సూచించారు. ఇక రెమ్‌డిసివిర్‌ ఔషధాన్ని కేవలం తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల్లో చేరిన రోగులు మాత్రమే తీసుకోవాలని.. ఇంటివద్ద ఐసోలేషన్‌లో ఉన్నవారికి అవసరం లేదని సూచించారు.

ఇదిలా ఉంటే, దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2.73 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 1619 మంది మృత్యువాత పడ్డారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని