HBD Pawan Kalyan: వ్యక్తిత్వంలో ‘పవనిజం’.. అభిమానుల అన్న‘వరం’ - pawan kalyan birth day special story
close
Published : 02/09/2021 09:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HBD Pawan Kalyan: వ్యక్తిత్వంలో ‘పవనిజం’.. అభిమానుల అన్న‘వరం’


ఆ పేరు వింటే అభిమానులు ఆనందంతో గంతులేస్తారు. ఆయన కనిపిస్తే చాలు థియేటర్‌ దద్దరిల్లిపోయేలా గోల చేస్తారు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా  ఆకాశాన్నంటే అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆ పవర్‌ పేరే పవన్‌ కల్యాణ్‌. మెగా కుటుంబం నుంచి వచ్చినా, తనకంటూ ఓ ప్రత్యేక కోటను నిర్మించుకున్న అనితర సాధ్యుడు పవన్‌ కల్యాణ్‌‌. ఇంతటి ప్రేమాభిమానాలు దక్కించుకోవడంలో ఆయన వ్యక్తిత్వానిది ముఖ్యపాత్రే.  సెప్టెంబరు 2 పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

సాధారణ జీవితం..అసాధారణ వ్యక్తిత్వం

కొన్ని చెట్లు, ఇంకొన్ని పుస్తకాలు ఉంటే చాలు పవన్‌ కల్యాణ్‌ ప్రశాంతంగా బతికేయగలడని దర్శకుడు త్రివిక్రమ్‌ ఓ సందర్భంలో చెప్పారు. ఇంత స్టార్‌డమ్‌ ఉన్నా, కోట్లలో అభిమానులున్నా ఆయనెప్పుడూ సాధారణ జీవితం గడిపేందుకే ఇష్టపడతారు. మొక్కలు పెంచుతూనో, వ్యవసాయం చేస్తూనో లేదా పుస్తకాలు చదువుతూనో కనిపిస్తారని ఆయన సన్నిహితులు చెబుతారు. వ్యవసాయ క్షేత్రంలో తనను తాను బిజీగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తాడంటారు.  సినీ పరిశ్రమ వాళ్లైనా, బయటవారైనా ఆయన్ని కలిసినప్పుడు చాలా హుందాగా మాట్లాడతారని పవన్‌ గురించి చెప్పుకుంటారు. అలా ఆ వ్యక్తిత్వానికే ఫిదా అయిపోయి అభిమానులుగా మారిన వారు లక్షల్లో ఉన్నారు.


స్నేహానికి చిరునామా

బాల్యం నుంచే ఏకాంతాన్ని ఇష్టపడే పవన్‌కు స్నేహితులు తక్కువే.  ఉన్న కొద్ది మంది స్నేహితులతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తారాయన. కమెడియన్‌ అలీతో ఆయన స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరి స్థాయితో సంబంధం లేకుండా స్నేహంగా ఉంటారాయన. అరమరికలు లేకుండా కలిసిపోతారు. ఇక దర్శకుడు త్రివిక్రమ్‌తో ఉన్న స్నేహబంధం అందరికీ తెలిసిందే. పవన్‌ మనుషులకన్నా ప్రకృతితోనే ఎక్కువ స్నేహంగా ఉంటారని అభిమానులు చెప్పుకుంటారు. 


పుస్తక పిపాసి

చిన్నప్పటి నుంచే ప్రపంచ సాహిత్యాన్ని చదవడం ప్రారంభించారు పవన్ కల్యాణ్‌‌.  సోవియట్‌ రచనలు, తెలుగు అనువాదాలు, అమెరికన్‌ సాహిత్యాలతో మొదలైన ఆయన పుస్తక ప్రయాణం వందల పుస్తకాలను చదివి అవగాహన పెంచుకునే స్థాయికి చేరింది.  ప్రపంచ సాహిత్యాన్ని అవలీలగా విశ్లేషిస్తారని చెబుతుంటారు ఆయన సన్నిహితులు.  షూటింగ్‌ సమయంలో కాస్త  ఖాళీ దొరికితే చాలు పుస్తకంలో లీనమైపోతారు పవన్‌. ఆ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో  వైరల్‌గా మారిన సందర్భాలున్నాయి.  అభిమానులకు కూడా నచ్చిన పుస్తకాలను చదవాలని సూచిస్తారు.   


అభిమానుల హీరో

పరిశ్రమలో ఏ ఇద్దరిని కదిలించినా ఒకరు పవన్‌ కల్యాణ్‌ అభిమాని అయ్యే ఉంటారనేది ఇండస్ట్రీలో వినిపించే మాట. అలా దర్శకులు, నిర్మాతలే కాదు, హీరోలు కూడా ఆయన అభిమానులుగా ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. పవన్‌ స్ఫూర్తితోనే హీరో అయిన నటుల్లో నితిన్‌ ఒకరు. ఇష్క్‌ ఆడియో వేడుకకు అతిథిగా పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానించారు. ఆయన అభిమానిగానే వేడుకగా ఆహ్వానించి పవన్‌పైనున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇక  నిర్మాత బండ్ల గణేశ్‌ ఎంతటి వీరాభిమానో అందరికీ తెలిసింది. ఫ్లాప్‌లతో సతమవుతున్న బండ్ల గణేశ్‌కి ‘గబ్బర్‌ సింగ్‌’ అవకాశమిచ్చి బ్లాక్‌ బస్టర్‌ నిర్మాతగా మార్చిన హీరో పవన్‌. హరీశ్ శంకర్‌ కూడా పవన్‌కు వీరాభిమానే. నిజజీవితంలో వందల కిలోమీటర్ల వెళ్లి కష్టాల్లో ఉన్న అభిమానులను కలుసుకొని పరామర్శించిన సందర్భాలూ ఉన్నాయి.


పోరాట పటిమే ప్రత్యేకంగా నిలిపింది

ఆయన హిట్టు కొడితే ఎలా ఉంటుందో ‘గబ్బర్‌ సింగ్’‌, ‘అత్తారింటికి దారేది’ లాంటి సినిమాలతో నిరూపించారు. అందుకే పవన్‌ అనితర సాధ్యుడయ్యాడు. నిజజీవితంలోని ఈ పోరాట పటిమే ఆయన్ను ప్రత్యేకంగా నిలిపిందంటారు అభిమానులు.


సేవకు కదిలే సేనాని

స్టార్‌ హీరోగా వెలుగు వెలగడంతోనే ఆయన ఆగిపోలేదు. సమాజానికి తనవంతు బాధ్యతగా ఏదైనా చేయాలని ఆశిస్తారు పవన్‌. విపత్తులు వచ్చిన ప్రతిసారి ఆయనే ముందుగా విరాళాలు ఇచ్చిన సందర్భాలున్నాయి. ఇక పరిశ్రమలో ఆయన సాయం పొందినవారు చాలా మందే ఉన్నారు. చిన్నాచితకా ఆర్టిస్టులను ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సమాజంలో అన్యాయాలపై కూడా స్పందించి పరిష్కారాలు చూపిన ఘటనలూ ఉన్నాయి. అందుకే సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ పవన్‌ కల్యాణ్‌ హీరో.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని