వకీల్‌సాబ్‌ పాత్ర చేయడం నా అదృష్టం: పవన్‌ - pawan kalyan about vakeel saab in pre release event
close
Published : 05/04/2021 20:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వకీల్‌సాబ్‌ పాత్ర చేయడం నా అదృష్టం: పవన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘అభిమానులు లేకపోతే ఈ పవన్‌కల్యాణ్‌ లేడు. నేను ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఏమాత్రం అండదండలు లేని సమూహం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. మీ గుండె చప్పుడు నేను అర్థం చేసుకున్నవాడిని. మీ గుండెల్లో ప్రేమను గౌరవించే వాడిని. మీకోసం సినిమాల ద్వారా ఆనందాన్ని ఇవ్వాలని పరితపించేవాడిని. కొన్నిసార్లు మీ ఆనందానికి తగ్గట్టుగా సినిమాలు చేసి ఉండకపోవచ్చు. అన్ని సమయాల్లో కాలం అనుకూలంగా ఉండదు. కాలం కరుణించాలి.. ఎక్కువ సినిమాలు చేయాలి’’ అని అన్నారు అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌. ఆయన కీలక పాత్రలో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మించారు. ఆదివారం ఈ చిత్ర ప్రిరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ మూడేళ్లు నేను సినిమా చేయలేదన్న బాధ కలగలేదు. ఎందుకంటే ఏ పనిచేసినా దేశం కోసం.. జనం కోసం చేసుకుంటూ వెళ్లిపోయా. నేను ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైపోయిందన్న విషయం కూడా మర్చిపోయా. మహోన్నత స్థానాలకు వెళ్లి, నాతో సినిమా తీసిన దిల్‌రాజుగారికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ కలలు కనాలి. వాటిని సాకారం చేసేందుకు ముందుకు వెళ్లాలి. నా సినిమా పోస్టర్‌ చూసి ‘తొలిప్రేమ’ను దిల్‌రాజుగారు కొన్నారు. విజయం ఎక్కడ ఉందో ఆలోచించగల శక్తి ఆయనకు ఉంది. ఆ తర్వాత నా సినిమాలన్నీ ఆయనే డిస్ట్రిబ్యూట్‌ చేశారు. ఆయనలాంటి అద్భుతమైన నిర్మాతతో ఇంకాస్త ముందుగానే సినిమా చేయాల్సింది. వేణు శ్రీరామ్‌లాంటి స్వశక్తితో వచ్చిన దర్శకుడితో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా’’

న్యాయవాదులంటే గౌరవం

‘‘నేను నటుడిని అవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదు. (మధ్యలో సీఎం.. సీఎం అంటూ అభిమానుల అరుపులు) సీఎం అవ్వాలని ఉంటే అవుతాం. కోరుకుంటే అవదు. సమాజం కోసం.. దేశం కోసం పనిచేసుకుంటూ వెళ్లిపోతాం. ఆ దారిలో ఉన్నత స్థానానికి చేరితే సరే. మీ గుండెల్లో ఉన్న స్థానానికి మించినదేదీ నాకు లేదు. మా అన్నయ్య చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తి వల్లే రాజకీయాల్లో వచ్చా. ఇంటర్మీడియట్‌ తప్పిన నేను జ్ఞానం కోసం పుస్తకాలు చదువుతూ ఉంటాను. నాకు తెలిసిన మొదటి వకీల్‌ నానీ పాల్కీ వాలా. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఆయన పోరాడారు. అప్పటి నుంచి లాయర్‌ వృత్తిపై నాకు గౌరవం ఏర్పడింది. చుండూరులో దళితులను ఊచకోత కోస్తే వారి తరపున నిలబడిన వ్యక్తి భువనగిరి చంద్రశేఖర్‌. ఇలా మానవ హక్కుల కోసం పోరాడే న్యాయవాదులంటే నాకు అపారమైన గౌరవం. అలాంటి నాకు వకీల్‌సాబ్‌లో నటించే అవకాశం రావడం నా అదృష్టం’’

అప్పుడే మనం బాగా నటించగలం.

‘‘ఐటమ్‌ సాంగ్స్‌ కంటే దేశభక్తి సాంగ్స్‌ చేయడమంటేనే నాకు ఇష్టం. ‘కెవ్వుకేక’ పాట చేయడానికి చాలా ఇబ్బంది పడ్డా. చిన్నప్పటి నుంచి నేను అక్కాచెల్లెళ్లతో కలిసి పెరిగా, వదిన పెంపకంలో పెరిగా. అందుకే స్త్రీలను కించపరిచే సినిమా చేయలేను. ప్రతి ఆడపడుచుకూ ఇచ్చే గౌరవం ఈ సినిమా. ఈ సినిమాలో నటించిన అమ్మాయిలు నివేదా థామస్‌, అంజలి, అనన్యలు చాలా చక్కగా నటించారు. ప్రకాశ్‌రాజ్‌లాంటి గొప్ప నటుడితో నటించే అవకాశం రావడం నా అదృష్టం. రాజకీయంగా మా దారులు వేరైనా సినిమాకు వచ్చే సరికి మేమంతా ఒకటే. నాకు పోటీ లాయర్‌గా ఆయన నటించడం వల్లే నా పాత్ర ఇంకాస్త బలంగా మారింది. మనకు సవాల్‌ విసిరే నటుడు ఎదురుగా ఉన్నప్పుడే మనం ఇంకా బాగా నటించగలం. తమన్‌ సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక బృందానికి ధన్యవాదాలు’’

అలాంటి దర్శకులతోనే సినిమాలు చేస్తా!

‘‘మీరు సిమెంట్‌ ఫ్యాక్టరీలు.. పాల ఫ్యాక్టరీలు పెట్టుకుంటే లేనిది నేను సినిమాలు చేస్తే తప్పు ఏంటి? అవినీతి చేయకుండా ఉండేందుకు నేను సినిమాలు చేస్తున్నా. నేను సినిమా చేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మంది బతుకుతారు. కేవలం నేను డబ్బు సంపాదించటానికే సినిమా చేయటం లేదు. నాకు భగవంతుడు అవకాశం ఇచ్చినంత వరకూ సినిమాలు చేస్తా. నన్ను ప్రేమించే దర్శకులతోనే సినిమాలు చేస్తా. అద్భుతమైన సక్సెస్‌లో ఉన్న దర్శకులకన్నా, సినిమా పట్ల, ప్రేమ, గౌరవం ఉన్న వారితోనే సినిమాలు చేస్తా’’ అని పవన్ ‌కల్యాణ్ అన్నారు. ఏప్రిల్‌ 9న విడుదలయ్యే ‘వకీల్‌సాబ్’ను అందరూ ఆదరించాలని కోరారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని