పాక్ మంత్రి నోట ఆశ్చర్యపరిచే మాట! - pak minister admitted that art 370 is internal matter of india
close
Published : 08/05/2021 13:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్ మంత్రి నోట ఆశ్చర్యపరిచే మాట!

అధికరణ 370 రద్దు భారత్‌ అంతర్గత అంశమని ఒప్పుకోలు

ఇస్లామాబాద్‌: చైనా అండ చూసుకొని భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన పాకిస్థాన్ ఎట్టకేలకు తోకముడుస్తోంది. ఒకప్పుడు ఐరాసలోనూ భారత్‌పై లేనిపోని ఆరోపణలతో విషం చిమ్మిన దాయాది దేశం ఇప్పుడు శాంతి వచనాలు వల్లెవేస్తోంది. పాక్ దుర్భుద్ధిని ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రపంచ వేదికలపై ఏకాకిని చేసి బుద్ధి చెప్పాలన్న భారత ప్రయత్నం ఫలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తమ అసత్య ప్రచారాలకు ఏ దేశమూ అండగా నిలవకపోగా.. ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆర్థిక ఆంక్షల కత్తి వేలాడుతుండడంతో పాక్‌ అసలు వాస్తవాల్ని గుర్తించక తప్పలేదు. సరిహద్దుల్లో ఆంక్షల ఉల్లంఘనల దగ్గరి నుంచి కశ్మీర్‌ విషయం వరకూ కాస్త మెత్తబడ్డట్లు కనిపిస్తోంది.

అధికరణ 370 రద్దు భారత అంతర్గత అంశమంటూ ఓ స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు ఇదే అంశంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఏకంగా భారత రాయబారిని ఇస్లామాబాద్‌ నుంచి పాక్‌ తిప్పి పంపిన విషయం తెలిసిందే. అంత కఠిన వైఖరి నుంచి పాక్‌ ఒక్కసారిగా దిగి రావడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అయితే అధికరణ 370 రద్దును భారత్‌లోని ప్రజలు సైతం హర్షించడం లేదంటూ ఖురేషీ తన ఊహాలోకాన్ని ఆవిష్కరించారు.

ఇక భారత్‌-పాక్‌ మధ్య ఉన్న విభేదాలు కేవలం చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఖురేషీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతకుముందు మాత్రం అధికరణ 370 రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు భారత్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదంటూ పాక్‌ బీరాలకు పోయే ప్రయత్నం చేసింది. అంతటి కఠిన వైఖరి నుంచి ఒక్కసారిగా కిందకు దిగిరావడంపై సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆంక్షలతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పు పుట్టకపోవడంతో పాక్‌ దాదాపు ఆర్థికంగా కుప్పకూలే దశలోకి వెళ్లింది. దీంతో అప్రమత్తమైన సర్కార్‌ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కొంతమంది కరడుగట్టిన ఉగ్రవాదులపై కనీసం కంటితుడుపు చర్యలకైనా సిద్ధమయింది. భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించింది. దీంతో ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ నుంచి కొంత మేర సాయం అందింది. ఈ క్రమంలో భారత్‌లో కయ్యం వల్ల మసకబారిన తమ ప్రతిష్ఠను పునర్‌నిర్మించుకొని.. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే, పాక్‌ వక్రబుద్ధి అందరికీ తెలిసిందే. ఎప్పుడు తోకజాడిస్తుందో తెలియని పరిస్థితి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని