అప్పులు చేసి అభివృద్ధి అంటే ఎలా?: పవన్‌ - pawan kalyan comments on ysrcp govt
close
Published : 25/07/2020 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పులు చేసి అభివృద్ధి అంటే ఎలా?: పవన్‌

రాజకీయ వ్యవస్థ తప్పులకు అధికారుల బలి
ఒక డీజీపీ ఇన్ని సార్లు కోర్టుకు వెళ్లడం చూడలేదు
జనసేన అధినేత వ్యాఖ్యలు

అమరావతి: రాజకీయ వ్యవస్థ చేసే తప్పులకు ఏపీలో అధికారులు బలైపోతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్ర చరిత్రలో డీజీపీ ఇన్నిసార్లు కోర్టుకు వెళ్లడం ఎన్నడూ జరగలేదని చెప్పారు. అప్పులు చేసి ప్రజలకు పంచి పెట్టడాన్ని అభివృద్ధి అని ఎవరూ అనరని వ్యాఖ్యానించారు. ఈ మేరకు పలు అంశాలపై జనసేన సామాజిక మాధ్యమ విభాగానికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 

‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో దాదాపు 62 కేసుల్లో వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. పోలీసులు, రెవెన్యూ వ్యవస్థలు అనేవి సమాంతర వ్యవస్థలు. వీరంతా ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపిస్తుంటే వాళ్లలాగే ప్రవర్తిస్తుంటే దాన్ని కోర్టులు చూస్తూ ఎలా ఊరుకుంటాయి? ప్రభుత్వం తన విధానాలు సరి చేసుకోకపోతే మాత్రం బలమైన ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకిగాని కొమ్ముగాస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో అగ్రరాజ్యం అయిన అమెరికాలోనే చూశాం. అలాంటి పరిస్థితులు ఇక్కడ రావనుకుంటే ఎలా? ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి అధికారుల్ని గుప్పిట పెట్టుకుంటే ఎవరూ ఎదురు తిరగరని అనుకోవడం పొరపాటు. రాష్ట్ర చరిత్రలో డీజీపీ ఇన్నిసార్లు హైకోర్టుకు వెళ్లడం ఎప్పుడూ జరగలేదు. అధికారులు సైతం నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో మాకు తెలియడం లేదని వాపోతున్నారు. అలా వారు నిస్సహాయులుగా ఉండిపోవడం బాధ కలిగిస్తోంది. 151 సీట్లు సాధించడం ద్వారా చాలా బలమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది. వాళ్లకున్న బలాన్ని రాజకీయ కక్షల కోసమో, కేవలం కొన్ని గ్రూపుల కోసమో, ఓటు బ్యాంకు కోసమో వినియోగించాల్సిన అవసరం లేదు. ప్రజలిచ్చిన వరాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదనే నా అభిప్రాయం. ఇన్ని కేసుల్లో హైకోర్టు నుంచి ఆక్షేపణలు ఎదుర్కోవడం గురించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వం చేసే పనుల్లో తప్పులున్నాయని అర్థం చేసుకోవాలి’’ అని పవన్‌ అన్నారు.

అప్పులు చేసి అభివృద్ధి అంటే ఎలా?
‘‘గత ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రానికి చాలా అప్పులు ఉన్నాయి. వైకాపా దాన్ని ఇంకా ఎక్కువ చేసింది. ఆదాయం పెంచే మార్గాలు వెతకాలి గానీ, అప్పులు పెంచే మార్గాలు వెతికి దాన్ని అభివృద్ధి అనడం సమంజసం కాదు. దీని వల్ల ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకు ఏమీ కాదు. ఓ విధంగా భవిష్యత్ తరాల జీవితాన్ని పణంగా పెట్టడమే అవుతుంది. అప్పులు తీసుకువచ్చి ప్రజలకు ఇచ్చే పరిస్థితి ఉంటే దాన్ని తిరోగమనం అనాలి. ఇంకా నాలుగేళ్లు ఉంది కాబట్టి వైకాపా నాయకులు కళ్లు తెరిచి అభివృద్ధి వైపు వెళ్లాలి’’ అని పవన్‌ సూచించారు.

మనమే జాగ్రత్తగా ఉండాలి..
‘‘ప్రధాని మోదీ కరోనా లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నామని చెప్పినప్పుడు ఆ సీరియస్‌నెస్‌ దేశం మొత్తానికి వచ్చింది. కరోనా తీవ్రతను అర్థం అయ్యేలా చెప్పడంతో 100 కోట్లకు పైగా ఉన్న ప్రజలంతా ఆగిపోయారు. నాయకత్వం బలంగా ఉంటే ప్రజలు వింటారు. అదే ఏపీ విషయానికొస్తే.. ‘చిన్న ఫ్లూ లాంటిది’ అని తేలికగా తీసుకున్నారు. అదే ఆలోచనా విధానం కింది స్థాయి వరకు వెళ్తుంది. నిబద్ధత కోల్పోవడం వల్లే రాష్ట్రంలో 700 మందికి పైగా చనిపోయారు. ఇన్ని వేల కేసులు రావడానికి ఆంధ్రప్రదేశ్ కరోనాను హ్యాండిల్ చేసిన విధానం ఒక తప్పు. ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి వచ్చేసింది. ప్రజలే బాధ్యతగా మెలగాలి. కేవలం ప్రభుత్వాల మీద ఆధారపడితే ఇబ్బందులు ఉంటాయి.’’

శ్వేతపత్రాలు విడుదల చేయాలి..
‘‘కార్పొరేషన్‌ నిధులు నిర్దేశిత గ్రూపులకే ఇవ్వాలి. వైకాపా ప్రభుత్వం తమ పథకాలకు ఫండ్స్ మళ్లించారు. కాపు కార్పొరేషన్ నిధులు కూడా ఇలానే చేశారు. అందుకే మేం శ్వేతపత్రం అడిగాం. కానీ వాళ్లు ఈ రోజుకీ దాని మీద స్పష్టత ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో జగన్ ఎలాంటి మొహమాటం లేకుండా మేం కాపులకి రిజర్వేషన్లు ఇవ్వం అని చెప్పారు. అయినా ప్రజలు ఆయన్ని ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు కూడా మరోసారి అదే మాట - కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదని చెబితే అందరికీ స్పష్టత వస్తుంది. అలాగే ఇతర కార్పొరేషన్ల ఫండ్స్ మీద శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది.’’

విద్యావ్యవస్థపై చర్చించాలి 

‘‘కరోనా నేపథ్యంలో ఆర్థికంగా బలంగా ఉన్న స్కూల్స్ ఆన్ లైన్ క్లాసులు నడుపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విషయానికి వస్తే ఆ పరిస్థితి లేదు. ఒక విద్యా సంవత్సరం పోతుందని నాకు అనిపిస్తోంది. ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం. దీని మీద ఎవరూ చర్చించడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళికే లేదనిపిస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో విద్యా సంవత్సరం పరిస్థితి గురించి ఆలోచన చేయాల్సింది. ఓ వైపు ఆన్‌లైన్‌ తరగతుల వల్ల పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మరోవైపు స్కూల్స్‌ తెరవకపోయినా అధిక మొత్తంలో ఫీజులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు దీనిపై దృష్టి పెట్టాలి. అలాగే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య వ్యవస్థ ప్రక్షాళనకు కృషి చేయాలని కోరుకుంటున్నా’’ అని పవన్‌ అన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని